Kia India Announces Price Hike: కియా కార్లను కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు కంపెనీ షాకింగ్ న్యూస్ చెప్పింది. దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ అన్ని మోడళ్ల ధరలను పెంచనున్నట్లు కియా ఇండియా వెల్లడించింది. కొత్త ధరలు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
కంపెనీ తాజా ప్రకటన ప్రకారం.. అన్ని మోడళ్ల ధరలు గరిష్టంగా 2 శాతం వరకు పెరగనున్నాయి. అయితే, ధరల పెరుగుదల ప్రతి మోడల్, వేరియంట్ ను బట్టి మారుతుంది. కొన్ని వాహనాలపై తక్కువ ప్రభావం ఉండగా, మరికొన్ని మోడళ్లపై ధరల పెంపు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ధరలను పెంచడానికి ఇన్ పుట్స్ ధరలు పెరగడం, తయారీ, నిర్వహణ వ్యయాలు పెరగడమే కారణమని తెలిపింది. ఆటోమొబైల్ రంగంలో ఇటీవల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కియా వెల్లడించింది. అయితే, ధరలు పెరిగినా వినియోగదారులకు అందించే నాణ్యత, ఫీచర్లలో ఎలాంటి మార్పు ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.
ప్రస్తుతం కియా ఇండియా దేశీయ మార్కెట్లో పలు ప్రముఖ మోడళ్లను విక్రయిస్తోంది. స్థానికంగా తయారయ్యే వాహనాల్లో సోనెట్, సైరోస్, సెల్టోస్, కేరెన్స్ క్లావిస్, కేరెన్స్ క్లావిస్ ఈవీ ఉన్నాయి. ఇవి భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇక ప్రీమియం సెగ్మెంట్ కు చెందిన కార్నివాల్, EV6, EV9 మోడళ్లను కంపెనీ CBUలుగా భారత్ కు దిగుమతి చేస్తోంది. ఈ మోడళ్లు అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
కియా లైనప్ లో అత్యంత అందుబాటు ధరలో లభించే మోడల్ సోనెట్. దీని ప్రారంభ ధర ప్రస్తుతం సుమారు రూ.7.33 లక్షలుగా ఉంది. మరోవైపు, కేరెన్స్ క్లావిస్ ఈవీ టాప్ వేరియంట్ ధర సుమారు రూ.25 లక్షల వరకు ఉంది. ప్రీమియం మోడళ్లలో కార్నివాల్ ధర రూ.59.45 లక్షలు కాగా, EV6 ధర రూ.67.98 లక్షలుగా ఉంది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV అయిన EV9 ధర సుమారు రూ.1.30 కోట్ల వరకు ఉంది.
జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ధరల పెంపుతో కియా వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు కొంత అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సో, కొత్త కారు కొనుగోలు చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న వినియోగదారులు ధరల పెంపు అమల్లోకి రాకముందే బుకింగ్ చేసుకుంటే ప్రస్తుత ధరల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో పెరుగుతున్న ఖర్చుల ప్రభావంతో పలు కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచగా, ఇప్పుడు కియా కూడా అదే బాటలో నడుస్తోంది.
Read Also: ఐకానిక్ పల్సర్ 220Fకు ఫేస్ లిఫ్ట్.. LED హెడ్ లైట్ తో క్రేజీ లుక్!