Maruti Suzuki Cars Price Hike 2026: మారుతి సుజుకి కార్లు కొనాలనుకునే వారికి మరోసారి షాక్ తగిలింది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన కార్లపై గరిష్టంగా రూ.20,000 వరకు ధర పెంచుతున్నట్లు తెలిపింది. ఈ పెంపు సెప్టెంబర్ 2026 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటికే గత నెలలో దాదాపు రూ.30,000 వరకు ధరలను పెంచిన కంపెనీ.. ఇప్పుడు మరోసారి ధరలు పెంచడంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు.
కార్ల తయారీలో ఉపయోగించే ఇన్ ఫుట్స్ ధరలు భారీగా పెరుగుతున్నాయని మారుతి సుజుకి తెలిపింది. దీనికి తోడు ద్రవ్యోల్బణ ప్రభావం కూడా కంపెనీపై ఒత్తిడి పెంచుతున్నాయి. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించేందుకు సంస్థ ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మొత్తం భారాన్ని కంపెనీ ఒక్కటే భరించడం కష్టంగా మారిందని తెలిపింది. అందుకే పెరిగిన ఖర్చులో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయాల్సి వస్తోందని వివరించింది.
మే 2026 నుంచి మారుతి సుజుకి ఏకంగా మూడుసార్లు ధరలను పెంచింది. అయితే గత రెండు సార్లు కంపెనీ అన్ని కార్లపై ధరలు పెంచింది. తాజా పెంపు మాత్రం ఎంపిక చేసిన మోడళ్లకు మాత్రమే వర్తించనుంది. ఏయే మోడళ్ల ధరలు పెరుగుతాయనే విషయాన్ని కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. దీంతో మారుతి కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు కొత్త ధరల జాబితా కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.
మారుతి సుజుకి ప్రస్తుతం అరేనా, నెక్సా బ్రాండ్ల ద్వారా పెద్ద సంఖ్యలో కార్లను విక్రయిస్తోంది. అరేనా లైనప్ లో ఆల్టో K10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్‌ఆర్, ఈకో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, విక్టోరిస్ మోడళ్లు ఉన్నాయి. అదే సమయంలో నెక్సా పరిధిలో ఇ-విటారా, ఇన్విక్టో, జిమ్నీ, XL6, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, బాలెనో లాంటి కార్లు ఉన్నాయి. వీటిలో ఏ మోడళ్లపై తాజా ధరల పెంపు ఉంటుందో కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు.
ముడిసరుకు ధరలు, సరఫరా సమస్యల కారణంగా ఇతర కార్ల కంపెనీలు కూడా ధరలను పెంచుతున్నాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్ లాంటి సంస్థలు కూడా ఇటీవల ధరల పెంపును ప్రకటించాయి. దీంతో కార్ల తయారీ సంస్థలపై పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థల్లో మార్పులు వస్తున్న నేపథ్యంలో భారత్‌ను బలమైన తయారీ కేంద్రంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని మారుతి సుజుకి ఎండీ, సీఈఓ హిసాషి టకేయుచి ఇప్పటికే వెల్లడించారు. సెమీకండక్టర్ కొరత, భౌగోళిక రాజకీయ సమస్యలు వంటి కారణాలతో ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడ్డాయన్నారు. అందుకే దేశీయంగా తయారీ సామర్థ్యాలను పెంచడంతో పాటు, సరఫరా వ్యవస్థలో స్థానిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కంపెనీ చూస్తోంది.
Read Also: కార్నివాల్ హైబ్రిడ్ To న్యూ సోనెట్.. కియా నుంచి రాబోతున్న 10 క్రేజీ కార్లు ఇవే!