Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్‌గా వచ్చిన లేడీ బాస్ మీనాక్షీ నటరాజన్ ఎఫెక్ట్ అప్పుడే పార్టీపై క్లియర్‌గా కనిపిస్తోంది. కీలక సమావేశం ముగిసిన, గంటల వ్యవధిలోనే నేతలకు ఆమె అలర్ట్ సైరన్ పంపిచారు.. ఒక వికెట్ పడగొట్టి, లైన్ దాటితే ఔట్ అన్న వార్నింగ్ ఇచ్చారు. పార్టీపై తిరుగుబాటు వాయిస్ వినిపిస్తున్న తీన్మార్ మల్లన్నపై చర్యలతో తన స్టైల్ ఎలా ఉంటుందో చూపించారు. ఆ క్రమంలో ఇప్పటి వరకు ఒకలెక్క.. ఇక నుంచి మరోలెక్క.. పార్టీకి మంచి రోజులు వచ్చాయని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడే నేతల నోటికి ఇక తాళాలు పడతాయని కాంగ్రెస్ శ్రేణులు హ్యాపీ అవుతున్నాయంట.
చార్జ్ తీసుకోగానే యాక్షన్ మొదలుపెట్టిన మీనాక్షి నటరాజన్
లేడీ బాస్ వచ్చారు. యాక్షన్ షురూ చేశారు. అని తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటూ తెగ ఆనందపడిపోతున్నాయి. పాత ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కంటే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్‌గా వచ్చిన మీనాక్షి నటరాజన్ చాలా జూనియర్ .. కానీ అమె ఆలోచనలు, నిర్ణయాల ముందు ఆమెకు ఎవరు సాటి రారు.. గురి పెట్టారా గోలి దిగాల్సిందే అన్నట్లు ఉంటుందంట వ్యవహారం. అయితే అక్కడ హంగు ఆర్భాటం ఉండదు.. కేవలం పని మాత్రమే.
వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిన తీన్మార్ మల్లన్న
మీనాక్షి నటరాజన్ సాదా సీదాగా ఉంటారు. హంగు ఆర్భాటాలంటే చిరాకు.. గాంధేయవాది, ఐడియాలజికల్‌గా పవర్ ఫుల్ ఉమెన్.. తేడాలు వస్తే, తాట తీసుడే.. పార్టీకి లాయల్టీగా ఉండాలంటారు, గీత దాటి ప్రవర్తిస్తే వేటు పడుుతుందని చేతల్లో చూపిస్తారు. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డే ఆఖరి రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముఖ్యమంత్రని.. వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.
కులగణనపై రాహుల్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన రేవంత్
అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన పై అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆలోచనలను రేవంత్ రెడ్డి ఆచరణలో పెట్టారు. రాష్ట్రంలో కులగణన నిర్వహింపచేసిన ముఖ్యమంత్రి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కులగణన పై తప్పుడు ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు సమర్ధంగా తిప్పికొడుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ భీఫామ్‌తో ఎమ్మెల్సీగా గెలిచిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కులగణన రిపోర్టు ను చించి, నిప్పు పెట్టి కొత్త కాంట్రవర్సీకి కారణం అయ్యారు. బీసీలు తెలంగాణ ఓనర్లని.. రాష్ట్ర జనాభాలో పిరికెడు మందిలేని వారిలో 60మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారని.. రెడ్లు, వెలమలు అసలు తెలంగాణ వారే కాదని చిత్రమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు.
తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ నేతగా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టడంతో ఆ పార్టీ నేతలే మల్లన్న పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వాదాన్ని వినిపించడంలో తప్పులేదు కాని.. దాన్ని తీన్మార్ మల్లన్న ఎక్స్‌ప్రెస్ చేసిన తీరే వివాదాస్పదంగా మారింది. మల్లన్న వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా పరిగణించింది. షోకాజ్ నోటీస్ అందజేసింది. అయినా మల్లన్న తగ్గకపోవడంతో.. తాను చార్జ్ తీసుకోగానే సస్పెన్షన్ వేటు వేయించి తన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించారు మీనాక్షి నటరాజన్.. షోకాజ్ నోటీసుకు మల్లన్న రిప్లై ఇవ్వలేదని తెలిసి సీరియస్ అయిన కొత్త ఇన్చార్జ్ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డిని ఆదేశించి.. మల్లన్నను పార్టీ నుంచి కట్ చేయించారు.
సాదాసీదాగా ట్రైన్‌లో వచ్చిన మీనాక్షీ నటరాజన్
ఇక మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే పట్టభద్రుల ఎన్నిక కోసం వరసగా జూమ్ మీటింగ్స్ పెట్టి దిశానిర్దేశం చేసి నేతల్లో కొత్త జోష్ నింపారు. గాంధీ భవన్లో తొలి మీటింగ్ కండక్ట్ చేసి నేతలకు తన స్టైల్ ఆఫ్ వర్క్ మీద క్లారిటీ ఇచ్చారు. గీత దాటిన వారికి చర్యలు ఉంటాయి. అది చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా.. ఏ కులమైనా, మతమైనా పార్టీ లైన్ క్రాస్ చేసే లీడర్ల విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.. ప్రజల్లో ఉండండి, ప్రజల కోసం పనిచేయండి, పేదల చిరునవ్వుకి కారణం కండి.. అంటూ గ్రామ స్థాయి నేతల నుండి మంత్రి దాక ప్రతి ఒక్కరికి దిశానిర్ధేశం చేస్తూ.. తన సింప్లిసిటీతో అందర్నీ ఆశ్చర్యపరిచారు.
స్వాగతాలు, పూల బొకేలు, ఫ్లెక్సీలు సన్మానాలకు దూరం
సాధారణంగా.. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఇంచార్జ్ వస్తున్నారంటే.. హైదరాబాద్ గాంధీ భవన్‌లో హడావుడి మామూలుగా ఉండదు. పార్టీ నేతల హంగామాకు హద్దే ఉండదు. కానీ.. మీనాక్షి నటరాజన్ ఫ్లైట్‌లో కాకుండా.. సాదాసీదాగా ట్రైన్‌లో రావడం చూసి అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. పార్టీలో ఎంతో కీలకమైన స్థానంలో ఉన్నప్పటికీ ఆవిడ.. హంగూ, ఆర్భాటాలకు దూరంగా ఉన్నారు. ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలా.. సింపుల్‌గా భూజానికి ఓ హ్యాండ్ బ్యాగు, వీపున చిన్న లగేజీ బ్యాగ్ వేసుకొని హైదరాబాద్ వచ్చేశారు. స్వాగతాలు, పూల బొకేలు, ఫ్లెక్సీలు, శాలువాలు, సన్మానాల లాంటివి తనకు నచ్చవని.. వాటికి దూరంగా ఉండాలని ముందే పార్టీ నేతలకు సూచించారు. తన బ్యాగ్ కూడా తానే మోసుకొని వచ్చారు. రైల్వే స్టేషన్ నుంచి నేరుగా.. తాను ఆన్‌లైన్‌లో సొంతంగా డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న దిల్ కుశా గెస్ట్ హౌజ్ గదిలో దిగారు. అక్కడే బస చేశారు.
అత్యవసరమైతే తప్ప ఫ్లైట్ జర్నీ చేయరు
మీనాక్షి నటరాజన్ బ్రహ్మచారిణి. చాలా సాదా సీదాగా ఉంటారు. ఎమర్జెన్సీ మీటింగులకు, రాహుల్ గాంధీ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పుడు.. అత్యవసర పిలుపు వస్తే మినహా.. ఆమె ఫ్లైట్ జర్నీ చేయరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె వెంట ఎప్పుడూ రెండు జతల బట్టలే ఉంటాయి. మామూలు భోజనమే చేస్తారు. నాన్‌వెజ్‌కు దూరం. ఎక్కడికెళ్లినా.. ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌లోనే మాజీ ఎంపీ హోదాలో సొంత ఖర్చుతో బస చేస్తారు. కాన్వాయ్ ప్రయాణానికి సైతం దూరంగా ఉంటారు.
గ్రూపు మీటింగులు తప్ప.. పర్శనల్ మీటింగులకు దూరం
సాధారణంగా ఆమె ఆటోలో వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తారు. గ్రూప్ మీటింగులు తప్ప.. పర్సనల్ మీటింగులకు ఆవిడ దూరం. అంతేకాదు.. టైమ్ అంటే టైమే. సమయ పాలన కచ్చితంగా పాటిస్తారు. ఇతర గెస్టుల కోసం ఎదురుచూడరు. ఎవరొచ్చినా.. రాకపోయినా.. ఆ సమయానికి మీటింగ్ మొదలుపెట్టేస్తారు. గాంధేయ సిద్ధాంతం ఆచరణలో భాగంగా.. ప్రతి శనివారం మౌనవ్రతం పాటిస్తారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె పెళ్లి కూడా చేసుకోలేదని చెబుతారు.
టాక్ ఆఫ్ ద తెలంగాణగా మారిన మీనాక్షీ నటరాజన్
అలాంటి సాఫ్ట్ లీడర్ వచ్చీ రాగానే మల్లన్నపై తీసుకున్న యాక్షన్‌తో.. టాక్ ఆఫ్ ద తెలంగాణగా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ జజజ అలాంటది మనం ఎవరితో అయిన పోరాటం చేయగలం అంటూ కాంగ్రెస్ కేడర్‌కు బూస్టప్ ఇస్తున్న మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో పార్టీ శ్రేణులు ఖుషీ అయిపోతున్నాయి. రాహుల్ గాంధీ మెచ్చిన నాయకురాలు, టీ కాంగ్రెస్ రాజకీయాల్లో మార్పు తీసుకు వచ్చి.. తనదైన స్టయిల్‌లో పార్టీ దశ దిశ మారుస్తారని నేతలు అనందం వ్యక్తం చేస్తున్నారు.. అంతర్గత ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరైన కాంగ్రెస్‌లో ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకునే నేతలకు ఇక కళ్లెం పడినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.