Amaravati: రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించడానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ఆమోదం కోసం పంపింది. అసెంబ్లీకి హాజరై రాజధానిపై తమ వైఖరి స్పష్టం చేయని వైసీపీ మాత్రం పూటకో మాట, రోజుకో నిర్ణయం అన్నట్లు అమారవతిపై అక్కసు వెల్లగక్కుతూనే ఉంది. ఒకవైపు హసితలో ఇంకా చట్టబద్దత తీర్మానం ప్రోసెస్ మొదలవ్వకుండానే.. అసలు ఆ తీర్మానమే చెల్లదని జగన్ పార్టీ నేతలు స్టేట్‌మెంట్లు ఇస్తుండటం విమర్శలు మూటగట్టుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధానికి చట్టబద్దత అంశం ఢిల్లీకి చేరింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి రాజముద్ర వేసేలా కేంద్రం చట్టం చేయనుంది. ఏపీ అసెంబ్లీ వేదికగా రాజధాని చట్టబద్దత తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు ముఖం చాటేశారు. సదరు కీలక తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమెదించి హుటాహుటిన కేంద్రానికి పంపింది. ఆ తీర్మానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించి, పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఇలాంటి తరుణంలో పార్లమెంట్ వేదికగా జరిగే చర్చలో, రాజధాని అమరావతిపై వైసీపీ ఎలాంటి వైఖరిని అవలంభిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది.
అయితే వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో పాల్గొంటారో? లేదో? కాని.. అమరావతి విషయంలో ఆ పార్టీ నేతలు తలోమాట మాట్లాడుతూ గందరగోళానికి తెరలేపే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసెంబ్లీకి హాజరై పార్టీ స్టాండ్ ఏంటో స్పష్టం చేయాల్సిన మాజీ సీఎం జగన్ అసలు తీర్మానం ఆమోదం పొందినాక కూడా నోరు మెదపడం లేదు. తీర్మానంపై చర్చ మొదలవ్వడానికి ముందే జగన్ బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లిపోయి.. రాష్ట్ర రాజధానిపై తనకెంత చిత్తుశుద్ది ఉందో చెప్పకనే చెప్పారు.
అయితే వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్, జగన్ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి అమరావతికి తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. అయితే ఆ ప్రభుత్వ మాజీ సలహాదారు అమరావతి చట్టబద్దతపై అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. తీర్మానం చేయాలంటే మండలి కూడా సమావేశం కావాలని సూచించారు. అమరావతిలో అవినీతి జరుగుతుందని ఆరోపిస్తే.. తాము రాజధానికి వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు
అనారోగ్యంతో కొంత కాలంగా సైలెంట్ అయిపోయిన శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా రాజధాని ఇష్యూలో స్టేట్‌మెంట్లు మొదలుపెట్టారు. శాసనసభలో కూటమి ప్రభుత్వం చేసిన చట్టబద్దత తీర్మానం పనికిరాదంటున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం లైన్లోకి వచ్చేసి అమరావతిని మారిస్తే తప్పేంటన్న వాదన వినిపిస్తున్నారు. అదేమంటే , మద్రాసు నుంచి కర్నూలుకి అక్కడ నుంచి హైదరాబాద్ కి తరువాత అమరావతికి రాజధాని మారలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆయా సందర్భాల్లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధానులు మారాయన్న లాజిక్ మర్చిపోయినట్లు ..అమరావతి నుంచి మరో ప్రాంతానికి వెళ్లదా? అని సీనియర్ ధర్మాన అడుగుతున్నారు.
శాసనసభలో ఒక రెసుల్యూషన్ పెట్టి రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పి ఢిల్లీకి కాగితం పట్టుకుని వెళ్తున్నారని, రాజధాని ఫెయిల్ అయితే తరువాత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకి రాజధాని ని మార్చే అధికారం లేదా? అని ధర్మాన ప్రశ్నిస్తుండటం హాస్యాస్పదంగా మారింది. ప్రధాని మోడీ రెండు సార్లు శంకుస్థాపన చేసిన అమరావతి ప్రాంతం రాజధానికి పనికి రాదని తేలితే పరిస్థితి ఏంటని పిడివాదం మొదలుపెట్టారు.
అమారావతికి చట్టబద్దత తీర్మానంపై పార్టీ స్టాండ్ చెప్పాల్సిన జగన్ ఆదేశాలతోనే కొంత కాలంగా సైలెంట్ అయిన నేతలు కూడా రాజధానిపై లేనిపోని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతిపై వైసీపీ నేతలు చేస్తు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి నారాయణ మండిపడ్డారు. జగన్ అమరావతిపై విషం కక్కుతునే ఉన్నారని, తాజాగా ఆ పార్టీ నేతలు చేసిన వాఖ్యలే దానికి నిదర్శనమన్నారు. వైసీపీ అధ్యక్షుడు అమరావతి నిర్మాణంలో రివర్ బెడ్ కు, రివర్ బేసిన్ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. సజ్జల మొన్న ఒక మాట మాట్లాడితే, ధర్మాన, బొత్స మరొక మాట మాట్లాడుతున్నారని నారాయణ విమర్శించారు,
వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని, వైసీపీ రెండు నాల్కల ధోరణి కారణంగానే అమరావతికి చట్టబద్ధత కల్పించాలని భూములిచ్చిన రైతులు కోరుతున్నారని నారాయణ స్పష్టం చేశారు. రైతుల కోరిక మేరకు అమరావతి పై సీఎం చంద్రబాబు కేంద్రం తో మాట్లాడారని…అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. ఇప్పుడా తీర్మానం చేసి పంపడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మొత్తమ్మీద సీనియర్ నాయకులైన బొత్స, ధర్మానలు రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలతో అమరావతిపై జగన్ ఎంత వ్యతిరేకంగా స్పష్టమైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి రేపు పార్లమెంటులో కూడా చట్టబద్దతకు ఆమోదం లభిస్తే.. వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read: సిద్దిపేట కాదు.. బోధనే టార్గెట్.. కవిత పొలిటికల్ స్కెచ్ మాములుగా లేదుగా!
Story by: Apparao, Big Tv