BigTV English

Hen Story : వింటారా.. ఈ కోడి కథ!

Hen Story : వింటారా.. ఈ కోడి కథ!
hen story

Hen Story : సంక్రాంతి సంబురాలు షురూ. ఊరంతా ముగ్గులు.. ఇళ్లకు చేరిన పంట.. కోడి పందేల జోరు.. ఎటు చూసినా కోలాహలమే. పేరు, పద్ధతి ఏదైనా..పం డుగ ఒకటే. పంట ఇంటికి రావడంతో రైతుల్లో ఒకటే జోష్. ఈ సందడిని చూసేందుకే వచ్చా. అన్ని ఊళ్లు తెగ తిరిగేస్తున్నా. అవునూ.. ఇంతకు నేనెవరో తెలియదు కదూ? నేను పీనట్ ఆత్మను.


నేను లేకపోయేసరికి మా యజమానురాలు బెంగ పెట్టేసుకుందట. ఆమెను ఓ సారి చూస్తే అదో తుత్తి. పనిలో పనిగా పండుగ సందడిని కూడా చూస్తే పోలా. అనుకున్నదే తడవుగా పై నుంచి దిగి వచ్చేశా. అయినా మేం లేనిదే ఈ పండుగ జరగదు. పందేలు, కోసుకు తినడానికేనా మేమున్నది? అయినా ఈ ఒక్క పండుగ ఏం ఖర్మ? ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మా కుత్తుకలు కోసేస్తారు.

మీకు తెలుసా? నిమిషానికి 1,40,000 కోళ్లను మనుషులు ఆవురావురంటూ ఆరగించేస్తున్నారట. నేను మాత్రం ఈ జాబితాలో లేను. నాది సహజ మరణమే. కోడిగా మూగజీవి అయినా మనుషులతో అనుబంధం ఈ నాటిది కాదు. నా యజమానురాలు మార్సి డార్విన్ నన్నెంతో బాగా చూసుకుంది. ఒకటీ అరా కాదు.. 21 సంవత్సరాల 238 రోజుల పాటు ఆమె ఇంట్లో ఏకంగా ఓ మెంబర్నే అయ్యాను.


మొన్న క్రిస్మస్ రోజు నేను కన్నుమూస్తే.. మార్సి ఎంతగానో ఆవేదన చెందింది. సొంత కుటుంబ సభ్యురాలిని కోల్పోయినంతగా కుంగిపోయింది. ఆమే స్వయంత తన బ్లాగ్‌లో ఈ విషయం రాసుకుంది. ఎంతైనా.. పెంకును చీల్చుకుని ఈ లోకంలోకి వచ్చిన నాటి నుంచి చూసింది కదా? 2002లో పుట్టినప్పుడు తీసిన ఫొటోను మార్సి దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉంది తెలుసా?

కోడిపిల్లగా తొలి రెండేళ్లు చిలక పంజరంలోనే పెరిగానట. మార్సి డైనింగ్ రూంలోనే ఆ పంజరం ఉండేది. మార్సితో పాటు నా మనవలు, మనవరాళ్లను వదిలేసి వెళ్లడం నాకూ బాధగానే ఉంది. నేను వీడివెళ్లిన అనంతరం వాటిని చూసుకోవడమే మార్సి పనిగా పెట్టుకుంది. వయసు మీద పడిన వెంటనే మార్సి నా మకాంను మార్చేసింది. ఇంటి వెనుకాల నా బిడ్డ మిల్లీ ఉండే కేజ్‌లోకి చేర్చింది.

విషాదం ఏమిటంటే నా మరణానికి కొన్ని రోజుల ముందే మిల్లీ నన్ను విడిచి వెళ్లిపోయింది. హాలోవీన్ రోజే బిడ్డ కన్నుమూయడం చరమాంకంలో నన్నెంతగానో మెలిపెట్టింది. నా స్నేహితుల్లో ఒకరైన లూనా కూడా ఆ సమయంలో ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది. థాంక్స్ గివింగ్ తర్వాత వారం రోజులకు సహచరుడు బెన్నీ కూడా నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయాడు.

ఒక్కొక్కరుగా వీడి వెళ్తున్న బాధో, వయసు మీరడమో కారణం తెలియదు కానీ.. నాకు మృత్యు ఘడియలు సమీపిస్తున్నాయని మార్సికి అర్థమైపోయినట్టుంది. డిసెంబర్ 23వ రాత్రి నన్ను పట్టుకుని వదల్లేదు. క్రిస్మస్ కు ముందు రోజు తన పక్కనే దుప్పట్లో పడుకోబెట్టుకుంది. అలా నిద్రలోనే మృత్యు ఒడిలోకి చేరాను. అలా ప్రశాంతంగా మరణించానన్న ఒక్క విషయం మార్సికి కొంత ఊరట కలిగించింది.

ఆ రోజు మరణించకుంటే.. రికార్డులను తిరగరాసేదానిని. అయినా ‘ఓల్డెస్ట్ లివింగ్ చికెన్’ నిరుడు మార్చి 1న గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాను. సాధారణంగా మా జాతి జీవితకాలం 5-10 ఏళ్లు మాత్రమే. అదీ మనుషులు మధ్యలోనే మా ప్రాణాలను తుపుక్కుమని తుంచకుంటే! నేనే 21 సంవత్సరాల 238 రోజులు బతికానంటే.. మఫీ నన్ను మించిపోయింది. అమెరికాకు చెందిన ఆ కోడి 1989 నుంచి 2012 వరకు 23 సంవత్సరాల 152 రోజులు బతికింది. ఇప్పటి వరకు అత్యధిక కాలం జీవించిన కుక్కుటం అదే.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×