Driving Licence Valid Till Age 50: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా, రెన్యువల్ చేసుకోవాలనుకున్నా, వెహికల్ ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్ చేయాలన్నా.. ప్రజలు ట్రాన్స్ పోర్ట్ ఆఫీసుల (ఆర్టీఓ) చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ ప్రక్రియను ఇక మరింత వేగంగా, సులభంగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టాని భావిస్తోంది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ పెంచడం, పలు సర్వీసులను పూర్తిగా ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురావడంపై రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది.
ప్రస్తుతం సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కు 20 సంవత్సరాల వరకు లేదంటే 40 ఏళ్ల వయస్సు వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత దానిని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కొత్త ప్రతిపాదన ప్రకారం, ఒకసారి లైసెన్స్ పొందిన వ్యక్తికి 50 ఏళ్లు వచ్చే వరకు చెల్లుబాటులో ఉండేలా మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కోట్లాది మంది వాహనదారులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.
అంతేకాకుండా, వెహికల్ ట్రాన్స్ ఫర్ ప్రక్రియను కూడా పూర్తిగా డిజిటల్ విధానంలోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలు, విక్రయాల సమయంలో ఆర్టీఓ కార్యాలయాలను సంప్రదించాల్సి వస్తోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే అవసరమైన పత్రాలు, ఫీజులు, ధ్రువీకరణ ప్రక్రియ అంతా ఆన్ లైన్ లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. వాహనాల పర్మిట్ల పునరుద్ధరణను కూడా డిజిటల్ ప్లాట్ ఫారమ్ ద్వారా నిర్వహించే ప్రతిపాదనపై అధికారులు పని చేస్తున్నారు. దీంతో ట్రాన్స్ పోర్ట్ రంగానికి చెందిన వ్యాపారులు, వాహన యజమానులు సమయం, ఖర్చు రెండింటినీ ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
కేంద్రం తీసుకురానున్న మార్పులతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయంపై ఎలాంటి ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే లైసెన్స్ లు, పర్మిట్లు, ఇతర సర్వీసులకు సంబంధించిన ఫీజులు ఆన్‌లైన్ ద్వారానే వసూలు చేయవచ్చు. ప్రభుత్వ ఆదాయం కొనసాగుతూనే, ప్రజలకు సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి.
అటు రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి మరో కీలక ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్లకు ‘నెగటివ్ పాయింట్స్’ కేటాయించే విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ఒక డ్రైవర్ పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే, అతని లైసెన్స్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం లేదంటే రద్దు చేయడం లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే, ఆర్టీఓ కార్యాలయాలపై భారం తగ్గడంతో పాటు ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా రవాణా సేవల నిర్వహణలో కొత్త మార్పులకు నాంది పలకనున్నట్లు తెలుస్తోంది.
Read Also: E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏంటి? ఎలా తయారవుతుంది? దీని వల్ల కలిగే లాభాలేంటి?