Union Minister Raksha Khadse Daughter Assault| మహారాష్ట్రలో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే (Raksha Khadse) ఆందోళన వ్యక్తం చేశారు. జల్గావ్ జిల్లాలోని ముక్తాయినగర్‌లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను కొందరు యువకులు వేధించారని ఆమె ఆరోపణలు చేశారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
మహాశివరాత్రి సందర్భంగా ముక్తాయినగర్‌లో జరిగిన సంత్ ముక్తాయ్ యాత్రలో తన కుమార్తె పాల్గొన్నదని, ఆ సమయంలో కొందరు యువకులు ఆమెను వెంబడించి వేధించారని రక్షా ఖడ్సే వివరించారు. భద్రతా సిబ్బంది అడ్డుకున్నప్పటికీ, ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారని ఆయన తెలిపారు. “ఒక ఎంపీ లేదా కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను,” అని రక్షా ఖడ్సే మీడియాకు తెలిపారు.
ఈ సంఘటనపై రక్షా ఖడ్సే మామ, మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే కూడా ఈ ఘటనపై స్పందించారు. “ఈ యువకులు కరుడుగట్టిన నేరస్థులు. వారిపై గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదులు చేయబడ్డాయి. మహారాష్ట్రలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి, కానీ నేరస్థులు పోలీసులకు భయపడటం లేదు. బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు,” అని ఏక్నాథ్ ఖడ్సే విమర్శించారు.
Also Read: మహిళలపై లైంగిక ఆరోపణలన్నీ నిజం కాదు.. తప్పుడు ఫిర్యాదులు చేస్తే చర్యలు తప్పవు
అంతేకాకుండా.. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసు కోవడంలో ఆలస్యం చేశారని మండిపడ్డారు. “పోలీస్ స్టేషన్‌కు వెళితే మమ్మల్ని రెండు గంటలపాటు కూర్చోబెట్టారు. అమ్మాయిల విషయం కాబట్టి పునరాలోచించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ యువకులు పోలీసులపై కూడా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిసింది. వారికి రాజకీయ నాయకుల అండ ఉంది,” అని ఏక్నాథ్ ఖడ్సే ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. నిందితులు ఒక రాజకీయ పార్టీకి చెందినవారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్దన్ సప్కాల్ మహాయుతి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. “మహాయుతి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి,” అని ఆయన మండిపడ్డారు.
ఇటీవలే మహారాష్ట్రలోని పుణె నగరంలో పట్టపగలు పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోని ఓ బస్టాండులో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. నిందితుడు యువతిని మోసపూరితంగా ఒక ఖాళీ బస్సులోకి తీసుకెళ్లి ఆమెపై బలవంతం చేవాడు. అయితే ఆ తరువాత నిందితుడిని రెండు రోజుల్లో పోలీసులు గాలించి పట్టుకున్నారు. ఈ ఘటన తరువాత ఇప్పుడు ఏకంగా ఒక కేంద్ర మంత్రి కూతురిని ఆకతాయిలు లైంగికంగా వేధించారని ఆరోపణలు రావడంతో రాష్ట్రంలో పోలీస్ శాఖ, ప్రభుత్వాన్ని అందరూ తప్పుబుడుతున్నారు.
ఈ సంఘటనల కారణంగా రాష్ట్రంలో మహిళల భద్రత, శాంతిభద్రతల పరిస్థితిపై పలువురు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.