Ather Sales 2026: ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ లో ఏథర్ ఎనర్జీ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2026లో ఇప్పటి వరకు తొలిసారిగా 3 లక్షల వార్షిక అమ్మకాల మైలురాయిని దాటేసింది. టీవీఎస్, బజాజ్ తర్వాత ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన మూడో ఇండియన్ ఈవీ తయారీదారుగా నిలిచింది.
వాహన్ (Vahan) లెక్కల ప్రకారం.. 2026 జనవరి 1 నుంచి నవంబర్ 6 వరకు ఏథర్ మొత్తం 3,01,133 ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలుదారులకు డెలివరీ చేసింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో 67 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ వాటా కూడా 16.32 శాతానికి చేరింది. 2025లో నమోదైన 16.12 శాతం వాటితో పోలిస్తే ఇది కంపెనీకి మంచి రిజల్ట్ గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి 3.50 లక్షల స్కూటర్ల అమ్మకాలను చేరుకోవాలని ఏథర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే సాధించిన అమ్మకాలు చూస్తుంటే ఈ లక్ష్యానికి చేరువయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
2026లో ఏథర్‌కు మార్చి నెల బాగా కలిసి వచ్చింది. ఆ నెలలో ఏకంగా 36,630 స్కూటర్లను అమ్మింది. అక్టోబర్‌లో కూడా 31,941 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అక్టోబర్ 2025 నుంచి ఇప్పటివరకు ఆరు సార్లు నెలవారీ అమ్మకాలు 30 వేల యూనిట్ల మార్కును దాటాయి. ఈ ఏడాది నవంబర్ 6 వరకు 7,109 స్కూటర్లను విక్రయించింది. సెప్టెంబర్ నాటికి కంపెనీ మొత్తం అమ్మకాలు 8 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించాయి. 2018 నుంచి 2026 సెప్టెంబర్ వరకు మొత్తం 8,43,276 యూనిట్లను విక్రయించినట్లు వాహన్ డేటా వెల్లడిస్తోంది.
ఆగస్టు 29న ఏథర్ కొత్త కోనార్క్ (Konarc) మోడల్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ద్వారా అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ భావించింది. అయితే, తయారీ సామర్థ్యం సరిపోకపోవడంతో షోరూమ్‌లకు వాహనాల సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కోనార్క్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు.
ప్రస్తుతం ఏథర్ సాధించిన రికార్డు అమ్మకాల్లో 450S, 450X, రిజ్టా మోడళ్లది కీలక పాత్ర ఉంది. కోనార్క్ విషయంలోనూ కంపెనీ వేరియంట్ల విడుదలను మార్చింది. ముందుగా మిడ్ వేరియంట్లపై దృష్టి పెట్టగా, బేస్ వేరియంట్ 2027 మొదటి త్రైమాసికంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా స్కూటర్లను అందించేందుకు ఏథర్ ప్రయత్నిస్తోంది. ఛత్రపతి శంభాజీనగర్‌లో ఏర్పాటు చేస్తున్న కొత్త తయారీ కేంద్రం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే సరఫరా సమస్యలు తగ్గి, కోనార్క్ వంటి కొత్త మోడళ్ల అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉంది. 2026 ఏథర్‌కు ఇప్పటి వరకు అత్యంత సక్సెస్ ఫుల్ ఇయర్ గా చెప్పవచ్చు.
Read Also: రూ.75 వేలకే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంగ్ రేంజ్ ఇచ్చే టాప్ 5 మోడళ్లు ఇవే!