E-Paper
Advertisement

Air India Flight: బ్లాక్ బాక్స్ విప్పిన భయంకర నిజం.. టేకాఫ్ అయిన 32 సెకన్లకే అసలేం జరిగింది?

Air India Flight: బ్లాక్ బాక్స్ విప్పిన భయంకర నిజం.. టేకాఫ్ అయిన 32 సెకన్లకే అసలేం జరిగింది?

Air India Flight: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనగానే… ఈ బీభత్సమే గుర్తొస్తుంది. వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటనే కళ్ల ముందు మెదులుతుంది. ఇప్పుడిదే ప్రమాదానికి సంబంధించి.. ఇటలీ పత్రిక ప్రచురించిన కథనం, ఈ విషాదం చుట్టూ ఉన్న అనుమానాలను ఒక్కసారిగా రేకెత్తించింది. ఈ ప్రమాదం కేవలం టెక్నికల్ లోపం వల్ల జరిగిందా? దీని వెనుక ఏదైనా చీకటి కోణం ఉందా? అనే చర్చ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సాగుతోంది.

ఎయిరిండియా ఫ్లైట్ 171 దుర్ఘటనపై సంచలన ఆరోపణలు!

గతేడాది జూన్ 12న జరిగిన ఈ దుర్ఘటన.. ఎయిరిండియా ఫ్లైట్ 171 అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరింది. టేకాఫ్ చేసిన 32 సెకండ్లకే రెండు ఇంజిన్ల నుంచి ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో.. విమానం కూలిపోయింది. విమాన సిబ్బంది 12 మంది, ప్రయాణికులు కలిపి మొత్తం 241 మంది మరణించారు. వీరు కాకుండా శకలాలు నేలపై కూలిపోయి వైద్య విద్యార్థుల హాస్టలపై పడి.. మరో 19 మంది కూడా చనిపోయారు. దాంతో.. మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది. విమానంలోని ఒక్క ప్రయాణికుడు మాత్రం మృత్యువును జయించి గాయాలతో బయటపడ్డాడు. అయితే.. ఈ ప్రమాదానికి సంబంధించి.. ఇటలీ పత్రికలో పబ్లిష్ అయిన ఆర్టికల్.. సెన్సేషన్‌గా మారింది. ఇద్దరు పైలట్లలో ఒకరు దాదాపుగా ఉద్దేశపూర్వకంగానే ఫ్యూయల్ స్విచ్‌లని ఆపేయడంతోనే విమానం కూలిపోయిందని, ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్న భారతీయ ఇన్వెస్టిగేటర్లు.. ఆ అంశాన్ని పొందుపరస్తూ, ఫైనల్ రిపోర్ట్ రూపొందిస్తున్నారని, ఇటలీ న్యూస్ పేపర్, కొరియరె డెల్లా సెరా సంచలన కథనం ప్రచురించింది. పాశ్చాత్య వైమానిక సంస్థల్లోని కొన్ని వర్గాలను కోట్ చేస్తూ.. ఈ బాంబ్ పేల్చింది.

కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్స్‌లో కీలక అంశాలు

ఎయిరిండియా విమాన దుర్ఘటనకు సాంకేతిక లోపం కారణం కాదని తనిఖీల్లో తేలిందని, ఫ్యూయల్ బటన్లు కదిలించిన పైలట్ ఎవరనేది కూడా కాక్‌పిట్‌ వాయిస్ రికార్డింగ్స్ విశ్లేషణలో భాగంగా ఇన్వెస్టిగేటర్లు గుర్తించారని ఇటలీ పత్రికలోని ఆర్టికల్‌లో ఉంది. దీనిపై విమాన దుర్ఘటన దర్యాప్తు బ్యూరో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించలేదు. విమానంలో ఇంధన సరఫరాకు వీలు కల్పించే స్విచ్చుల్ని ఉద్దేశపూర్వకంగా ఎలా ఆఫ్ చేశారు? బాధ్యత వహించేది ఎవరు? అనే అంశపై.. ఫైనల్ రిపోర్టులో పూర్తి వివరాలు ఉంటాయో, ఉండవో అనేది.. ప్రస్తుతానికైతే బయటకు రాలేదు. ఈ దుర్ఘటనలో మరణించిన విమాన పైలట్ సుమీత్ సబర్వాల్ వివాదానికి కేంద్ర బిందువుగా, ప్రధాన అనుమానితుడిగా నిలిచారని కొరియరె డెల్లా సెరా కథనం తెలిపింది. సుమీత్ సబర్వాల్ కుటుంబం, భారతీయ పైలట్ల సంఘాలు మాత్రం అతడి వైపే నిలిచాయి. విమాన తయారీదారు, దాని ఆపరేటర్, ఇతర అంశాలపై మరింత లోతుగా పరిశీలన జరగాలని ఇండియన్ పైలట్స్ అసోసియేషన్స్ డిమాండ్ చేశాయి.

బ్లాక్ బాక్స్ ఆడియో విశ్లేషణలో కీలక విషయాలు

ఎయిరిండియా విమాన దుర్ఘటన దర్యాప్తులో అమెరికన్ ఇన్వెస్టిగేటర్లు కూడా పాలుపంచుకుంటున్నారు. గతేడాది డిసెంబరులో భారతీయ దర్యాప్తు బృందం కూడా వాషింగ్టన్ వెళ్లింది. కూలిన ఎయిరిండియా విమానం బ్లాక్ బాక్స్‌ను ఇన్వెస్టిగేషన్ టీమ్ అమెరికాలోని జాతీయ రవాణా భద్రతా మండలికి చెందిన ప్రయోగశాలల్లో మరోసారి విశ్లేషించారు. ఇందులో ప్రత్యేకించి విమానం క్యాబిన్ ఆడియో రికార్డింగ్స్ మీద దృష్టి పెట్టారు. పొరపాటు వల్ల దుర్ఘటన సంభవించలేదని, ఇంధన స్విచ్ఛులను ఏ పైలట్ ఆఫ్ చేశారో కూడా ఆడియో విశ్లేషణలో బయటపడిందని కొన్ని వర్గాలను కోట్ చేస్తూ.. ఇటలీ పత్రిక కథనం రాసుకొచ్చింది.

ఎయిరిండియా ప్రమాదంపై అమెరికన్ ల్యాబ్ విశ్లేషణ

అమెరికన్ ల్యాబుల్లో జరిపిన ఫ్లైట్ డేటా రికార్డర్ విశ్లేషణ కూడా పైలట్ సుమీత్ సబర్వాల్ వైపే తప్పు చూపిస్తోంది. ఇంజిన్లు పనిచేయని క్రమాన్ని పరిశీలిస్తే… కమాండర్ సుమీత్ సబర్వాల్ కూర్చునే ఎడమ వైపు ఇంజిన్ షట్ డౌన్ అయిందని, ఆ తర్వాత కుడి వైపు ఇంజిన్ షట్ డౌన్ అయిందని తెలుస్తోంది. ఆ సమయంలో విమానాన్ని సబర్వాల్ మానిటర్ చేస్తుండగా, కో పైలట్ కుందర్ కుడి వైపు కూర్చుని విమానాన్ని నడుపుతున్నారు. విమానాన్ని పైకి, కిందికి, పక్కలకు తిప్పడానికి పైలట్లు తమ ఎదురుగా ఉండే కంట్రోల్ యోక్ వాడతారు. చాలినంత ఇంధనం అందక, చోదక శక్తి లోపించి, ఎయిరిండియా విమానం కిందికి కూలిపోబోతున్న ఆఖరి క్షణాల్లో.. అది ప్రయాణించే ఎత్తును పెంచేందుకు ఫస్ట్ ఆఫీసర్ కుందర్ ప్రయత్నించారు. అందుకు ఆయన వాడిన కంట్రోల్ యోక్ ఉన్న పొజిషన్ ఓ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక.. సబర్వాల్ ముందున్న కంట్రోల్ యోక్ మాత్రం ఎటూ కదలకుండా ఉంది. విమానం కిందకి కూలిపోతున్నప్పటికీ దాన్ని పైకి, ఎత్తుకు లేపేందుకు సబర్వాల్ ప్రయత్నించలేదని ఇటలీ పత్రిక కథనం తెలిపింది. అయితే.. ఈ తుది నిర్ధారణలు రాజకీయ నాయకత్వ పరిశీలనకు వెళ్లొచ్చని, జాతీయంగా తీవ్ర స్థాయిలో వివాదాలకు తావు ఇవ్వకుండా మరింత జాగ్రత్తగా ఫైనల్ రిపోర్ట్ తయారుకావొచ్చని, ఇటలీ పత్రిక తన కథనంలో ప్రస్తావించింది.

ఫ్యూయల్ స్విచ్ వివాదంతో సంచలనం

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తునకు సంబంధించిన కీలక పత్రాలు, ఇన్వెస్టిగేషన్ లీక్‌లను ఆధారంగా చేసుకొని ఈ ఆర్టికల్ రాశారు. విమాన శకలాల నుంచి సేకరించిన కొన్ని స్విచ్‌లు మాన్యువల్‌గా ఆఫ్ చేశారని ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించినట్లు ఇటలీ పత్రిక కథనం చెబుతోంది. అదే ఇప్పుడు.. విమానయాన రంగంలో పెను సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా.. పైలట్ సుమీత్ సభర్వాల్ ఉద్దేశపూర్వకంగానే ఫ్యూయల్ స్విచ్‌లని ఆపేసి ఉండొచ్చనేది ఆ ఆర్టికల్ సారాంశం. కానీ.. ఓ పైలట్ ఇలా ఎందుకు చేస్తాడు? దీని వెనుక ఉన్న సాంకేతిక, మానసిక కారణాలేంటి? అనేదే ఇప్పుడు చర్చకు వస్తోంది.

టేకాఫ్ క్షణాల్లోనే ఫ్యూయల్ కట్ ఆఫ్?

విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే.. గాల్లో ఉండగానే పైలట్ కావాలనే ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్‌లని ఆఫ్ చేశారని కథనం రాసింది. విమానంలోని డేటా రికార్డర్ల విశ్లేషణలోనూ ఇంజిన్ లోపం వల్ల.. ఆగిపోలేదని, మానవ తప్పిదం వల్లే ఆగిపోయాయని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపింది. అయితే.. కెప్టెన్ సుమీత్ సభర్వాల్ ఆ సమయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారా? అందుకే ఈ అనాలోచిత నిర్ణయం తీసుకున్నారా? అనేది ఇప్పుడు అనేక సందేహాలను లేవనెత్తుతోంది. ఓ అనుభవజ్ఞుడైన పైలట్ ఇంజిన్లను ఆఫ్ చేయడమనేది అరుదైన విషయం.

ఫ్యూయల్ కట్-ఆఫ్ స్విచ్‌పై కొత్త అనుమానాలు!

విమాన కాక్‌పిట్‌లో వందలాది స్విచ్‌లు ఉంటాయి. ఓ స్విచ్ వేయబోయి కన్ఫ్యూజన్‌లో మరో స్విచ్ నొక్కారా? అయితే.. ఫ్యూయల్ కట్-ఆఫ్ స్విచ్‌లు పొరపాటున కూడా ఆన్,ఆఫ్ చేయకుండా రక్షణ కవచాలను కలిగి ఉంటాయి. లేకపోతే.. విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తితే, దానిని సరిదిద్దే క్రమంలో పైలట్ తప్పుడు ప్రొసీజర్‌ని అనుసరించారా? అత్యవసర పరిస్థితుల్లో తప్పుడు నిర్ణయం తీసుకోవడాన్ని కాగ్నిటివ్ టన్నెలింగ్ అని పిలుస్తారు. లేకపోతే.. ఉద్దేశపూర్వకంగానే ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేశారా? నిజానికి.. ఇది అత్యంత భయంకరమైన కోణం. పైలట్ కావాలనే ప్రమాదంలోకి నెట్టాలని భావించి ఉంటారా? అనేది కూడా ఇప్పుడు డిబేట్‌కు దారితీసింది. ఏటీసీకి ఎలాంటి మేడే కాల్ ఇవ్వకపోవడం కూడా తాజా వాదనలకు బలం చేకూరుస్తోంది. గతంలో.. జర్మన్ వింగ్స్ ప్రమాదంలో పైలట్ ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చేశారు. ఇప్పుడు.. ఇటీల పత్రిక కూడా అదే కోణాన్ని అనుమానిస్తోంది.

మాస్ మర్డర్‌ ఆవకాసం? లీక్స్ ఆధారిత కథనంపై సందేహాలు

కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ద్వారా పైలట్ల మధ్య జరిగిన సంభాషణలు, ఫ్లైట్ డేటా రికార్డర్ ద్వారా స్విచ్‍‌లు ఏ సమయంలో ఆఫ్ అయ్యానే కచ్చితమైన సమాచారం బయటపడుతుంది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్ గత రికార్డులు, ఆయన మానసిక స్థితిపై వైద్య పరీక్షల నివేదికలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇటలీ పత్రిక కథనం కేవలం ఓ లీక్ మాత్రమే. అధికారిక విచారణ పూర్తయ్యే దాకా కెప్టెన్ సుమీత్ సభర్వాల్‌పై ఓ నిర్ణయానికి రాలేం. లీక్స్ ఆధారంగా ఇటలీ పత్రిక రాసిన కథనం నిజమైతే.. ఇదొక ప్రమాదం కాదు, ఓ మాస్ మర్డర్ కిందకు వస్తుంది. వందలాది మంది ప్రణాలను ఫణంగా పెట్టి, పైలట్ ఇలా ఎందుకు చేసి ఉంటాడు? అనేదే.. ఇప్పుడు బిగ్ డౌట్. ఏదేమైనా.. ఇవన్నీ.. ఓ పత్రికలో వచ్చిన కథనంపై రేకెత్తుతున్న సందేహాలు మాత్రమే. అధికారికంగా దర్యాప్తు సంస్థలు ఇంకా ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ థియరీని ధ్రువీకరించలేదు. ఫైనల్ రిపోర్ట్ వస్తే గానీ, ప్రమాదానికి అసలు కారణమేంటో తెలియదు. తుది నివేదికలో ఏం తేల్చబోతున్నారన్నదే.. ఉత్కంఠగా మారింది.

Also Read:శ్రమ నీది.. అండ మాది.. కోవా బన్ వ్యాపారికి సోషల్ మీడియా సెల్యూట్!

Story by: Anup, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×