What Is 70/30 Brake Rule: బైక్ నడిపే సమయంలో బ్రేకులు ఎలా వేయాలి? అనేది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది రైడర్లు ముందు బ్రేక్ ఎక్కువగా వాడాలా, వెనుక బ్రేక్ ఎక్కువగా వాడాలా అనే విషయంలో సందేహపడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో బైక్ నిపుణులు 70/30 బ్రేక్ రూల్ గురించి చెప్తుంటారు. ఈ రూల్ ప్రకారం సాధారణ రైడింగ్ పరిస్థితుల్లో బైక్ ను ఆపేటప్పుడు బ్రేకింగ్ పవర్ సుమారు 70 శాతం ముందు బ్రేక్ నుంచి, మిగిలిన 30 శాతం వెనుక బ్రేక్ నుంచి రావాలి. ఇలా చేయడం వల్ల బైక్‌పై కంట్రోల్ బాగుంటుంది. కేవలం ఒకే బ్రేక్ పై ఆధారపడటం వల్ల ప్రమాదం జరిగే అవకాశం పెరుగుతుంది.
అసలు ఈ రూల్ ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బైక్ బ్రేక్ వేయగానే దాని బరువు ముందుకు వస్తుంది. ముందు టైర్ పై ఎక్కువ భారం పడుతుంది. అదే సమయంలో వెనుక టైర్ పై ఉండే బరువు కొంత తగ్గిపోతుంది. ముందు టైర్ పై ఎక్కువ బరువు పడటం వల్ల దానికి రోడ్డుపై మరింత పట్టు లభిస్తుంది. అందుకే, ముందు బ్రేక్ ఎక్కువ ఆపే శక్తిని అందిస్తుంది. మరోవైపు వెనుక టైర్ పై పట్టు తగ్గిపోవడంతో అది తక్కువ బ్రేకింగ్ శక్తిని మాత్రమే అందిస్తుంది.
నిజానికి కేవలం ముందు బ్రేక్‌ను మాత్రమే ఉపయోగించడం మంచిది కాదు. అలా చేస్తే బైక్ స్థిరత్వాన్ని కోల్పోతుంది. కొన్ని సందర్భాల్లో ఫ్రంట్ వీల్ లాక్ అయి రైడర్ కిందపడే ప్రమాదం కూడా ఉంటుంది. అదే విధంగా కేవలం వెనుక బ్రేక్ ను మాత్రమే ఉపయోగిస్తే బైక్ సరైన దూరంలో ఆగకపోవచ్చు. అందుకే రెండు బ్రేకులను సరైన నిష్పత్తిలో ఉపయోగించడం మంచి పద్ధతిగా భావిస్తారు. వెనుక బ్రేక్ బైక్ ను స్థిరంగా ఉంచడంలో సాయపడుతుంది. అలాగే బైక్ బ్యాలెన్స్ ను కాపాడుతుంది.
70/30 అనేది కచ్చితంగా పాటించాల్సిన అంశం ఏమీ కాదు. ప్రతి బైక్, ప్రతి రైడర్, ప్రతి రహదారి పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. మీరు బ్రేక్ లివర్, పెడల్‌పై ఎంత ఒత్తిడి పెడుతున్నారనే దానిపై బ్రేకింగ్ ప్రభావం ఆధారపడి ఉంటుంది. అందుకే ట్రాఫిక్ లేని ప్రదేశాల్లో బ్రేకింగ్ ప్రాక్టీస్ చేయడం మంచిది. మీ బైక్ ఎలా రియాక్ట్ అవుతోంది. మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిష్పత్తి మారవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో బైక్‌ను వెంటనే ఆపాల్సి వస్తే ముందు బ్రేక్ పాత్ర మరింత పెరుగుతుంది. అలాంటి సందర్భాల్లో బ్రేకింగ్ శక్తి లో 90 శాతం వరకు ముందు బ్రేక్ నుంచే రావచ్చు. అయితే, రెండు బ్రేకులను ఒకేసారి పూర్తిస్థాయిలో ఉపయోగించడం కూడా ప్రమాదకరం. ముఖ్యంగా తడి రోడ్లు, ఇసుక, మట్టి ఉన్న రహదారులు, అరిగిపోయిన టైర్లు, వెనుక ప్రయాణికుడు ఉండటం, సరిగా పనిచేయని బ్రేకులు లాంటి అంశాలు బైక్ కంట్రోల్ ను ప్రభావితం చేస్తాయి.
యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉన్న బైక్ లలో కూడా రైడర్ జాగ్రత్త అవసరం. ఎందుకంటే టెక్నాలజీ ఎంత ఉన్నా సరైన బ్రేకింగ్ పద్ధతిని పూర్తిగా భర్తీ చేయలేడు. 70/30 బ్రేక్ నియమాన్ని ఒక మార్గదర్శకంగా మాత్రమే చూడాలి. మీ బైక్ లక్షణాలు, రహదారి పరిస్థితులు, మీ అనుభవాన్ని బట్టి బ్రేకులను ఉపయోగించడం నేర్చుకోవడం అత్యంత ముఖ్యం.
Read Also: ఓలా, ఉబెర్, ర్యాపిడోలో నెలకు అంత సంపాదింవచ్చా? ఇవిగో లెక్కలు!