Hyundai Ioniq P EV: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా, భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఓ కొత్త ఎలక్ట్రిక్ SUVని సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం HE1i అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVకి ఐయోనిక్ P (Ioniq P) అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఈ పేరును హ్యుందాయ్ ఇండియా ఇంకా అధికారికంగా కన్ఫార్మ్ చేయలేదు. అక్టోబర్ 29న జరిగిన Q3 ఆర్థిక ఫలితాల సమావేశంలో హ్యుందాయ్ యాజమాన్యం ఐయోనిక్ P పేరును ప్రస్తావించింది. బేయాన్ మోడల్ తర్వాత భారత మార్కెట్లో ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కారు 2027 జనవరిలో అధికారికంగా ఆవిష్కరణకు వచ్చే అవకాశం ఉంది.
హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ SUVని E-GMP (K) ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే ప్లాట్‌ఫామ్‌ను అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఇన్ స్టర్ EVలో కూడా ఉపయోగిస్తున్నారు. ఐయోనిక్ P రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో స్టాండర్డ్ రేంజ్, లాంగ్ రేంజ్ వెర్షన్లు ఉండవచ్చు. అయితే బ్యాటరీ సామర్థ్యం, డ్రైవింగ్ రేంజ్ లాంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇన్‌స్టర్ EVలో 42kWh, 49kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి గరిష్టంగా 355 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఐయోనిక్ P లోనూ ఇలాంటి బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVలో నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించనున్నట్లు హ్యుందాయ్ ఇప్పటికే వెల్లడించింది. ఇందులో కంపెనీకి చెందిన ప్లియోస్ కనెక్ట్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. అలాగే లెవెల్ 2 అసిస్టెడ్ డ్రైవింగ్ టెక్నాలజీని కూడా అందించనున్నారు. ప్రయాణ సమయంలో డ్రైవర్‌కు మరింత సౌకర్యం, భద్రత కల్పించేలా ఈ ఫీచర్లను రూపొందిస్తున్నారు. అయితే, పూర్తి ఫీచర్ల వివరాలు కారు ఆవిష్కరణ సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
హ్యుందాయ్ ఐయోనిక్ Pను తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ తయారీ ప్లాంట్ లో ఉత్పత్తి చేయనుంది. ప్రారంభంలో ఈ కారులో దిగుమతి చేసుకున్న బ్యాటరీ సెల్స్ ను ఉపయోగించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ తో భాగస్వామ్యం ద్వారా భారత్‌లో తయారైన బ్యాటరీ సెల్స్ ను ఉపయోగించాలని హ్యుందాయ్ భావిస్తోంది. దీనివల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గడంతో పాటు దిగుమతులపై ఆధారపడటం కూడా తగ్గుతుంది.
భారత మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఐయోనిక్ Pకు టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV 3XO EV, కియా సైరోస్ EV లాంటి మోడళ్లతో పోటీ ఉండనుంది.భారత్ లో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, సరసమైన ధరలో కొత్త EVని తీసుకురావడం ద్వారా మార్కెట్లో తన వాటాను పెంచుకోవాలని హ్యుందాయ్ భావిస్తోంది.
Read Also: ఆరేళ్లలో 3.5 లక్షల అమ్మకాలు.. టాటా ఆల్ట్రోజ్ సరికొత్త రికార్డు..