Maruti Suzuki’s EV Expansion Plan: భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మారుతి సుజుకి ఇండియా క్రేజీ ప్లాన్స్ చేస్తోంది. సరికొత్త ఎలక్ట్రిక్ మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. 2031 నాటికి నాలుగు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయాలనుకుంటుంది. హైదరాబాద్‌లో జరిగిన కంపెనీ ఈవెంట్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు.
తాజాగా హైదరాబాద్ లో కంపెనీ ఒకే రోజులో మారుతి సుజుకి ఈ విటారాకు సంబంధించి 108 యూనిట్లను కస్టమర్లకు అందించారు. వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై పెంచుకుంటున్న ఆసక్తికి నిదర్శనం అని కంపెనీ వెల్లడించింది. పర్యావరణానికి అనుకూలమైన ప్రయాణానికి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, అందుకే తమ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్ ఫోలియోను విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కంపెనీ మధ్యకాలిక వ్యూహంలో భాగంగా అన్ని విభాగాలలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. భవిష్యత్తులో మార్కెట్ పరిస్థితులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రణాళికలను మార్చుకుంటామని బెనర్జీ వెల్లడించారు. 2031 నాటికి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాప్ కు చేరడమే లక్ష్యమన్నారు.
మరోవైపు కంపెనీ కార్ల ధరల విషయంలో అనిశ్చితి కొనసాగుతుంది. ముడిసరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో వాహనాల ధరలు పెరిగే అవకాశముందని కంపెనీ సూచించింది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో జరుగుతున్న పరిణామాలు కూడా ధరలపై ప్రభావం చూపవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, కచ్చితమైన ధరల పెంపు గురించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
ఇక గుజరాత్ హన్సల్ పూర్ ప్లాంట్ లో తయారవుతున్న ఇ-విటారా ఇప్పటికే మంచి ఆదరణ పొందుతోంది. ఈ మోడల్ 25,000 యూనిట్లకు పైగా ఎగుమతి అయి, 44 దేశాల్లో వినియోగంలోకి వచ్చింది. భవిష్యత్తులో 100కుపైగా దేశాల్లోకి దీన్ని విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు 4.5 లక్షల వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన మౌలిక వసతులపై కూడా కంపెనీ దృష్టి సారించింది. 2030 నాటికి దేశ వ్యాప్తంగా లక్షకు పైగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 2,000కు పైగా ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసింది.
ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా మారుతి సుజుకి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ప్లాన్స్ చేస్తోంది. కొత్త మోడల్స్, మౌలిక వసతుల విస్తరణ, గ్లోబల్ మార్కెట్లపై దృష్టి పెట్టడం ద్వారా ఈ విభాగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.
Read Also: కియా డబుల్ సర్ప్రైజ్.. సైరోస్ EV, నెక్స్ట్ జనరేషన్ సోనెట్ లాంచింగ్ ఎప్పుడంటే?