2026 Hyundai Verna Safety Rating: హ్యుందాయ్ మోటార్స్ కు చెందిన ప్రముఖ సెడాన్ వెర్నా భద్రత విషయంలో మరోసారి సత్తా చాటింది. 2026 మోడల్ హ్యుందాయ్ వెర్నా భారత్ NCAP (Bharat NCAP) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. పెద్దలతో పాటు పిల్లల భద్రత పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధించింది. పెద్దల ప్రొటెక్షన్ సెగ్మెంట్ లో 32 పాయింట్లకు గాను 28.22 పాయింట్లు, పిల్లల భద్రత విభాగంలో 49 పాయింట్లకు గాను 44 పాయింట్లు పొందింది.
భారత్ NCAP పరీక్షల కోసం వెర్నాలోని HX8 1.5T DCT, HX8 1.5P CVT వేరియంట్లను ఉపయోగించారు. అయితే, ఈ క్రాష్ టెస్ట్ ఫలితాలు కారు అన్ని వేరియంట్లకు వర్తిస్తాయని సంస్థ వెల్లడించింది. పెద్దల ప్రొటెక్షన్ లో ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్టులో 16కి 12.45 పాయింట్లు సాధించింది. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ పరీక్షలో 16కి 15.77 పాయింట్లు దక్కించుకుంది.
ఫ్రంటల్ క్రాష్ పరీక్షలో డ్రైవర్ తల, మెడకు మంచి రక్షణ లభించింది. ఛాతీ, కాలి ఎముకలు, పాదాలకు తగినంత రక్షణ ఉన్నట్లు వెల్లడైంది. అయితే, డ్రైవర్, కో-డ్రైవర్ ఇద్దరి నడుము, తొడల భాగాలకు మాత్రం సాధారణ స్థాయి రక్షణ మాత్రమే లభించింది. సైడ్ క్రాష్ పరీక్షలో తల, పొత్తికడుపు, నడుము భాగాలకు మంచి రక్షణ లభించగా, ఛాతీకి తగినంత రక్షణ లభించింది. సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్షలోనూ కీలక శరీర భాగాలకు మంచి రక్షణ లభించినట్లు భారత్ NCAP నివేదిక వెల్లడించింది.
పిల్లల రక్షణ పరీక్షల్లో వెర్నా 49కి 44 పాయింట్లు సాధించింది. 18 నెలలు, మూడేళ్ల వయస్సు గల పిల్లల డమ్మీలను వెనుకకు తిరిగి ఉండే చైల్డ్ సీట్లలో ఉంచి పరీక్షించారు. ఫ్రంటల్, సైడ్ క్రాష్ పరీక్షల్లో రెండు డమ్మీలకు పూర్తి మార్కులు వచ్చాయి. డైనమిక్ ప్రొటెక్షన్ విభాగంలో 24కి 24, చైల్డ్ సీట్ ఇన్‌స్టాలేషన్ విభాగంలో 12కి 12 పాయింట్లు సాధించింది.
2023లో హ్యుందాయ్ వెర్నా మునుపటి వెర్షన్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లోనూ 5 స్టార్ రేటింగ్ పొందింది. అయితే, అప్పటి పరీక్షల్లో బాడీషెల్, ఫుట్‌వెల్ ప్రాంతం స్థిరత్వం విషయంలో కొన్ని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత భారత్ NCAP నివేదికలో అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. రెండు పరీక్షల్లోనూ భద్రతకు సంబంధించిన కొన్ని అంశాల్లో ఫలితాలు భిన్నంగా ఉన్నాయి.
హ్యుందాయ్ వెర్నాలో స్టాండర్డ్ గా ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, డే/నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (IRVM) లాంటి ఫీచర్లు ఉన్నాయి. భారత్ NCAP నుంచి 5 స్టార్ రేటింగ్ సాధించడంతో మిడ్‌సైజ్ సెడాన్ విభాగంలో వెర్నా భద్రత పరంగా మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రస్తుతం భారత్ NCAP పరీక్షల్లో 5 స్టార్ రేటింగ్ సాధించిన ఏకైక మిడ్‌సైజ్ సెడాన్‌గా కూడా సత్తా చాటింది.
Read Also: టాటా సియెర్రా EVకి 5 స్టార్ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిందిగా!