Hindu Rituals: శుభకార్యాల్లో ఆడవాళ్ల గొంతుకు గంధం ఎందుకు రాస్తారో తెలుసా..? గంధం రాయడంలో ఉన్న శాస్త్రీయ కోణం ఎంటో తెలుసా..? గంధం రాయించుకున్న స్త్రీలకు కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలేంటో తెలుసా..? ఇలాంటి ఇంట్రస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయంలో గంధానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు గంధం పెట్టుకోవడం అనవాతిగా వస్తున్న ఆచారం. సనాతన భారతీయ ధర్మంలో మహిళలు అయినా పురుషులు అయినా గంధాన్ని బొట్టుగా పెట్టుకునే ఆచారం ఉంది. అలాగే శుభకార్యాల్లోనూ పూజా సమయాల్లోనూ మహిళలు తమ గొంతుకు గంధాన్ని రాసుకోవడం కూడా అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఆడవారు గొంతుకు గంధం రాసుకోవడంలో ఎంతో పరమార్థం ఉందంటున్నారు పండితులు. మహిళలు గొంతుకు గంధం రాసుకుంటే వారికి శాస్త్రీయ కోణంలోనే కాదు ఆధ్యాత్మికంగానూ ఎన్నో రకాలైన ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు పండితులు. గంధం రాసుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ హిందూ సాంప్రదాయంలో గంధం లేకుండా ఎటువంటి శుభకార్యం జరగదు. అలాగే సనాతన ధర్మానుసారం ప్రతి కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యంలోనూ స్త్రీలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. శుభకార్యానికి వచ్చే చుట్టాలు బంధువులు, స్నేహితులు, అతిథులను సాదరంగా ఆహ్వానించడం నుంచి వారు శుభకార్యం అయిపోయాక వెళ్లిపోయే వరకు జరగవసిన కార్యక్రమాలన్నీ స్త్రీలే స్వయంగా నిర్వహిస్తారు. అలాంటి స్త్రీలు గొంతుకు గంధం పెట్టుకోవడం వల్ల వారి మాట తీరులో సరళత్వం వస్తుంది. అలాగే వచ్చిన చుట్టాలందరితో కలివిడిగా మాట్లాడే నైజం అబ్బుతుంది. ఇంకా చెప్పాలంటే గంధం పెట్టుకున్న మహిళ ఇంట్లో ఎన్ని పనులు చేసినా అలుపన్నది ఎరుగదట.
ఇక శుభకార్యాల్లోనే కాకుండా స్త్రీలు ప్రతిరోజు పూజ చేసినప్పుడు కూడా గంధం గొంతుకు రాసుకోవాలని హిందూ పండితులు చెప్తున్నారు. అలా చేయడం వల్ల కుటుంబంలో ఆ మహిళలకు ఎటువంటి సమస్యలు రావంటున్నారు. ఇంట్లో భర్త, అత్త , మామ లాంటి వారితో ఎంతో అభిమానంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు సరళంగా సౌమ్యంగా మాట్లాడాలి. గంధం మెడకి రాయటం ద్వారా గొంతు సరళంగా వస్తుంది. సున్నితంగా సరళంగా తీయగా మాట్లాడటం వల్ల ఆమెపై ఇంట్లో వాళ్లకు గౌరవ అభిమానాలు పెరుగుతాయి. ఒక్కోసారి చెప్పే విషయం వినయంగా వినమ్రతగా ఉన్నా మాట గట్టిగా కఠినంగా ఉంటే తమను ఎదిరించేలా మాట్లాడుతుందని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంటుందట. స్త్రీ రూపానికి తగ్గట్టు స్వరము ఉండాలని గంధం రాస్తారట.
గంధం రాసుకోవడం వల్ల శరీరానికి చల్లదనం ఇస్తుంది. దీంతో బాడీలోని టెంపరేచర్‌ను తగ్గించడంలో గంధం సహాయపడుతుంది. అలాగే గొంతు సమస్యలు రాకుండా అరికట్టడంలోనూ గంధం కీలకంగా వ్యవహరిస్తుందట. అలాగే గొంతుకు గంధం రాసుకోవడం వల్ల శరీరంలోని దుష్టశక్తులు దూరం అవుతాయట. దీంతో ఆ స్త్రీకి ఆధ్యాత్మికమైన ప్రశాంతత చేకూరతుందట. ఇక శుభకార్యాలలో ఆడవాళ్లు ఒకరికొకరు గొంతుకు గంధం పెట్టుకోవడంతో వారి మధ్య అభిమానం, ప్రేమ పెరుగుతుందట. కుటుంబంలో ఏవైనా గొడవలు ఉన్నా.. గంధం పెట్టుకోవడంతో అవన్నీ సద్దుమణుగుతాయంటున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఆగస్టు 9 నుండి బుధుని శుభ ప్రభావం – 5 రాశులకు అదృష్ట కాలం