AI Backlash: వీటి గురించి డిస్కస్ చేసేకంటే ముందు.. ఓ న్యూస్ తెలుసుకోవాలి. చాట్ జీపీటీని సృష్టించిన.. ఓపెన్‌ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఇంటిపై దాడి జరిగింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని శామ్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తి మొలటోవ్ కాక్‌టెయిల్‌ని విసిరాడు. దాంతో.. అతని ఇంటి గేటుకి మంటలు అంటుకున్నాయి. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, పెట్రోల్ బాంబు దాడి జరిగిన సమయంలో.. శామ్ ఇంట్లోనే ఉన్నారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. దీని తర్వాత.. ఓపెన్ ఏఐ ఆఫీసుకి కూడా నిప్పు పెడతామనే బెదిరింపులు వచ్చాయ్.
ఈ ఘటనకు సంబంధించి.. 20 ఏళ్ల యువకుడిని అనుమానితుడిగా భావించి అరెస్ట్ చేశారు. అయితే.. ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్.. చాలా కాలంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు సంబంధించిన చర్చలకు సెంటర్ పాయింట్‌గా ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆయన కుటుంబ భద్రత కూడా ఆ కథలో భాగమైంది. తన కుటుంబాన్ని, తనను ప్రమాదంలో పడేసేలా.. తన ఇంట్లో జరిగిన ఘటనపై.. శామ్ ఓ బ్లాగ్ పోస్ట్ రాశారు. అందులో.. ఈ దాడిని ఏఐ చుట్టూ నెలకొన్న విస్తృత ఆందోళన వాతావరణానికి ముడిపెట్టారు. ఏఐ గురించి తీవ్ర ఆందోళన నెలకొన్న సమయంలో ఇలా జరిగిందని, దీనివల్ల.. తనకు మున్ముందు పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయని నమ్ముతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడొక.. టెక్నాలజీ రెవల్యూషన్ మాత్రమే కాదు. సామాజిక, ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్న శక్తివంతమైన మార్పు. చాట్ జీపీటీ రాకతో మొదలైన ఈ ఏఐ సునామీ ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తోంది. ఈ క్రమంలోనే ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ నివాసం దగ్గర జరిగిన ఘటన, ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీకి వ్యతిరేకంగా ప్రజల్లో పెరుగుతున్న అసహనానికి నిదర్శనమా? అనే చర్చ మొదలయ్యేందుకు కారణమైంది. శామ్ కూడా ఏఐ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలను ప్రస్తావించారు. ఇది సమంజసమైందనేని, సదుద్దేశంతో వచ్చిన విమర్శలను, చర్చలను స్వాగతిస్తామన్నారు. టెక్నాలజీ ఎప్పుడూ అందరికీ ప్రయోజనకరంగా ఉండదని శామ్ ఆల్ట్‌మన్ అన్నారు. ఏఐ వ్యతిరేక భావాలను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. కానీ, సాంకేతిక పురోగతి.. భవిష్యత్తును ఊహించలేనంతగా బాగా మార్చేస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.
ఏఐ టూల్స్ రాకతో ఉద్యోగాల కోత మొదలైంది. చాలా మందిలో అభద్రతా భావం పెరిగిపోయింది. క్రియేటివ్ రైటింగ్ నుంచి కోడింగ్ దాకా.. డేటా ఎంట్రీ నుంచి గ్రాఫిక్ డిజైనింగ్ దాకా అనేక రంగాలు ప్రభావితమయ్యాయ్. కంపెనీలు ఖర్చు తగ్గించుకునేందుకు, మనుషుల బదులు ఏఐ వాడుకునేందుకు మొగ్గుచూపుతున్నాయ్. ఫలితంగా.. లక్షలాది మంది తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. ఈ టెక్నాలజీ ఫోబియానే సామాన్యుల్లో ఒక రకమైన ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తమ పొట్ట కొడుతున్న టెక్నాలజీకి కారణమైన వ్యక్తుల మీదకు ఆ కోపమంతా టర్న్ అవుతోంది. ఇప్పుడు.. ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఇంటిపై జరిగిన దాడి కూడా అలాంటిదేననే వాదనలు వినిపిస్తున్నాయ్. ఏఐ టూల్స్‌తో.. టెక్ దిగ్గజాలు బిలియన్లకొద్దీ డాలర్లు గడిస్తుంటే.. సామాన్యులు ఉద్యోగాలు కోల్పోవడంపై అసహనం వస్తోంది. ఏఐ లిమిట్ లేకుండా పెరిగిపోతుంటే, దాన్నిఅడ్డుకునే చట్టాలు లేకపోవడంపైనా జనం ఆగ్రహంగానే ఉన్నారు.
చరిత్రలో ఎప్పుడు పారిశ్రామిక విప్లవం వచ్చినా.. లుడైట్స్ అనే సమూహం యంత్రాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు జరుగుతున్నదాన్ని డిజిటల్ లుడైటిజం అంటున్నారు. తమ ఉపాధిని ఏఐ దొంగిలిస్తోందని.. చాలా మంది కోర్టులకెక్కుతున్నారు. సాధారణ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని అనుమతి లేకుండా ఏఐ ట్రైనింగ్ కోసం వాడుకోవడంపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయ్. శామ్ ఆల్ట్‌మన్ లాంటి వానళ్లు.. ఏఐ వల్ల కలిగే లాభాల గురించి మాట్లాడుతున్నా, గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఏఐ వల్ల సంపద కేవలం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమైతే, సామాజిక అశాంతి పెరిగే అవకాశం ఉంది. శామ్ ఆల్ట్‌మన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి ఘటన ఓ ప్రారంభమే కావొచ్చు. టెక్నాలజీ వేగంగా పెరిగినప్పుడు, దానికి సమానంగా సామాజిక భద్రత కల్పించకపోతే, ఇలాంటి తిరుగుబాట్లు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు.
మానవ చరిత్రలో నిప్పును కనుగొనడం, విద్యుత్‌ని కనిపెట్టడం ఎంతటి మార్పులను తెచ్చిందో.. ఇప్పుడు ఏఐ కూడా అంతే ఇంపాక్ట్ చూపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు. అదొక.. గ్లోబల్ రెవల్యూషన్. టెక్నాలజీ ప్రపంచం ముఖచిత్రాన్ని మార్చేస్తోంది. దీనివల్ల కలిగే లాభనష్టాలు, భవిష్యత్తు పరిణామాలను మార్చేస్తాయా? అనే డిబేట్.. ఆసక్తి రేపుతోంది.
ఏఐ డెవలప్ అవుతున్న వేగం చూస్తుంటే, రాబోయే కొన్నేళ్లు ప్రపంచానికి ఓ పరీక్షా సమయం అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయ్. ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్.. ఏఐని లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌లోని శక్తిమంతమైన ఉంగరంతో పోల్చారు. అది.. ఒకరి చేతుల్లోనే ఉంటే విపరీతమైన ఆధిపత్యానికి దారితీస్తుంది. అందుకే, దానిపై ఎవరికీ పూర్తి నియంత్రణ ఉండకూడదన్నారు. ఈ పవర్‌ని.. సమాజం మొత్తం పంచుకోవాలని, లేకపోతే అది భారీ ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఇంకొన్నేళ్లలో డేటా సెంటర్లలో ఉండే ఏఐ తెలివితేటలు, మానవాళి మొత్తం తెలివితేటల కంటే ఎక్కువగా ఉండవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయ్. అందువల్ల.. ఏఐని కంట్రోల్ చేసేందుకు కూడా ఓ అంతర్జాతీయ సంస్థ ఉండాలనే వాదనలు వినిపిస్తున్నాయ్. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం, ఆర్థిక అసమానతలు పెరగడం లాంటివన్నీ.. సిస్టమిక్ షిఫ్ట్ అని, దీనిని తట్టుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఏదేమైనా, మిగతా రంగాలతో పోలిస్తే.. ఐటీ రంగంలో ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో పదుల సంఖ్యలో ఇంజనీర్లు చేసే కోడింగ్, టెస్టింగ్, డీబగ్గింగ్ లాంటి పనులను.. ఇప్పుడు ఏఐ టూల్స్ క్షణాల్లో పూర్తి చేస్తున్నాయి. దాంతో.. చాలా ఐటీ కంపెనీలు లేఆఫ్స్ చేస్తున్నాయ్. దీనికి కారణం.. ఏఐ పనుల్ని సులభతరం చేయడం ఒకటైతే, తక్కువ మందితో ఎక్కువ ప్రొడక్టివిటీ సాధించాలనే కంపెనీల తాపత్రయం కూడా ఇందుకు కారణమవుతోంది. దాంతో.. ఐటీ సెక్టార్ అంతా ఇప్పుడు ఏఐ మయం అవుతోందనే చర్చ జరుగుతోంది. అలాగనీ, మానవ మేధస్సు పూర్తిగా కనుమరగయ్యే అవకాశం కూడా లేదు. అయితే, పాత పద్ధతుల్లో పనిచేసే వారికి ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయంటున్నారు. ఏఐని ఓ టూల్‌గా వాడుకోగలిగే వారికే ఫ్యూచర్ ఉంటుందని చెబుతున్నారు.
ఏఐ వల్ల నష్టాలే కాదు, అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయ్. ఏఐ సాయంతో.. క్యాన్సర్ లాంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం, కొత్త మందులను వేగంగా కనిపెట్టడం సాధ్యమవుతోంది. విద్య, పరిశోధన, రోజువారీ పనుల్లో.. ఏఐ ఓ సూపర్ ఇంటలిజెంట్ అసిస్టెంట్‌గా మారుతోంది. సమయం ఆదా చేస్తోంది. బోర్ కొట్టించే చాలా పనుల నుంచి మనిషికి విముక్తి దొరుకుతోంది. అయితే, ఏఐతో ఎన్ని ప్రయోజనాలున్నా.. మితిమీరిన టెక్నాలజీ ఎప్పుడూ రెండంచుల కత్తి లాంటిదే. అది.. మన అవకాశాలను దెబ్బతీస్తుందా? మనమే దానిని నియంత్రిస్తామా? అనే దానిమీదే టెక్నాలజీ మనల్ని శాసిస్తుందా? లేదా? అనేది ఆధారపడి ఉంది. ప్రతి చిన్న విషయానికి ఏఐపై ఆధారపడితే, మానవ సహజమైన క్రియేటివిటీ, అనలటికల్ సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు.. సహజంగా ఆలోచించే శక్తిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏఐని నియంత్రించలేం. ఎందుకంటే, అది ఇప్పటికే మన జీవితాల్లో భాగమైపోయింది. మనమంతా చేయగలిగింది ఒక్కటే.. టెక్నాలజీకి అనుగుణంగా మారడం. కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం ద్వారా.. స్కిల్ పెంచుకోవాలి. మున్ముందు ప్రభుత్వాలు కూడా ఏఐ వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకురావాలనే డిమాండ్లు రావొచ్చు. ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు రావాలి. ఏఐకి లాజిక్ ఉంటుంది గానీ, ఎమోషన్ ఉండదు. మనుషుల్లో ఉండే సామాజిక స్పృహని టెక్నాలజీ భర్తీ చేయలేదు. ఏఐ మనల్ని రూల్ చేయదు. కానీ, ఏఐని తెలివిగా వాడుకోగలిగితే.. మనమే ఏఐని శాసించొచ్చు.
Also Read: బీహార్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 13 మంది మృతి.. 30 మందికి గాయాలు
Story by: Anup, Big Tv