Tata Motors July 2026 Sales: టాటా మోటార్స్ జూలై 2026లో అమ్మకాల్లో సత్తా చాటింది. తాజాగా జూలై నెలకు సంబంధించి ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ డీటైల్స్ రిలీజ్ చేసింది. గత నెలలో దేశీయ మార్కెట్ తో పాటు ఎగుమతులను కలిపి మొత్తం 63,760 కార్లను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది. గత ఏడాది జూలైలో ఈ సంఖ్య 40,175 యూనిట్లు మాత్రమే ఉండగా, ఈసారి ఏకంగా 59 శాతం వృద్ధి సాధించింది. అంటే, ఒక్క ఏడాదిలోనే టాటా మోటార్స్ అదనంగా 23,585 కార్లను అమ్మింది.
ఈసారి కంపెనీ అమ్మకాలలో ఎలక్ట్రిక్ కార్లు కూడా కీలక పాత్ర పోషించాయి. జూలైలో అమ్మిన మొత్తం కార్లలో 15,217 ఎలక్ట్రిక్ వాహనాలుఉండగా, మిగిలిన 48,543 వాహనాలు పెట్రోల్, డీజిల్, ఇతర ICE మోడళ్లు. అంటే మొత్తం అమ్మకాలలో సుమారు 24 శాతం వాటా ఎలక్ట్రిక్ కార్లదే కావడం విశేషం. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే టాటా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. జూలై 2025లో కంపెనీ కేవలం 7,124 ఈవీలను మాత్రమే అమ్మగా, ఈసారి ఆ సంఖ్య 15,217కు చేరుకుంది. దీంతో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఏకంగా 114 శాతం వృద్ధి సాధించాయి. అలాగే మొత్తం అమ్మకాలలో EVల వాటా కూడా గత ఏడాది 18 శాతం నుంచి ఈసారి 24 శాతానికి పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో కూడా టాటా మోటార్స్ మంచి ఫలితాలు సాధించింది. జూలై 2026లో భారత మార్కెట్లో మొత్తం 62,611 కార్లను విక్రయించగా, గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 39,521 మాత్రమే. దీంతో దేశీయ అమ్మకాల్లో 58 శాతం వృద్ధి నమోదైంది. ఎగుమతుల పరంగా కూడా కంపెనీ సత్తా చాటింది. గత ఏడాది జూలైలో 654 కార్లు మాత్రమే విదేశాలకు ఎగుమతి చేయగా, ఈసారి ఆ సంఖ్య 1,149 యూనిట్లకు చేరుకుంది. అంటే, ఎగుమతుల్లో 76 శాతం పెరుగుదల కనిపించింది. అయితే, మొత్తం అమ్మకాలలో ఎగుమతుల వాటా మాత్రం ఇంకా చాలా తక్కువగానే ఉంది. జూలైలో విక్రయించిన మొత్తం కార్లలో కేవలం 1.8 శాతం మాత్రమే విదేశాలకు వెళ్లాయి.
ప్రస్తుతం టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ద్వారా భారత మార్కెట్లో ఏడు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఈ శ్రేణిని మరింత విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి వార్షిక కార్ల అమ్మకాలను 6.4 లక్షల నుంచి 12 లక్షల యూనిట్లకు పెంచాలని టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ వృద్ధిలో దాదాపు 47 శాతం ఎలక్ట్రిక్ కార్ల నుంచే వస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ఏడు EV మోడళ్లను పది మోడళ్ల వరకు పెంచాలని భావిస్తోంది.
Read Also: 2030 నాటికి కియా నుంచి 8 ఎలక్ట్రిఫైడ్ కార్లు.. EV, హైబ్రిడ్, CNGపై భారీ ప్లాన్!