YSRCP Future In Prakasham: ప్రకాశం జిల్లా వైసీపీలో ఏం జరుగుతుందో అసలు అంతుబట్టడం లేదని ఆ పార్టీ శ్రేణులే వాపోతున్నాయి. ఇప్పటికే జిల్లాకు చెందిన మాజీమంత్రులతో పాటు మరో ఎమ్మెల్సీ పార్టీకి గుడ్ బై చెప్పగా…. తాజాగా మరో మాజీమంత్రి కూడా ఇవాళో.. రేపో పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. దానికి తోడు ఇద్దరు, ముగ్గురు నియోజకవర్గ ఇంచార్జులు అసలు అడ్రస్ లేకపోవటంతో అక్కడ ఏం జరుగుతుందో కూడా అధిష్టానానికి అర్దం కావటం లేదట. ఇంత జరుగుతున్నా పార్టీని సెట్ చేసే ట్రబుల్ షూటర్ లేకపోవటంతో డ్యామేజ్ కంట్రోల్ చేసుకోలేక సతమతమవుతున్నారంట పార్టీ పెద్దలు..
ప్రకాశం జిల్లాలో వైసీపీకి గుడ్‌బై చెప్తున్న నేతలు
వైసీపీ అధికారం కోల్పోవటంతో ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. వరుసగా ఆ పార్టీ నేతలు మాజీ సీఎం జగన్‌కు బైబై చెప్పి కుదిరిన వారు టీడీపీలోకి , కుదరక పోతే జనసేనలోకి చెక్కేస్తున్నారు. లేకుంటే రాజకీయాలకే దూరంగా జరుగుతున్నారట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజక వర్గాలలో 2024 ఎన్నికల్లో జగన్ 11 మంది కొత్తవారిని ఆయా నియోజకవర్గాలలో పోటీకి దింపారు . కేవలం ఇద్దరు మాత్రమే విజయం సాధించగా మాజీ మంత్రి బాలినేనితో పాటు 10 మంది ఓటమి పాలయ్యారు. దాన్ని తట్టుకోలేని వైసిపి నేతలు ఒక్కొక్కరు పార్టీకి దూరంగా జరగగా. మిగిలిన వారు కూడా ఆయా నియోజక వర్గాలలో యాక్టివ్‌గా లేరంట.
జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని
వైసీపీ విజయం సాధించిన దర్శి, యర్రగొండపాలెం నియోజక వర్గాలు మినహా మిగిలిన పది నియోజక వర్గాల ఇన్‌ఛార్జ్‌లు ప్రజలకు అందుబాటులో లేరంట. జిల్లా వైసీపీలో అన్నీ తానై నడిపించిన జగన్ సమీప బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి తర్వాత జనసేనలో చేరిపోయారు. మరో మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. మరో మాజీమంత్రి శిద్దా రాఘవరావు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేయగా, మరో మాజీ మంత్రి కూడా పార్టీ మారనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
పోతుల సునీత టీడీపీలోకి రాకుండా అడ్డుకుంటున్న నేతలు
వైసీపీకి మౌత్ పీస్‌గా వ్యవహరించిన ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత సైకిలు ఎక్కేందుకు ప్రయత్నించగా ఆ పార్టీ నేతలు అడ్డు తగులుతున్నారంట. మాజీ మంత్రి పరిటాల రవి అనుచరులు అయిన పోతుల సునీత, ఆమె భర్త పోతుల సురేష్ మావోయిస్టు రాజకీయాల నుంచి టీడీపీలో చేరారు. చీరాల నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయిన పోతుల సునీతకు టీడీపీ అధినేత చంద్రబాబు 2017 లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు..
వైసీపీలో తిరిగి ఎమ్మెల్పీగా అవకాశం కల్పించిన జగన్
అయితే 2019 ఎన్నికల తర్వాత టీడీపీ అధికారం కోల్పోవటంతో మరో మూడేళ్లు సమయం ఉండగానే పోతుల సునీత తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆమెకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. వైసీపీలో చేరిన నాటి నుంచి ఆ పార్టీ అధినేత జగన్ ఆమెకు సముచిత స్దానమే ఇచ్చారు. దానికి తగ్గట్లుగా ఆమె కూడా టీడీపీ అధినేత చంద్రబాబును అవసరం ఉన్నా లేకపోయినా గట్టిగానే కౌంటర్ ఇస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా ఆమె వైసీపీకి రాజీనామా చేశారు. మరో మారు పదవీకాలం ముగియకుండానే ఎమ్మెల్సీ పదవి వదులుకున్నారు.
2019లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. 2019లో ఒంగోలు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అర్వాత ఆయన ఆ పార్టీ నుంచి వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో పోటీచేయలేకపోయిన ఆయన తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో దర్శి నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావించినా సాధ్యపడలేదు. వైసీపీ అధినేత జగన్ ఉమ్మడి ప్రకాశం లోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాలలో ఏదో ఒక స్దానం నుంచి పోటీ చేయాలని సూచించినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదంట. ప్రస్తుతానికి శిద్దా రాఘవరావు ఏ పార్టీలో చేరకపోయిన్పటికీ టీడీపీలో చేరేందుకు తన అనుకూల వర్గాల ద్వారా పావులు కదుపుతున్నట్లు సమాచారం.
కందుకూరు ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన మహీధర్ రెడ్డి
మరో మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి కందుకూరు నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మేల్యేగా విజయం సాధించారు. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్‌లో మున్సిపల్ శాఖా మంత్రిగా పనిచేశారు. 2018లో వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పనిచేసిన మహీధర్ రెడ్డిని కాదని 2024లో కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్‌కు కందుకూరు సీటు కేటాయించటంతో ఆయన పార్టీతో పాటు రాజకీయాలకు తాత్కాలికం విరామం ప్రకటించారు. కందుకూరు నుండి పోటీచేసి ఓడిపోయిన బుర్రా మధుసూదన్ కూడా అక్కడి క్యాడర్‌కు టచ్‌లో లేరట.
అద్దంకిలో అడ్రస్ లేకుండా పోయిన హనిమిరెడ్డి
ఇఖ అప్పటికప్పుడు హడావుడిగా అద్దంకి తీసుకు వచ్చి జగన్ పోటీలో నిలబెట్టిన పానెం హనిమిరెడ్డి ఎన్నికల తరువాత అంతులేకుండా పోయారు. చీరాల టిక్కెట్ కోసం చివరివరకు ప్రయత్నం చేసిన ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెసు పార్టీలో చేరగా అక్కడి నుండి పోటీ చేసిన కరణం వెంకటేష్ ఎన్నికల తరువాత పార్టీ కార్యక్రమాలలో అంత చురుకుగా లేరంట. చీరాల రాజకీయాల్లోనే కొనసాగితే ఆమంచి కృష్ణమోహన్ రూపంలో గండం పొంచి ఉండటంతో వెంకటేష్ తన సొంత నియోజకవ్గం అద్దంకికి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారంట.
పర్చూరులో ఓటమిపాలై ఫారిన్ చెక్కేసిన యడం బాలాజీ
పర్చూరులో వైసీపీ నుంచి పోటీ చేసి పరాజయంపాలైన యడం బాలాజీ ఎన్నికల ఆనంతరం ఫారిన్ చెక్కేయ్యటంతో కొత్తగా గాదె వెంకటరెడ్డి మనుమడు గాదె మధుసూదన్ రెడ్డిని అక్కడ ఇన్‌ఛార్జ్ గా జగన్ నియమించారు. గిద్దలూరు, మార్కాపునం నియోజకవర్గాల్లో సిట్టింగు ఎమ్మెల్యేలను జగన్ అటూ ఇటూ మార్చి పోటీ చేయించగా ఇద్దరూ వారిద్దరు ఓటమి పాలయ్యార. ఆనంతరం ఇరువురు తమ సొంత నియోజక వర్గాలతో టచ్‌లో ఉంటున్నారు కానీ వారికి ఇచ్‌ఛార్జ్‌లుగా కేటాయించిన నియోజకవర్గాలలో మాత్రం కార్యకర్తలకు అందుబాటులో లేరంట.
కొండపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆదిమూలపు సురేష్
మరో మంత్రి అదిమూలపు సురేష్ 2024 ఎన్నికల్లో తన నియోజకవర్గం అయిన యర్రగొండపాలెంను వదిలి కొండపి నుంచి పోటీ చేసి ప్రస్తుత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో కొండపి నియోజకవర్గంలోని పార్టీ ఆఫీసులను కూడా ఖాళీ చేశారట. ఎదో ఒక విధంగా తిరిగి తన సొంత నియోజకవర్గం అయిన ఎర్రగొండపాలెంకు వెళ్లందుకు సొంతపార్టీ ఎమ్మెల్యేకు పొగ పెట్టాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంతనూతలపాడు నుంచి పోటీ చేసి ఓడిన మాజీమంత్రి మేరుగు నాగార్జున కేవలం పార్టీ సెంట్రల్ ఆఫీస్‌కే పరిమితం అయ్యారు తప్ప నియోజకవర్గంలోని కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారంట.
Also Read: షర్మిలపై తిరుగుబాటు.. హైకమాండ్ నిర్ణయం ఏంటి?
ట్రబుల్ షూటర్ లేక జిల్లాలో దయనీయంగా మారిన వైసీపీ పరిస్థితి
గతంలో 2019 ఎన్నికలు ముందు కూడా వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిపోయిన తరుణంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన బాలినేని పార్టీని తిరిగి గాడిలో పెట్టారు. జిల్లాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు కృషి చేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండాపోయింది. జిల్లాలో అసలు నియోజకవర్గాల ఇంచార్జ్‌లు ఏం చేస్తున్నారో.. అక్కడ కార్యకర్తల పరిస్దితి ఏంటో అడిగే వారు కూడా లేకుండా పోయారట. పార్టీలో సంక్షోభం తలెత్తిన సమయంలో ఇటు జిల్లాలో కానీ.. అటు పార్టీ అధిష్టానంలో కానీ ఓ ట్రబుల్ షూటర్ కూడా లేకపోవటంతో వైసీపీ పరిస్దితి మరింత దయనీయంగా మారిపోతుందట. ఆ పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోలేక పోవటంతో వలసలను కూడా నివారించుకోలేక పోతుందట. ఆ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి వైసీపీకి ఇంకెంత మంది తమ దారి తాము చూసుకుంటారో అన్నది చర్చనీయాంశంగా మారింది.