Ola vs Uber vs Rapido Drivers Monthly Income: దేశంలో క్యాబ్, ఆటో, బైక్ టాక్సీ సేవల్లో ఓలా, ఉబెర్, ర్యాపిడో దూసుకెళ్తున్నాయి. రోజూ లక్షలాది మంది ఈ యాప్‌ల ద్వారా తమ ప్రయాణాలు కొనసాగిస్తారు. అయితే, ఈ కంపెనీల్లో పనిచేసే డ్రైవర్లు నెలకు ఎంత సంపాదిస్తారు? ఖర్చులు తీసేసిన తర్వాత చేతికి ఎంత మిగులుతుంది? అనే డౌట్ చాలా మందికి వస్తుంది. ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
నిజానికి ఈ కంపెనీల్లో పని చేసే డ్రైవర్లకు ఎలాంటి ఫిక్స్ డ్ సాలరీ ఉండదు. వారు రోజుకు ఎన్ని గంటలు పని చేస్తారు? ఎన్ని రైడ్లు పూర్తి చేస్తారు? అనే దాని ఆధారంగా ఆదాయం మారుతూ ఉంటుంది. గతంలో ఓలా, ఉబెర్, ర్యాపిడో సంస్థలు ప్రతి రైడ్ పై 20 నుంచి 30 శాతం వరకు కమిషన్ తీసుకునేవి. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది. డ్రైవర్లను ఆకర్షించడానికి ఈ కంపెనీలు జీరో కమిషన్, సబ్ స్క్రిప్షన్ మోడల్ ను తీసుకొచ్చాయి. ఈ విధానంలో డ్రైవర్లు రోజుకు, నెలకు ఒక నిర్ణీత ఫీజు కంపెనీకి చెల్లించాలి. ఆ తర్వాత వారు చేసే రైడ్లకు వచ్చే మొత్తం చార్జీ వారికే దక్కుతుంది. ఉదాహరణకు ఓలా డ్రైవర్లు రోజుకు సుమారు రూ.67 చెల్లించాల్సి ఉంటుంది. ర్యాపిడోలో ఈ ఫీజు నగరాన్ని బట్టి రూ.9 నుంచి రూ.29 మధ్య ఉంటుంది.
బైక్ టాక్సీ డ్రైవర్ల విషయానికి వస్తే, రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే పనిచేసే వ్యక్తి ఆరు రైడ్లు పూర్తి చేస్తే దాదాపు రూ.300 సంపాదించవచ్చు. టార్గెట్ పూర్తి చేసినందుకు అదనంగా బోనస్ కూడా లభిస్తుంది. ప్యూయల్, యాప్ ఫీజు తీసేసిన తర్వాత రోజుకు సుమారు రూ.250 వరకు మిగిలే అవకాశం ఉంటుంది. నెలకు ఇది రూ.6,000 నుంచి రూ.7,000 వరకు చేరవచ్చు.
ఆటో డ్రైవర్ల ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుంది. రోజుకు 10 గంటలు పనిచేస్తూ సుమారు 12 రైడ్లు పూర్తి చేస్తే రూ.1,200 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. గ్యాస్ ఖర్చులు, యాప్ సబ్ స్క్రిప్షన్ తీసేసిన తర్వాత రోజుకు దాదాపు రూ.800 వరకు మిగులుతుంది. నెలకు సుమారు రూ.20,000 వరకు ఆదాయం వస్తుంది.
ఇక క్యాబ్ డ్రైవర్ల ఆదాయం ఇంకా మెరుగ్గా ఉంటుంది. రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేస్తే సుమారు రూ.2,500 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇంధనం, యాప్ ఫీజులు తీసేసిన తర్వాత రోజుకు రూ.1,700 వరకు మిగలవచ్చు. నెలలో 25 నుంచి 26 రోజులు పనిచేస్తే దాదాపు రూ.45,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
అటు సొంత కారు లేకుండా అద్దెకు తీసుకున్న కారును నడిపే వాళ్లు, ఈఎంఐ చెల్లించే డ్రైవర్లకు ఈ ఆదాయం కొంత తగ్గుతుంది. నెలవారీ అద్దె, ఈఎంఐ చెల్లించిన తర్వాత చేతికి రూ.25,000 నుంచి రూ.30,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది.
ఎక్కువ ఆదాయం కోసం చాలా మంది డ్రైవర్లు ఒకేసారి మూడు యాప్‌లను ఉపయోగిస్తున్నారు. దీనిని మల్టీ యాపింగ్ అంటారు. ఏ యాప్ లో ఎక్కువ చార్జీ వస్తే ఆ రైడ్ ను యాక్సెప్ట్ చేస్తారు. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్ లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అధిక చార్జీలు లభిస్తాయి. ప్రస్తుతం క్యాష్, యూపీఐ, కార్డు పేమెంట్ల రూపంలో వచ్చిన డబ్బును డ్రైవర్లు వెంటనే తమ బ్యాంక్ అకౌంట్స్ కు ట్రాన్స్ ఫర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. జీరో కమిషన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఓలా, ఉబెర్, ర్యాపిడో డ్రైవర్ల ఆదాయం కొంత మెరుగుపడింది. ఎంత కష్టపడితే అంత ఎక్కువ సంపాదించే అవకాశం ఈ రంగంలో ఉందని చెప్పొచ్చు.
Read Also: మారుతి ఇ-విటారా ధరలు పెంపు.. ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందంటే?