E-Paper
Advertisement

Actor Dileep: 8 ఏళ్ల తర్వాత లైంగిక దాడి కేసులో యాక్టర్ దిలీప్‌కు ఊరట.. నిర్దోషిగా తేలినా ఏంటి లాభం?

Actor Dileep: 8 ఏళ్ల తర్వాత  లైంగిక దాడి కేసులో యాక్టర్ దిలీప్‌కు ఊరట.. నిర్దోషిగా తేలినా ఏంటి లాభం?

Actor Dileep:  కష్టపడి సంపాదించుకున్న మంచిపేరు పోయింది.. తనకంటూ దక్కిన ఫేమ్ పోయింది.. ఒక్క ఆరోపణ, ఒకే ఒక్క లైంగిక ఆరోపణతో.. అతని కెరీరే నాశనమైంది. మలయాళ నటుడు దిలీప్‌పై నమోదైన కేసులో.. 8 ఏళ్ల తర్వాత తుది తీర్పు వచ్చింది. అతన్ని.. కోర్టు నిర్దోషిగా తేల్చింది. లైంగిక ఆరోపణల విషయంలో.. నటుడు దిలీప్‌కు ఊరట దక్కినా.. ఇప్పుడది ఉత్తిదేనా? ఇన్నేళ్ల పాటు ఆయన అనుభవించిన బాధ.. ఈ తీర్పుతో తీరిపోతుందా?

నటిపై లైంగికదాడి కేసులో నిర్దోషి తేల్చిన కోర్టు

ఎనిమిదేళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించిన కేసులో.. ఇప్పుడు తీర్పు వచ్చింది. కిడ్నాప్‌, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో.. ఏళ్లుగా విచారణ జరుగుతున్న ఈ కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుల్లో ఒకరైన ప్రముఖ నటుడు దిలీప్‌‌ని.. ఎర్నాకుళం కోర్టు నిర్దోషిగా తేల్చింది. మలయాళ నటి ప్రమేయాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని.. కోర్టు తీర్పు ఇచ్చింది. అత్యాచారం, కుట్ర లాంటి నేరాల కింద.. న్యాయస్థానం ఆరుగురిని దోషులుగా తేల్చింది. దిలీప్‌తో పాటు మరో ముగ్గురిని నిర్దోషులుగా తేల్చింది. మలయాళంతో పాటు తమిళ్, తెలుగు సినిమాల్లో నటించిన ఆ నటి.. 2017, ఫిబ్రవరి 17న కొచ్చిలో కిడ్నాప్‌కు గురైంది. ఆ రోజు రాత్రి 17 మంది వ్యక్తులు.. కిడ్నాప్‌ చేసి.. రెండు గంటల పాటు ఆమెను తన కారులోనే.. లైంగిక వేధింపులకు గురిచేసిన దుండగులు.. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ కేసులో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో యాక్టర్ దిలీప్ కూడా ఒకరు. వీళ్లందరిపై.. కిడ్నాప్, లైంగిక వేధింపులు, గ్యాంగ్‌రేప్, ఉద్దేశపూర్వకంగా ఆధారాలను చెరిపివేయడం వంటి అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి.

పక్షపాతంతో వ్యవహరించిన కేరళ పోలీసులు

ఈ కేసులో 2017లో తొలి ఛార్జ్‌షీట్ నమోదైంది. నటిపై దాడి ఘటన.. నేరపూరిత కుట్రలో భాగమని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. నటుడు దిలీపే ఈ దాడికి కుట్ర పన్నాడని ఆరోపించారు. ప్రాసిక్యూషన్ కూడా అతను సాక్ష్యాలను నాశనం చేశాడని ఆరోపించింది. అదే ఏడాది జులైలో దిలీప్ అరెస్ట్ అయ్యాడు. నాలుగు నెలల తర్వాత బెయిల్‌పై బయటకొచ్చాడు. కేరళ పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించిన దిలీప్.. సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. అయితే.. ఆ అభ్యర్థన తిరస్కరణకు గురైంది. మొత్తం మీద.. సినీ ప్రముఖులతో సహా 261 మంది సాక్షులను విచారించారు. వారిలో.. 28 మంది ప్రతికూలంగా మారారు. సంవత్సరాలుగా, ఇద్దరు ప్రత్యేక ప్రాసిక్యూటర్లు.. ఈ కేసు నుంచి వైదొలిగారు. ప్రిసైడింగ్ జడ్జిని భర్తీ చేయాలనే బాధితుడి అభ్యర్థన కూడా తిరస్కరణకు గురైంది. ప్రాసిక్యూషన్ 833 పత్రాలు, 142 ముఖ్యమైన వస్తువులను సమర్పించగా.. డిఫెన్స్ 221 పత్రాలను సమర్పించింది. కేవలం సాక్షుల విచారణ మాత్రమే 438 రోజులు కొనసాగింది. ఎట్టకేలకు.. 2017 ఫిబ్రవరిలో మలయాళ నటి కిడ్నాప్, దాడి తర్వాత.. దాదాపు ఎనిమిది సంవత్సరాలు సాగిన న్యాయ పోరాటానికి.. ఈ తీర్పు ముగింపు పలికింది. ముందునుంచీ ఈ కేసులో తనకెలాంటి ప్రమేయం లేదని చెబుతూ వచ్చిన దిలీప్.. ఈ తీర్పుపై స్పందించాడు. ఇదంతా.. తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర అని.. తనకు సాయం చేసిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు దిలీప్.

నేమ్ పోయింది.. ఫేమ్ పోయింది..

అయితే.. ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న ఒక్కటే. తప్పుడు ఆరోపణలతో.. ఇన్నేళ్ల పాటు దిలీప్ మోసిన అవమాన భారం అంతా ఇంతా కాదు. జీవితంలో అతను కష్టపడి సంపాదించుకున్న పరువు, పేరు, ఫిల్మ్ ఇండస్ట్రీలో తను సంపాదించుకున్న ఫేమ్ అంతా.. ఈ ఒక్క కేసుతో గంగలో కలిసిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. అతని కెరీర్ మొత్తం నాశనమైపోయింది. మరి.. ఇన్నేళ్లూ దిలీప్ అనుభవించిన బాధకు సమాధానం ఎవరు చెబుతారు? ఇప్పుడు.. కోర్టు నిర్దోషిగా తేల్చిందని ఊరటచెందాలా? ఈ దేశంలో న్యాయం అంత ఈజీగా దొరకదని సరిపెట్టుకోవాలా? నిర్దోషిగా తేలినా.. దిలీప్ కోల్పోయింది తిరిగి రాదు. చరిత్రలో జరిగిన మంచి కంటే, చెడును గుర్తుపెట్టుకునే వాళ్లే ఎక్కువ. అందువల్ల.. దిలీప్‌పై పడిన మచ్చ.. ఎప్పటికీ చెరిగిపోదు.

కోర్టు తీర్పులు ఆలస్యమైతే.. జీవితాలు ఎలా తిరగబడిపోతాయో చెప్పడానికి యాక్టర్ దిలీప్ జీవితమే ఓ బిగ్ ఎగ్జాంపుల్. తన జీవితంలో సంపాదించుకున్నవన్నీ పోయాక.. తీర్పు తీరిగ్గా వస్తే.. ఏమైనా లాభముంటుందా? అన్నీపోయాక.. నిజం నిలకడగా బయటకొస్తే అర్థముంటుందా? ఇన్నేళ్ల పాటు దిలీప్ ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన బాధకు విలువ లేదా? కోర్టు నిర్దోషిగా తేల్చినా.. అతను పోగొట్టుకున్న లైఫ్ ఇప్పుడు తిరిగొస్తుందా? ఏళ్ల తరబడి విచారణలు, కేసులు కొనసాగుతూ ఉంటే.. నిర్దోషుల జీవితాలు తలకిందులైపోవా? అప్పుడు అతను.. నిర్దోషిగా తేలినా ఏంటి లాభం? వ్యవస్థ ఇప్పటికీ మారకపోతే ఎలా?

తలకిందులవుతున్న నిర్దోషుల జీవితాలు

న్యాయం ఆలస్యమైతే.. అది న్యాయం కానేకాదు! ఇది.. మన న్యాయ వ్యవస్థలో ఉన్న సూత్రం. మన దేశంలో విచారణ అనేది ఓ ప్రాసెస్ కాదు. అదే.. ఓ శిక్ష. ముఖ్యంగా.. యాక్టర్ దిలీప్ లాంటి ప్రముఖులు ఏదైనా కేసులో చిక్కుకున్నప్పుడు.. కోర్టు తీర్పుల్లో జరిగే ఆలస్యం.. వారి జీవితాలను, కెరీర్‌ని, వ్యక్తిగత గౌరవాన్ని, జీవితాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తుంది. దీనికి.. దిలీప్ అతీతుడేమీ కాదు. దిలీప్ 8 ఏళ్ల పాటు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, తర్వాత జరిగిన విచారణలు.. ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని పూర్తిగా కబళించేశాయ్. ఈ కేసు కోసం దిలీప్ కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను కూడా అమ్మేసుకున్నాడు. తనపై పడిన మచ్చని తొలగించేందుకు.. ఎన్నో కోల్పోయాడు. దిలీప్ తన సినీ కెరీర్‌లో సంపాదించుకున్న పేరు, కీర్తి, ప్రజాభిమానం, ఆర్థిక స్థిరత్వం.. ఈ కేసు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయ్. ఆయన సినిమాలు ఆగిపోయాయి. ఎన్నో ప్రాజెక్టుల నుంచి తీసేశారు. కోర్టు తీర్పు రాకముందే.. సోషల్ మీడియా అతనిపై ముద్దాయి అనే ముద్ర వేసింది. ఆయన కుటుంబం, సన్నిహితులు.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సంవత్సరాల తరబడి సాగిన విచారణ ప్రక్రియ, పదే పదే కోర్టుల చుట్టూ తిరగడం, తన ప్రతిష్టని నిరూపించుకునేందుకు, తాను నిర్దోషినని ఈ సమాజానికి చెప్పేందుకు.. ఎంతో కష్టపడ్డారు. ఈ క్రమంలో.. ఎంతో మానసిక ఒత్తిడిని, వేదనని అనుభవించారు. దిలీప్ కోల్పోవాల్సినవన్నీ కోల్పోయాక.. తీరిగ్గా తీర్పు వస్తే.. ఆ నిర్దోషిత్వానికి విలువ ఏముంది? నిజం నిలకడగా బయటకొచ్చినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దిలీప్ కెరీర్‌లో.. అత్యంత కీలకమైన ఫేజ్, కెరీర్ పీక్ స్టేజ్ మొత్తం కోల్పోవాల్సి వచ్చింది.

అసత్య ఆరోపణల వల్ల కోల్పోయిన జీవితం: నిర్దోషి దిలీప్

ఇన్నేళ్లకైనా.. కోర్టు దిలీప్‌ని నిర్దోషిగా ప్రకటించినా.. అతను పోగొట్టుకున్న జీవితాన్ని, సమయాన్ని, గౌరవాన్ని తిరిగి ఇవ్వలేదు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించేందుకు.. దిలీప్ వెచ్చించిన సమయం తిరిగి రాదు. ఈ 8 ఏళ్లలో అతను ఎన్నో సినిమాలు చేసి ఉండేవారు. ఎన్నో విజయాలు అందుకొని ఉండే ఆస్కారముండేది. కానీ.. అదంతా ఒక్క తప్పుడు ఆరోపణతో.. పూర్తిగా పోయింది. ముఖ్యంగా.. ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా వేగంగా మారుతుంది. ఏళ్ల తరబడి విరామం తీసుకోవడమంటే.. మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటే చాలా టైమ్ పడుతుంది. పైగా.. ఇప్పట్లో దిలీప్‌పై పడిన మచ్చ అంత ఈజీగా చెరిగిపోదు. కోర్టు నిర్దోషిగా తేల్చినా.. సమాజంలో ఆయనపై ఉన్న పాత ఆరోపణలు, వార్తలు శాశ్వతంగా ఉండిపోతాయ్. అతనికి జరిగిన అమానం, అనుభవించిన బాధని.. ఏ కోర్టు తీర్పు తీర్చలేదు. ఓ వ్యవస్థాగత లోపం కారణంగా నష్టపోయిన నిర్దోషి జీవితానికి.. ఇప్పుడు బాధ్యులెవరనేదే బలమైన ప్రశ్న.

న్యాయ వ్యవస్థలో నిదానత్వం

నిర్దోషిగా తేలిన తర్వాత.. కోర్టు తీర్పు సత్యానికి విలువనిస్తుంది. కానీ.. ఆ తీర్పు అప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చలేదు. ఓ వ్యక్తి తన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో కోల్పోయిన 8 ఏళ్ల సమయాన్ని, అవకాశాలను ఎవరూ తీసుకురాలేరు. కేసు విచారణ, కోర్టు ఖర్చులు, పని కోల్పోవడం వల్ల జరిగే ఆర్థిక నష్టం అపారమైనది. అనుభవించిన అవమానం, బాధ, ఒత్తిడి తాలూకూ బాధ ఎప్పటికీ చెరిగిపోవు. కోర్టు నిర్దోషిగా ప్రకటించినా.. ఇప్పటికీ సమాజంలోని కొన్ని వర్గాలు దిలీప్‌ని అనుమానంగానే చూసే అవకాశం ఉంది. అందువల్ల.. న్యాయం వేగంగా, పారదర్శకంగా ఉంటేనే.. తప్పుడు ఆరోపణల బారిన పడిన వారికి త్వరగా ఊరట లభిస్తుంది. ఇది ఒక్క యాక్టర్ దిలీప్‌కి జరిగిన వ్యక్తిగత నష్టం గురించి మాత్రమే కాదు. భారతీయ న్యాయ వ్యవస్థలోని లోపాలకు.. ఈ కేసు అద్దం పడుతోంది. పెద్ద కేసులు, చిన్న కేసులు అనే తేడా లేకుండా.. ఏళ్ల తరబడి విచారణలు కొనసాగడం, తప్పు చేయని వ్యక్తుల జీవితాలను తలకిందులు చేస్తోంది. ఇది.. న్యాయంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బితీస్తుంది.

పోయిన ప్రతిష్ఠ తిరిగొస్తుందా.. న్యాయవ్యవస్థపై కీలక ప్రశ్న

దిలీప్‌ మాదిరిగా ఎందరో నిర్దోషుల జీవితాలు తలకిందులు కాకుండా ఉండాలంటే.. ఈ వ్యవస్థ మారాలి. ప్రత్యేకించి పరువు, ప్రతిష్టకు సంబంధించిన ముఖ్యమైన కేసులను త్వరితగతిన విచారించే విధానాలను బలోపేతం చేయాలి. ప్రతి విచారణకు ఒక నిర్దిష్ట సమయ పరిమితిని విధించాలి, దానిని కచ్చితంగా పాటించాలి. వ్యవస్థాపరమైన లోపాల కారణంగా నిర్దోషిగా తేలిన వ్యక్తులు పోగొట్టుకున్న ప్రతిష్ట, సమయం, ఆర్థిక నష్టానికి తగిన నష్టపరిహారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. న్యాయం త్వరగా దక్కితేనే.. ఆ న్యాయానికి విలువ ఉంటుంది. దిలీప్ లాంటి వ్యక్తుల జీవితాలు ఈ వ్యవస్థకు ఓ గుణపాఠం కావాలి. అన్యాయం జరిగి, ఏళ్ల తర్వాత తీర్పు వచ్చి నిర్దోషిగా తేలినంత మాత్రాన.. పోయిన జీవితం తిరిగొస్తుందా? ఈ ప్రశ్న వ్యవస్థను వెంటాడుతూనే ఉంటుంది. వ్యవస్థ ఇప్పటికీ మారకపోతే.. రేపు మరొకరి జీవితం కూడా ఈ ఆలస్యపు అగాథంలో పడిపోతుంది.

Story by Anup, Big Tv 

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×