Kavitha: రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్వకుంట్ల కవిత పెట్టబోయే కొత్తపార్టీ గురించే చర్చ నడుస్తోంది. భారత రాష్ట్ర సమితితో విభేదాలతో తండ్రి పెట్టిన పార్టీ నుంచి దూరమైన కల్వకుంట్ల కవిత అప్పటి నుంచి దూకుడు పెంచారు. కవిత కొత్త పార్టీ పేరు అనౌన్స్ మెంట్ డేట్ ప్రకటించడంతో జాగృతి కార్యకర్తల్లో, కవిత అభిమానుల్లో కొత్త జోష్ నెలకొంది. రానున్న ఎన్నికల్లో కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న సస్పెన్స్ అందరిలో నెలకొంది. ఆ క్రమంలో బోధన్ కోడలిగా రావడం పూర్వ జన్మ సుకృతం అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అందరిని ఆలోచింప చేసేలా చేస్తున్నాయి. కవిత ఎమ్మెల్యేగా పోటీ చేసేది బోధన్ నుంచే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి సంస్థతో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ప్రజలు ఆదరించడంతో, ఎంపీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సారి టీఆర్ఎస్ నుంచి గెలిచి నిజామాబాద్ ఎంపిగా, ఎమ్మెల్సీగా నిజామాబాద్ కేంద్రంగానే రాజకీయాలు నడిపారు. తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన నిజామాబాద్ జిల్లాలోనే మెట్టినిల్లు బోధన్ ఉండటంతో ఆ జిల్లాను కవిత సొంత జిల్లాగా భావిస్తూ అనుబంధం పెంచుకున్నారు.
నిజామాబాద్ ఎంపీగా 2019 ఎన్నికల్లో రెండో సారి పరాజయం పాలైన కవిత అదే జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. తర్వాత మారిన పరిణామాలతో ఆమె ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై నెలల తరబడి జైలు జీవితం గడిపి బయటకొచ్చారు. ఆ పరిణామాల క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కేసీఆర్ కు సీబీఐ నోటీసులు ఇవ్వడంతో, టి. హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతి కారణంగా తన తండ్రికి చెడ్డ పేరు వచ్చిందని ఆరోపణలు చేసి కలకలం రేపారు. ఆ వ్యాఖ్యలపై స్పందించి బీఆర్ఎస్ పార్టీ ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయగానే, ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, సొంత పార్టీ పై నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల నెల 25న కవిత పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటనతో నిజామాబాద్ జిల్లాలో ఆమె క్యాడర్, లీడర్లు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న చర్చ ఊపందుకుంది. కొత్తగా పెట్టబోయే పార్టీ సంస్థాగతంగా ఎలా ఉండబోతుంది, పార్టీ విధివిధానాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నుంచి ఆమె బరిలోకి దిగుతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే పార్టీ ప్రకటనపై శ్రీరామనవమి రోజున ఆమె మాట్లాడినప్పుడు తన మెట్టినింటి గ్రామమైన పోతంగల్ గ్రామం గురించి ప్రస్తావిస్తూ ప్రత్యేక ప్రేమ కనబర్చారు. దాంతో పోతంగల్ గ్రామం ఉన్న బోధన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధం అయ్యారని జాగృతి శ్రేణులు అంటున్నా
నిజామాబాద్ ఎంపీ గా ఉన్నప్పుడు, తర్వాత ఎమ్మెల్సీ గా కవిత బోధన్ అభివృద్దికి చాలా నిధులు సమకూర్చారంట., ఇక గతం ఎన్నికల్లో బోధన్ నుంచి ఓడిపోయిన, బీఆర్ఎస్ అభ్యర్ధి షకీల్ సమస్యలను పట్టించుకోలేదన్న ఆరోపణులున్నాయి. ఆ వ్యతిరేకత కలిసి వచ్చి మొన్నటి ఎన్నికల్లో మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి కి కలిసి వచ్చి, ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఓటమి తర్వాత షకీల్ అడ్రస్ లేకుండా పోవడంతో బోధన్‌లో బీఆర్ఎస్‌కు పెద్దదిక్కు కరువైన పరిస్థితి. షకీల్ భార్య బీఆర్ఎస్ ఇన్చార్జ్‌గా ఉన్నా స్థానిక గులాబీ క్యాడరే ఆమెపై అసంతృప్తితో ఉందంట.
కవిత ముందు నుంచి బోధన్ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్‌ను వీడాక జాగృతి జనం బాట ద్వారా బోధన్ రైతులు, ప్రజలతో మమేకం అవ్వడానికి ప్రయత్నించారు. ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వయస్సు రీత్యా పోటీలో లేక పోతే .. బీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకతతో పాటు, అది కూడా కవితకు కలిసి వస్తుందని, బోధన్ నుంచి కవిత పోటీ చేస్తే గెలుపు నల్లేరు పై నడకే అవతుందని జాగృతి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బోధన్ నుంచి బరిలోకి దిగితే కవిత కోరుకున్నట్లు చట్టసభల్లో అడుగు పెట్టడం ఖాయమని అంటున్నారు. మరి చూడాలి ఎన్నికల నాటికి కవిత లెక్కలు ఎలా ఉంటాయో?
Also Read:
Story by: Apparao, Big Tv