Hyderabad News: పుత్తడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సమయంలో బంగారు వస్తువు పోతే ఇంకేమైనా ఉందా? ఇంట్లో ఉండే ఒత్తిడి అంతా ఇంకా కాదు. ఇవన్నీ ఆ మహిళ ముందుగానే పసిగట్టింది. ప్రతీ రోజూ బంగారం విషయంలో బాధపడే బదులు ఈ లోకాన్ని విడిచిపోతే ఎలాంటి సమస్య ఉండదని భావించింది. చివరకు ఆత్మహత్య చేసుకుంది. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. అసలేం జరిగిందంటే..
బంగారం.. ఆ మహిళ షాకింగ్ నిర్ణయం
హైదరాబాద్‌లోని చింతల్‌కుంటకు చెందిన 28 ఏళ్ల సుధేష్ణ నాలుగేళ్ల కిందట ఆశిష్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం వనస్థలిపురంలోని ఆగమయ్య నగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఈనెల 16న బంధువుల శుభ కార్యానికి వెళ్లింది. ఫంక్షన్ అంటే బంగారం వేసుకుని వెళ్తారు. ఆమె కూడా అదే చేసింది.
ఆ శుభకార్యంలో ఆమెకున్న ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అక్కడ ఏం జరిగిందో తెలీదు. బంగారం పోయేసరికి ఎలాంటివారికైనా మనస్సు గట్టిగానే నొచ్చుకుంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా ఏడు తులాలు. ప్రస్తుతం మార్కెట్లో రేటు బట్టి చూస్తే దాదాపు ఏడు లక్షలన్నమాట.
బంధువుల ఇంటిలో వెతికింది. పోయిన బంగారం దొరక్కపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది సుధేష్ణ. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలా అని పదే పదే ఆలోచించింది. ఎలాంటి ఫలితం లేదు. బంగారం పోయిందని ఇంట్లో చెబితే ఎలాంటి రియాక్షన్ వస్తుందోనని భయపడింది. ఆ భయం ఆమెని మింగేసింది.
ALSO READ: హైదరాబాద్ స్టార్ హోటల్.. ఓ యువ వైద్యురాలికి వేధింపులు
బంగారం విషయంలో రోజూ బాధపడే బదులు ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తే ఎలాంటి సమస్య ఉండదని భావించింది సుధేష్ణ. రెండున్నరేళ్ల కొడుకు ఆరుష్ కుమార్‌తోపాటు తాను ఉంటున్న ఇంటి మూడో అంతస్తు నుంచి కిందకు దూకేసింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుధేష్ణ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మరణించింది. ఆమె కొడుకు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంగారం రేటు ఆకాశాన్ని అంటిన వేళ ఆభరణాలతో బయటకు వెళ్లే మహిళలు తస్మాత్ జాగ్రత్త.