Hyderabad News: టైమ్, డేట్‌తో సంబంధం లేదు.. రాత్రి, పగలు అన్న తేడా లేదు.. హైదరాబాద్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటే.? విరామం అనేదే లేకుండా.. 3 షిప్టుల్లో ఆఫీసులు, వ్యాపారాలు కొనసాగితే.. ఇదంతా ఎందుకు అసలు.. హైదరాబాద్ సిటీ ఎప్పటికీ నిద్రపోని నగరంగా మారిపోతే.? ఎస్.. అదే జరగబోతోంది. ఆకాశంలో సూర్యుడు ఉన్నా.. చంద్రుడు ఉన్నా.. హైదరాబాద్ నగరం ఎప్పుడూ మేల్కొనే ఉండబోతోంది. పగలే కాదు.. రాత్రిపూట కూడా ఆర్థిక వృద్ధి కోసం పరుగులు తీస్తూనే ఉంటుంది. ఇందుకోసం.. తెలంగాణ ప్రభుత్వం దగ్గరున్న వ్యూహమేంటి?
నైట్ ఎకానమీని బలపరిచేందుకు.. తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. హైదరాబాద్ సిటీని 24X7 ఆన్‌లోనే ఉంచేందుకు.. నగరం అస్సలు నిద్రపోకుండా చేసేందుకు.. పక్కా వ్యూహంతో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. నైట్ ఎకానమీని బలోపేతం చేసేందుకు.. సెక్యూరిటీ నుంచి ట్రాన్స్‌పోర్ట్ దాకా అన్ని విభాగాల్లో చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లోనూ ఉద్యోగాలు, వ్యాపారాలు, టూరిజం, వినోదం పెరిగేలా.. ప్రభుత్వం 24X7 సిటీ కాన్సెప్ట్‌పై వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది.
హైదరాబాద్ కొన్నేళ్లుగా.. చిరు వ్యాపారాల నుంచి ప్రపంచ వాణిజ్యం దాకా.. ప్రతి రంగంలో ముందుంటోంది. అలా.. హైదరాబాద్‌లో ఇండియాలో ఓ ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఒకప్పుడు అంతగా అభివృద్ధికి నోచుకోని నగరం.. ఇప్పుడు అభివృద్ధి అనే పదానికే బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. సంవత్సరాలు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా.. అందరి ముందున్న ప్రధాన లక్ష్యం ఒకటే! హైదరాబాద్‌ని గ్లోబల్ సిటీగా మార్చాలని! వరల్డ్ మ్యాప్‌లో మనకంటూ ఓ ప్రత్యేక స్థానం దక్కించుకోవాలని! ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ రైజింగ్ 2047 అనే విజన్‌తో.. 2047 నాటికి ఎలాగైనా సరే.. అభివృద్ధిపరంగా హైదరాబాద్‌ని ప్రపంచ నగరాల జాబితాలో ముందువరుసలో ఉంచాలనేదే సర్కార్ లక్ష్యం. ఇది జరగాలంటే.. స్టేట్ ఎకానమీ పెరగాలి. అది సాధిస్తేనే.. ఏదైనా సాధించగలమని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం.. ప్రస్తుతం 210 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎకానమీని.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి పెంచాలనే లక్ష్యంతో.. రేవంత్ సర్కార్ పనిచేస్తోంది. దీనికోసం ప్రభుత్వం దగ్గర అనేక ప్రణాళికలున్నాయ్.
ఎస్.. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో.. రాత్రి వేళల్లోనూ వాణిజ్య, ఉద్యోగ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయ్. దిగ్గజ ఐటీ కంపెనీలు, వ్యాపార సంస్థల్లో లక్షలాది మంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మరింత పెంచే అంశంలో కీలకంగా మారుతున్నారు. విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న క్రమంలో.. హైదరాబాద్‌లో ఆర్థిక వృద్ధి పెరుగుదల ఎంతో ముఖ్యం. ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. రాత్రివేళల్లోనూ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడం ద్వారా.. ఆర్థిక వ్యవస్థకు స్పష్టమైన భరోసా కల్పించాలని.. ప్రభుత్వం భావిస్తోంది.
రాత్రి వేళ వచ్చే రాబడి కోసం.. తెలంగాణ ప్రభుత్వం దగ్గర అనేక వ్యూహాలు, మరెన్నో ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయ్. ఇందులో ప్రధానంగా.. పారిశుద్ధ్య నిర్వహణతో పాటు భద్రతాపరమైన అంశాలు, ప్రజా రవాణానే కీలకంగా భావిస్తోంది. పౌరులు, పర్యాటకులు, మహిళా ఉద్యోగుల భద్రత కోసం పింక్ పెట్రోలింగ్, స్మార్ట్ లైటింగ్, ఏఐ ఆధారిత నిఘాని ఏర్పాటు చేయబోతోంది. అదేవిధంగా.. మెట్రో, ఆర్టీసీ, హెచ్ఎండీఏ విభాగాల సమన్వయం, నాణ్యమైన ప్రైవేట్ ఈ-మొబిలిటీ ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవడం అత్యవసరమని నిర్ణయించింది. ఇదే క్రమంలో.. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు మరింత పటిష్టం చేసేందుకు పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆపరేషన్ కవచ్ పేరుతో అకస్మాత్తుగా నాకాబందీ చేపట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో.. ఒక్క శుక్రవారం రాత్రే దాదాపు 5 వేల మంది పోలీసులు డ్రోన్లతో రంగంలోకి దిగారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో.. శాంతిభద్రతలు, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు జాయింట్‌గా పాల్గొన్నాయి. ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో నగర పౌరులంతా.. పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరుతున్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే.. వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ నైట్ ఎకానమీని పెంచడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడానికి ముందే.. నగరంలో రాత్రి పూట సెక్యూరిటీని పటిష్టం చేసేందుకు ఇప్పటి నుంచే తనిఖీలు చేస్తున్నారు. దీనివల్ల.. రాత్రి పూట అల్లరచిల్లరగా తిరిగే పోకిరీల సంఖ్య తగ్గిపోతుంది. రాత్రి పూట కూడా సాఫీగా వ్యాపారాలు చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. ఎంత రాత్రైనా.. పోలీసులు చుట్టుపక్కలే ఉంటారనే భయం కలుగుతుంది. అప్పుడు.. రాత్రిపూట సాగే వ్యాపారాలకు ఎలాంటి ఢోకా ఉండదని చెబుతున్నారు.
టైమ్ జోన్‌తో సంబంధం లేకుండా.. సూర్యుడు ఉదయించినా.. అస్తమించినా.. ఎప్పుడూ మేల్కొనే ఉండేలా.. సరికొత్త అధ్యాయానికి హైదరాబాద్ శ్రీకారాం చుట్టబోతోంది. నిరంతరం ఆర్థిక కార్యకాలాపు, వ్యాపారాలు, జీవనం కొనసాగేలా.. సిటీని మార్చాలనేది.. తెలంగాణ సర్కార్‌కున్న కీలకమైన, దూరదృష్టి గల వ్యూహం. ఈ మార్పు కేవలం సౌలభ్యం కోసమే కాదు.. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు, ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచేలా.. కీలక అడుగులు వేయనుంది ప్రభుత్వం.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం.. రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులను సాధించడమే కాదు.. హైదరాబాద్‌ని గ్లోబల్ కంపెనీలకు.. బెస్ట్ డెస్టినేషన్‌గా మార్చే వ్యూహం కూడా ఉంది. తెలంగాణ ఎకానమీ పెరగాలంటే.. ముందు హైదారాబాద్ ఎకానమీ పెరగాలి. ఎందుకంటే.. రాష్ట్ర ఆదాయంలో మేజర్ షేర్ సిటీ నుంచే వస్తోంది. అలాంటప్పుడు.. హైదరాబాద్‌ని కేవలం కొన్ని గంటలు మాత్రమే యాక్టివ్‌గా ఉంచడం కంటే.. 24/7 ఆన్‌లో ఉంచితే.. స్టేట్ ఎకానమీ మరింత మెరుగవుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ ఉద్దేశం కూడా అదే. హైదరాబాద్‌లో నైట్ ఎకానమీని డెవలప్ చేసేందుకు.. ప్రభుత్వం ఎంత కమిటెడ్‌గా ఉందో చెప్పడమే కాదు.. నగరంలో ఎలాంటి సౌకర్యాలు, ఏవిధమైన శాంతిభద్రతలు ఉన్నాయనే విషయాలను కూడా.. మల్టీ నేషనల్ కంపెనీలకు వివరిస్తున్నారు అధికారులు. హైదరాబాద్‌ని.. 24/7 నగరంగా మార్చేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం.. మూడు కీలక అంశాలపై ఆధారపడి ఉంది. ఒకటి.. ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, రెండు.. భద్రత, మౌలిక వసతుల కల్పన, మూడు.. సామాజిక జీవనం. వీటి మీదే.. సిటీ ఫ్యూచర్‌తో పాటు తెలంగాణ ఎకానమీ కూడా ఆధారపడి ఉంది. 3 షిప్టుల్లో ఆఫీసులు, వ్యాపారాలు కొనసాగితే.. ఊహించని మార్పులు వస్తాయ్.
ప్రస్తుతం.. ఎన్నో ఐటీ కంపెనీలు, కొన్ని అంతర్జాతీయ సంస్థలు మాత్రమే 24/7 పనిచేస్తున్నాయ్. ఈ వ్యవస్థను.. ఇతర రంగాలకు విస్తరించడమే లక్ష్యం. ఐటీ.. ఐటీ అనుబంధ రంగాల్లో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్‌లకు సేవలందించేందుకు.. ఐటీ, బీపీఓ, కేపీఓ లాంటి సంస్థలు.. ఇప్పటికే 24 గంటల పాటు పనిచేస్తున్నాయి. ఈ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు.. నైట్ ఎకానమీ విజన్ సపోర్ట్‌గా నిలుస్తోంది. ఇక.. మాల్స్, సూపర్‌మార్కెట్‌లు, కిరాణా దుకాణాలు, రెస్టారెంట్‌ల లాంటి.. రిటైల్ వ్యాపారాలు.. రాత్రిపూట కూడా పనిచేసేందుకు అనుమతిస్తే.. ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లోని పారిశ్రామికవాడల్లో.. మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు రాత్రి షిఫ్టుల్లోనూ పూర్తి స్థాయిలో పనిచేసేలా ప్రభుత్వం ప్రోత్సహించనుంది. దీని ద్వారా.. ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. రాత్రిపూట ఆర్థిక కార్యకలాపాలు పెరిగితే.. వాటిని సపోర్ట్ చేసే లాజిస్టిక్స్, ఫుడ్ డెలివరీ సర్వీసులు కూడా మరింత చురుగ్గా మారతాయ్.
24/7 సిటీ ఆన్‌లో ఉంటే.. రాత్రిపూట కూడా ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేలా మౌలిక వసతులు, భద్రత కల్పించడం అత్యవసరం. ఇందుకోసం.. పటిష్టమైన పోలీసు నిఘా అవసరమవుతుంది. అందువల్ల.. ప్రధాన వాణిజ్య ప్రాంతాలు, ఐటీ కారిడార్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో రాత్రిపూట పెట్రోలింగ్‌ని పెంచనున్నారు. నగరంలో సిసీటీవి కెమెరాల కవరేజీని విస్తరించి.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. రాత్రి పూట పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రత కోసం స్పెషల్ షీ టీమ్స్ పెట్రోలింగ్, కార్పొరేట్ సంస్థల సహకారంతో.. సురక్షిత ట్రాన్స్‌పోర్ట్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలకు.. 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉండేలా చూడాల్సి ఉంటుంది. ఇదే.. ఎంతో ముఖ్యం. రాత్రి వేళల్లో రవాణా సౌకర్యం కూడా కీలకమే. హైదరాబాద్‌లో మెట్రో రైల్, ఆర్టీసీ బస్ సర్వీసులు.. 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాల్సి ఉంటుంది. ఐటీ కారిడార్లలో.. స్పెషల్ నైట్ బస్ సర్వీసులు నడపాలి. రాత్రిపూట ప్రయాణించేందుకు సురక్షితమైన, అందుబాటు ధరల్లో క్యాబ్‌లు, ఆటోలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
ప్రజలు.. రాత్రిపూట సరదగా తిరగాలన్నా, గడపాలన్నా.. అందుకు అనుగుణంగా సామాజిక, వినోద కార్యకలాపాలు అందుబాటులో ఉండాలి. ఇందుకోసం.. నిర్దిష్ట ప్రాంతాల్లో కేఫ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు, తెల్లవారుజాము వరకు పనిచేసేందుకు పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మున్సిపల్ సేవలు కూడా కీలకంగా మారతాయ్. పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ లాంటి వాటిని.. రాత్రిపూట కూడా అందించే వ్యవస్థని బలోపేతం చేయాలి. ముఖ్యంగా.. సిటీలోని కొన్ని ప్రాంతాలకు.. నైట్ ఎకానమీ హాట్ స్పాట్‌లుగా ప్రకటించి.. అక్కడ 24/7 కార్యకలాపాల కోసం ప్రత్యేక అనుమతులు ఇస్తే.. జనం నెమ్మదిగా నైట్ లైఫ్‌కి కూడా అలవాటుపడతారు. హైదరాబాద్ లాంటి సిటీని.. 24/7 సిటీగా మార్చడం వల్ల నగరానికి అనేక ప్రయోజనాలు చేకూరతాయ్. ఆర్థిక కార్యకలాపాలు నిరంతరం కొనసాగడం వల్ల.. రాష్ట్ర జీఎస్‌డీపీ పెరుగుతుంది. వ్యాపారాలు ఎక్కువ ఆదాయాన్ని పొందుతాయి. 3 షిఫ్టుల్లో కార్యకలాపాలు సాగితే, ఉద్యోగ కల్పన అపారంగా పెరుగుతుంది.
ముఖ్యంగా.. రాత్రిపూట విధుల కోసం, సెక్యూరిటీ, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ లాంటి అనుబంధ రంగాల్లో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తాయి. సిటీలో ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది. పగలు చేయలని పనులు.. రాత్రిపూట చేయడం ద్వారా సిటీ కెపాసిటీ మెరుగుపడుతుంది. అప్పుడు.. న్యూయార్క్, లండన్, సింగపూర్ లాంటి ప్రపంచస్థాయి నగరాల సరసన హైదరాబాద్ నిలుస్తుంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ప్రజలకు కూడా తమకు సౌకర్యంగా ఉండే సమయంలో షాపింగ్ చేసుకునేందుకు, కాస్త రిలాక్స్ అయ్యేందుకు, వినోదం పొందేందుకు అవకాశం లభిస్తుంది. హైదరాబాద్‌ని.. 24/7 సిటీగా మార్చాలనే ప్రభుత్వ వ్యూహం.. కేవలం ఓ నిర్ణయం మాత్రమే కాదు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాలోనే ఓ గొప్ప విజన్. సమర్థవంతమైన భద్రత, పటిష్టమైన మౌలిక వసతులు, సులభతర వాణిజ్య విధానాల కలయికతో.. హైదరాబాద్ అతి త్వరలోనే.. గ్లోబల్ సిటీగా అవతరించే అవకాశాలున్నాయి.
Story by Anup, Big Tv