Tata Punch South Africa Launch: టాటా మోటార్స్ తన పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పంచ్ ను దక్షిణాఫ్రికా మార్కెట్లో విడుదల చేసింది. అక్కడ ఈ కారును మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధర 224,900 దక్షిణాఫ్రికా రాండ్లు. అంటే, భారత కరెన్సీలో ఇది సుమారు రూ.12.82 లక్షలు. ఈ మోడల్‌లో 1.2 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. అయితే, రెండు ఇంజిన్లకు మాన్యువల్ గేర్ బాక్స్ లను మాత్రమే అందిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో టాటా పంచ్‌ను ప్యూర్+, అడ్వెంచర్, అకంప్లిష్డ్+ అనే మూడు ట్రిమ్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ప్యూర్+ 1.2P 5MT ధర 224,900 రాండ్లు (సుమారు రూ.12.82 లక్షలు), అడ్వెంచర్ 1.2P 5MT ధర 244,900 రాండ్లు (సుమారు రూ.13.96 లక్షలు), అకంప్లిష్డ్+ 1.2T 6MT ధర రూ. 269,900 రాండ్లు (సుమారు రూ.15.36 లక్షలు)గా కంపెనీ నిర్ణయించింది. భారత్ లో టాటా పంచ్ ధరలు సుమారు రూ.5.74 లక్షల నుంచి రూ.10.76 లక్షల వరకు ఉన్నాయి. దీంతో పోలిస్తే దక్షిణాఫ్రికాలో దీని ధర ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, రెండు దేశాల్లోని ధరలను పోల్చేటప్పుడు ఎగుమతి ఖర్చులు, స్థానిక పన్నులు, మార్కెట్ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
దక్షిణాఫ్రికా వెర్షన్ లో 1.2 లీటర్ మూడు సిలిండర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 88hp పవర్, 115Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఇచ్చారు. ఇక 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120hp పవర్, 170Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ యాడ్ చేశారు. భారత్‌లో లభించే పంచ్‌తో పోలిస్తే దక్షిణాఫ్రికా మోడల్‌లో కొన్ని ఆప్షన్లు అందుబాటులో లేవు. ముఖ్యంగా పెట్రోల్ AMT, CNG వేరియంట్లను అక్కడ అందించడం లేదు. భారత మార్కెట్లో మాత్రం నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, CNG ఇంజిన్లతో పాటు AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
దక్షిణాఫ్రికాలో విడుదలైన టాటా పంచ్ డిజైన్ దాదాపు భారతీయ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో LED హెడ్‌లైట్లు, DRLs, కనెక్టెడ్ LED టెయిల్‌లైట్లు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ ఉన్నాయి. ఇంటీరియర్ లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్స్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
భద్రత పరంగా ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, వారంటీ విషయంలో దక్షిణాఫ్రికా మోడల్‌కు ఎక్కువ కవరేజ్ అందిస్తున్నారు. అక్కడ 5 సంవత్సరాలు లేదంటే 1,25,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తుండగా, భారత వెర్షన్‌కు 3 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీ ఉంది.
Read Also: దీపావళి స్పెషల్ ఆఫర్స్.. ఈ 5 సెడాన్ కార్లపై లక్షల్లో డిస్కౌంట్లు!