2026 Maruti Baleno Facelift Launched: మారుతి సుజుకి బాలెనోకు కొత్త లుక్ ఇచ్చింది. తాజాగా బాలెనో ఫేస్ లిఫ్ట్ ను విడుదల చేసింది. రూ.6.10 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కారు డిజైన్ లో కొన్ని మార్పులు చేయడంతో పాటు కొత్త ఇంజిన్, అదనపు సౌకర్యాలు, భద్రతా ఫీచర్లను యాడ్ చేసింది. ముఖ్యంగా బాలెనోలో లెవెల్-2 ADASను తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉపయోగించిన నాలుగు సిలిండర్ల ఇంజిన్ స్థానంలో కొత్త 1.2 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను పరిచయం చేసింది.
పాత బాలెనోలో ఉన్న 90hp, 113Nm సామర్థ్యం కలిగిన 1.2 లీటర్ K12N నాలుగు సిలిండర్ ఇంజిన్‌కు బదులుగా కొత్త Z12E 1.2 లీటర్ 3 సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వచ్చింది. కొత్త ఇంజిన్ 83hp పవర్, 112Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లో ఎండ్ టార్క్ మెరుగ్గా ఉండేలా ఇంజిన్ ను ప్రత్యేకంగా ట్యూన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ట్రాన్స్ మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు 5 స్పీడ్ AMT ఆప్షన్ కూడా ఉంది. బాలెనోలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG ఆప్షన్ కొనసాగుతోంది. CNG మోడ్ లో ఇంజిన్ 70hp పవర్, 102Nm టార్క్ ను అందిస్తుంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.
2026 బాలెనోలో చేసిన డిజైన్ మార్పులు ఎక్కువగా ముందు భాగంలో కనిపిస్తాయి. కొత్త గ్రిల్ ఇప్పుడు ADAS కోసం అవసరమైన రాడార్ మాడ్యూల్‌ను కూడా కలిగి ఉంటుంది. సుజుకి లోగోను గ్రిల్ మధ్య నుంచి పైభాగానికి మార్చారు. కొత్త గ్రిల్‌కు తగ్గట్టుగా బంపర్‌ను కూడా రీడిజైన్ చేశారు. LED ఫాగ్ ల్యాంప్‌ల డిజైన్ మారింది. ముందు ఫెండర్లపై క్రోమ్ గార్నిష్, షార్క్-ఫిన్ యాంటెన్నా కూడా కొత్తగా వచ్చాయి. అయితే LED హెడ్‌లైట్లు, మూడు బ్లాక్ DRL డిజైన్, 16 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, టెయిల్ ల్యాంప్స్ లాంటి అంశాలు కొనసాగుతున్నాయి.
క్యాబిన్ డిజైన్‌లో పెద్ద మార్పులు చేయలేదు. 9-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో లేయర్డ్ డ్యాష్‌బోర్డ్ కొనసాగుతోంది. అనలాగ్ డయల్స్ మధ్య కలర్ MID, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్, ఫిజికల్ క్లైమేట్ కంట్రోల్ బటన్లు, HUD వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కొత్తగా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కూలింగ్ ఫంక్షన్‌తో వైర్‌లెస్ ఛార్జర్, క్లారియన్ సౌండ్ సిస్టమ్ వచ్చాయి. ముఖ్యంగా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఈ సెగ్మెంట్ లో ఆకట్టుకుంటున్నాయి.
కొత్త బాలెనోలో అతిపెద్ద అప్‌గ్రేడ్ లెవెల్-2 ADAS. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై-బీమ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు కొత్తగా TPMS కూడా లభిస్తుంది. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, EBDతో ABS, 360 డిగ్రీ కెమెరా లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
2026 బాలెనో ఫేస్‌లిఫ్ట్ టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20, టయోటా గ్లాంజా వంటి కార్లతో పోటీ పడుతుంది.
Read Also: క్రెటా To స్కార్పియో-N.. రూ.20 లక్షల్లో బెస్ట్ SUVలు ఇవే!