టీడీపీకి మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్న పల్లె రఘునాథరెడ్డి
మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి టీడీపీలో అత్యంత సీనియర్ నేత. టీడీపీలోని రెడ్డి సామాజిక వర్గం నేతల్లో పార్టీకి లాయల్‌గా ఉంటూ 30 ఏళ్లకు పైగా పార్టీకి తన సేవలు అందిస్తున్నారు. తన కెరీర్‌లో ఎప్పుడూ, ఎక్కడా కూడా వివాదాలకు తావివ్వకుండా సౌమ్యునిగా పేరుతెచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ పిలిచి మరి.. ఆయన కుటుంబ సభ్యురాలికి టికెట్ ఇచ్చిందంటే.. పార్టీకి ఎంత లాయల్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీలో 30 ఏళ్ల ప్రస్థానం ఒకసారి మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ ఇలా అనేక పదవులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పల్లెకు విద్యాసంస్థలు
పల్లె రఘునాథరెడ్డికి ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బందులూ లేవు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆయనకు ఉన్నన్ని విద్యాసంస్థలు వేరే ఎవరికీ లేవంటే అతిశయోక్తి కాదు. అలాంటి నాయకుడికి మాజీగా మిగిలిపోయాక ఇటీవల వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. గత ఎన్నికల్లో పల్లె పోటీ చేయాలని భావించినప్పటికీ, టీడీపీ అధిష్టానం ఆయన్ని కాదని కోడలికి టికెట్ ఇచ్చింది. పల్లె రఘునాథ రెడ్డి కోడలు పల్లె సింధూర రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమె కూడా నియోజకర్గంలో చాలా యాక్టివ్‌గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఆ క్రమంలో గత కొంత కాలంగా పల్లెపై వరుస ఆరోపణలు, వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఆయన పై భూకబ్జా ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తుండటం చర్చల్లో నలుగుతోంది.
అనంతపురం జిల్లాలో భారీగా పెరిగిన భూముల ధరలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల భూముల విలువలు భారీగా పెరిగాయి. అందులోనూ పెనుగొండ నియోజకవర్గం కియా పరిశ్రమ సమీపంలో భూముల విలువ కోట్ల రూపాయలకు చేరడంతో అనేక మంది భూములు కొనుగోలు చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా కొంతమంది భాగస్వాములతో కలిసి కియా పరిశ్రమ సమీపంలో సుమారు 250 ఎకరాలకు పైగా కొనుగోలు చేశారు. ఇప్పుడా భూముల వ్యవహారం పల్లె మెడకు చుట్టుకుంటుంది.
సీబీఐ, ఈడీలకు ఫిర్యాదుతో రచ్చకెక్కిన వివాదం
మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బీసీల భూమి కబ్జా చేశారంటూ ధర్మవరం ప్రాంతానికి చెందిన బీజేపీ నేత ఎంపీపీ ఆదినారాయణయాదవ్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేవలం ఆరోపణలు మాత్రమే కాక అనంతపురం నగరంలోని యాదవ కళ్యాణ మండపంలో బీసీ, ఎస్సీ , ఎస్టీ సంఘాల పేరుతో పల్లె రఘునాథ్ రెడ్డి భూకబ్జాలపై చర్చ వేదిక అంటూ ఫ్లెక్సీ పెట్టించడం పెద్ద రచ్చకు దారి తీసింది. వాస్తవానికి పల్లె రఘునాథ్ రెడ్డి, ఆది నారాయణ యాదవ్‌ల మధ్య గత సంవత్సర కాలంగా భూ వివాదం నడుస్తోంది.
భూకబ్జాలపై చర్చా వేదిక అంటూ అనంతపురంలో ఫ్లెక్సీలు
అయితే ఇది ఇన్నాళ్లు కేవలం సత్యసాయి జిల్లా పుట్టపర్తి, పెనుగొండ ప్రాంతాల్లో అంతర్గతంగా నడిచింది. అయితే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై ఆదినారాయణ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం, ఆపై సీబీఐ, ఈడీలకు కూడా ఫిర్యాదు చేయడంతో అది రచ్చ కెక్కింది. కియా పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు వరకు వెళ్లడంతో ఆ వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ తర్వాత ఇరువురు కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్నారు. కానీ మొదటి సారి అనంతపురం జిల్లాకు ఈ రచ్చ చేరుకోవడంతో హాట్ టాపిక్ అయింది.
ఆదినారాయణ యాదవ్ పై రగిలిపోతున్న విష్ణువర్ధన్ రెడ్డి
ఇద్దరి నేతల మధ్య ఉన్న వివాదం కాస్తా రెండు పార్టీల మధ్య వివాదంగా మారింది. కూటమి నేతల మధ్య విబేధాలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పల్లె కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలో బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్‌రెడ్డి కూడా భాగస్వామి. ప్రస్తుత వివాదంతో యాదవ్‌పై విష్ణువర్ధన్‌రెడ్డి కూడా గుర్రుగా ఉన్నారంట. అయితే ఆదినారాయణ యాదవ్ జిల్లాకు చెందిన బీజేపీ మంత్రి సత్యకుమార్‌యాదవ్ అనుచరుడు కావడంతో విష్ణు సైలెంట్ గా ఉండాల్సి వస్తోందంట. అయితే లోలోపల విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఆదినారాయణ యాదవ్ పై రగిలిపోతున్నారని సమయం కొరకు వేచిచూస్తున్నాంటున్నారు.
బీసీల భూమి కబ్జా చేశారని ఆరోపిస్తున్న బీజేపీ నేత యాదవ్
ఇటీవల అనంతపురంలో బీసీ సంఘాల అధ్వర్యంలో పల్లె భూకబ్జాలపై చర్చ అంటూ యాదవ్ సమావేశం పెట్టడం.. దానిని పల్లె అనుచరులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో రెండు వర్గాలు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగాయి. చివరికి చెప్పులతో దాడి చేసుకొనే వరకు రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. రెండు వర్గాలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఆ ల్యాండ్ వివాదంపై పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని కావాలని తన పేరు వాడుకుని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నానని ఖండించారు.
భూకబ్జాలపై చర్చా వేదిక అంటూ అనంతపురంలో ఫ్లెక్సీలు
ఇప్పటికైనా రెండు పార్టీల పెద్దలు మేల్కొని ఇద్దరు వ్యక్తులు మధ్య గొడవ కాస్తా రెండు పార్టీల మధ్య గొడవలా మారకముందే దాన్ని కంట్రోల్ చేయాలని టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కోరుతున్నారు. చూడాలి మరి రెండు పార్టీల అధిష్టానాలు ఏం చేస్తాయో? ఆ భూ వివాదానికి ఎలా తెరపడుతుందో?
-Story By Apparao, Bigtv Live