Hero Vida Electric Scooter Sales: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందడంతో పాటు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉండటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హీరో మోటోకార్ప్ కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ విడా సరికొత్త రికార్డు సృష్టించింది. 2026 క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు సేల్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేసింది.
హీరో విడా 2026 జనవరి 1 నుంచి అక్టోబర్ 29 వరకు మొత్తం 2,00,143 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 2 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకోవడం ఇదే తొలిసారి. 2025 పూర్తి సంవత్సరంలో విడా 1,13,021 స్కూటర్లను విక్రయించింది. అంటే, గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు భారీగా పెరిగాయి.
విడా బ్రాండ్‌కు అక్టోబర్ 2026 అత్యంత విజయవంతమైన నెలగా నిలిచింది. ఈ ఒక్క నెలలోనే 27,435 ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో విక్రయించిన 16,499 యూనిట్లతో పోలిస్తే 66 శాతం వృద్ధి నమోదైంది. అంతకు ముందు సెప్టెంబర్‌లో 24,435 యూనిట్ల అమ్మకాలతో నెలవారీ రికార్డు సృష్టించగా, అక్టోబర్‌లో ఆ రికార్డును కూడా అధిగమించింది.
2026లో విడా అమ్మకాలు ప్రతి మూడు నెలలకూ పెరుగుతూ వచ్చాయి. జనవరి నుంచి మార్చి వరకు 49,043 యూనిట్లు, ఏప్రిల్ నుంచి జూన్ వరకు 57,059 యూనిట్లు, జూలై నుంచి సెప్టెంబర్ వరకు 66,606 యూనిట్లకు పెరిగాయి. ఇదే వేగం కొనసాగితే 2026 పూర్తి సంవత్సరంలో 2.5 లక్షల నుంచి 2.6 లక్షల స్కూటర్ల అమ్మకాలు సాధించే అవకాశం ఉంది.
ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో విడా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. 2026లో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా అమ్ముడైన 17.7 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో విడా వాటా సుమారు 11 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వాటా 8 శాతంగా ఉండేది. ప్రస్తుతం టీవీఎస్, బజాజ్, ఏథర్ తర్వాత నాలుగో స్థానంలో విడా కొనసాగుతోంది.
ప్రస్తుతం విడా లైనప్‌లో VX2 Go, VX2 Plus, V2 Pro, V2 Plus మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు యూత్ ను ఆకట్టుకునేలా DIRT.E K3 ఎలక్ట్రిక్ యూత్ మోటా ర్సైకిల్ను కూడా కంపెనీ అందిస్తోంది. విడా అమ్మకాల వృద్ధి, ఉత్పత్తి సామర్థ్యం పెంపు దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ విస్తరిస్తున్న తీరును తెలియజేస్తున్నాయి.
Read Also: బజాజ్ చేతక్ కు భారీ డిమాండ్.. ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీ బిగ్ ప్లాన్!