E-Paper
Advertisement

CM Chandrababu: స్వర్ణాంధ్ర సాకారం దిశగా అడుగులు.. రూ. 3.32 లక్షల కోట్ల బడ్జెట్.. పారిశ్రామిక విప్లవానికి పాలసీ 4.0!

CM Chandrababu: స్వర్ణాంధ్ర సాకారం దిశగా అడుగులు.. రూ. 3.32 లక్షల కోట్ల బడ్జెట్.. పారిశ్రామిక విప్లవానికి పాలసీ 4.0!

ఫిబ్రవరి 11 కీలక నిర్ణయాలు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామిక ప్రోత్సాహం దిశగా.. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మొత్తం 24 అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద.. రాష్ట్రంలోని పేదలకు ఆర్థిక సాయం చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఒక్కో ఇంటికి 2 లక్షల 39 వేలు ఇవ్వనున్నారు. ఇక.. ఇరిగేషన్ శాఖలో 7 వేలకు పైగా నిర్వహణ పనులకు ఆమోదం తెలిపారు. భూముల బదిలీకి సంబంధించి చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పుటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

గాజువాకలో వెయ్యి చదరపు గజాల వరకు ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును ఆరు నెలలు, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును జూన్ వరకు పెంచారు. గన్నవరంలో కస్టమ్స్ శాఖ భూమికి సంబంధించి గతంలో ఇచ్చిన జీఓలో కేబినెట్ మార్పులు చేసింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 45 ఎకరాలు బయోగ్యాస్ ప్లాంట్‌కు కేటాయించారు. నంద్యాల జిల్లా సంజామలలో 1,500 ఎకరాలు సౌర విద్యుత్ ప్రాజెక్టుకు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. తిరుపతిలో డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రామాయపట్నం పోర్టు అభివృద్ధికి కంఫర్ట్ లెటర్ జారీకి అనుమతి ఇచ్చింది. ఓటర్ల జాబితా ప్రచురణకు ఏటా నాలుగు అర్హత తేదీలు కల్పించే సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఫిబ్రవరి 10 ఏపీకి సహకరించండి

ఢిల్లీ టూర్‌లో భాగంగా.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో.. సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత వ్యవహారంపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని కేంద్రం నిర్ణయించిన క్రమంలో.. దానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ రెండో దశ సమావేశాల్లో బిల్లు పెట్టాలని అమిత్‌షాను సీఎం కోరినట్లు సమాచారం. అదేవిధంగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టులకు అనుమతుల అంశాలపై ఆమెతో చర్చించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తోనూ సీఎం భేటీ అయ్యారు.

అభివృద్ధి చర్యలపై చర్చ

ఏపీలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సేంద్రీయ సాగుపై ప్రత్యేక దృష్టి సారించామని, రసాయన ఎరువుల వాడకం తగ్గించినందున పీఎం-ప్రణామ్ ప్రొత్సాహకాలను ఇవ్వాలని కోరారు. కొబ్బరి సాగు అభివృద్ధికి 200 కోట్ల మేర సాయం చేయాలని, కోకోనట్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు, కర్ణాటక తరహాలో మోడ్రన్ టెండర్ కోకోనట్ మార్కెట్ల ఏర్పాటు, కొబ్బరి రైతులకు ఆధునాతన పద్ధతులపై ట్రైనింగ్, నర్సరీల విస్తరణకు సహకరించాలని కోరారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం పెండింగ్‌లో ఉన్న 695 కోట్లు విడుదల చేయాలని, ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టం కింద తోతాపూరి మామిడికి కేంద్ర వాటాగా ఇవ్వాల్సిన 100 కోట్ల సాయాన్ని విడుదల చేయాలని కోరారు. ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని, కొల్లేరు సరస్సు ప్రాంతంలో 50 వేల ఎకరాల్లో మఖానా సాగుకు అనుకూల వాతావరణం ఉన్నందున ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు.

రైల్వే శాఖ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని కూడా సీఎం చంద్రబాబు ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలని, కొత్త రైలు మార్గాలు, సర్వీసులు నడపాలని వినతి పత్రం సమర్పించారు. ఏపీని టచ్ చేస్తూ వెళ్లే మూడు హై స్పీడ్ రైల్ కారిడార్లని బడ్జెట్‌లో ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బెంగళూరు-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్.. తిరుపతిని కనెక్ట్ చేసేలా చూడాలన్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచే ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఉత్తర, దక్షిణ భారత్‌ని కలిపేలా.. ఇటార్సీ-విజయవాడ మధ్య ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించాలన్నారు. విశాఖ-విజయవాడల మధ్య హైస్పీడ్, విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్, తిరుపతి-చిత్తూరు మధ్య హైస్పీడ్ లింక్ కారిడార్ మంజూరు చేయాలన్నారు. హైదరాబాద్-శ్రీశైలం కొత్త రైల్వే లైన్ ద్వారా శ్రీశైల పుణ్యక్షేత్రానికి కనెక్టివిటీని పెంచాలన్నారు సీఎం చంద్రబాబు. తిరుపతి మీదుగా విజయవాడ-బెంగుళూరు మధ్య వందే భారత్ సర్వీస్ నడపాలన్నారు. వివిధ ఎక్స్ ప్రెస్ రైళ్లకు కుప్పంలో స్టాపింగ్ ఇవ్వటంతో పాటు రైలు బోగీ నిర్వహణ టెర్మినల్ ఏర్పాటు చేయాలన్నారు.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సీఎం భేటీ

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ని కూడా సీఎం కలిశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను, వేస్ట్ మేనేజ్మెంట్, జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్‌గా ఏపీని తీర్చిదిద్దేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద 276 కోట్ల ఖర్చుతో జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్‌కు కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్-2.0లో భాగంగా కేంద్ర వాటా కింద 105 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా.. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామితో.. సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. కేంద్రం అందించిన ఆర్థికసాయం, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు, స్టీల్ ప్లాంట్ కార్మికులు-ఉద్యోగుల పట్టుదల, శ్రమ కారణంగా.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టిందని కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు.

కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం, అంతర్రాష్ట్ర వివాదాలు, పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు, వాటి పరిష్కారంపైనా సవివరంగా చర్చించారు. ముఖ్యంగా.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్‌మెంట్ చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్–IIకి ఆర్థిక సహాయం అందించాలని, భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉన్నందున.. సుమారు 3200 కోట్ల నిధులు అవసరమవుతాయన్నారు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ ఫైనల్ రిపోర్టుని గెజెట్‌లో ప్రచురించాలన్నారు. నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు నిలుపుదల చేయాలన్నారు సీఎం చంద్రబాబు.

ఫిబ్రవరి 9 ఏపీకి యాక్షన్ ప్లాన్

ఈ వారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఏపీలో జనాభా నిర్వహణ, సంజీవని ప్రాజెక్టు, పౌష్టికాహారంతో పాటు వివిధ అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. మార్చి నాటికి పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకొస్తామని తెలిపారు. ప్రధానంగా జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర-2047 విజన్‌ లక్ష్యాల్లో భాగంగా పది సూత్రాల అమలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌పై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపైనా చర్చించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్సులో భాగంగా అవేర్‌, డేటా లేక్‌ సహా పాలనలో ఏఐ టూల్స్‌ ఇతర టెక్నాలజీ వినియోగంపైనా సీఎం దిశానిర్దేశం చేశారు. యువతకు స్కిల్ డెవలప్‌మెంట్, వన్‌ ఫ్యామిలీ వన్‌ ఎంట్రప్రెన్యూర్‌ విధానం అమలు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సహా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై రివ్యూ చేశారు. రాబోయే కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్, చేరుకోవాల్సిన లక్ష్యాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. సంజీవని ద్వారా జులై నాటికి 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్, 5 లక్షల మంది హాస్టల్ విద్యార్థుల స్ర్కీనింగ్ పూర్తి చేయాలన్నారు. 12వ తరగతి వరకు ఉన్న 70 లక్షల మంది విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్స్ తయారుచేయాలన్నారు. ఫ్యామిలీ కార్డు బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా జూన్ నాటికి సమగ్రమైన కార్డు జారీ చేయాలన్నారు సీఎం.

ఫిబ్రవరి 15 గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం!

నీట్, ఐఐటీల్లో సీట్లు సాధించేలా గురుకులాల్లో ఎస్టీ విద్యార్థులకు శిక్షణ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

ఫిబ్రవరి 14 భారీ కేటాయింపులు

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. ఏపీ ప్రభుత్వం ఈసారి 3 లక్షల 32 వేల కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు భారీగా కేటాయింపులు చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టగా, మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ లోటును 22 వేల కోట్లకే పరిమితం చేస్తామని తెలిపారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. ద్రవ్యలోటు 75 వేల 868 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. పేదలకు నేరుగా వేల కోట్ల నిధులిస్తున్న సంక్షేమ పథకాలకు ఈ బడ్జెట్లో పెద్ద పీట వేశారు. సామాజిక పింఛన్లకు పెద్ద మొత్తంలో నిధులిచ్చారు. మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి గణనీయమైన కేటాయింపులు చూపారు.

సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు ప్రాధాన్యమిచ్చారు. మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కేంద్ర సహకారం తీసుకుంటామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుందో తెలిపేలా బడ్జెట్‌లో వివరించారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి చేనేతే కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. వంద కోట్లతో ఏపీ సంపద నిధి ఏర్పాటు చేయనున్నారు. ఇక.. దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది ప్రభుత్వం. సూపర్‌ సిక్స్‌ పేరిట అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేయాలనే లక్ష్యంతో 6 వేల కోట్లకు పైగా కేటాయించారు. పేదల కోసం ఆరు లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. కొత్తగా 100 కోర్టులకు ఆమోదం తెలియజేశారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

ఫిబ్రవరి 14 పెట్టుబడులకు పాలసీ 4.0

కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు పాలసీ 4.0 విధానాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉపాధి అవకాశాలు కల్పన, ఎగుమతుల పెంపుకోసం సుస్థిర పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆగ్రో ప్రాసెసింగ్, ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఈవీలు, హెల్త్, ఐటీ రంగాలను గుర్తించింది. విశాఖ-చెన్నై కారిడార్‌ అభివృద్ధి చేయడం, ప్లగ్‌ అండ్‌ ప్లే క్లస్టర్లను కల్పించడంపై దృష్టిపెట్టింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్మార్ట్‌ ఇండస్ట్రియల్‌ పార్కుల అభివృద్ధి, క్లీన్‌ ఎనర్జీని ప్రోత్సహించేలా కార్యాచరణ చేపట్టింది. నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ భాగస్వామ్యంతో.. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు , హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. గత 20 నెలల్లో 8 లక్షల 74 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు గ్రౌండింగ్‌ అయ్యాయి. మరో 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి.

ఫిబ్రవరి 12 ఉత్తరాంధ్రకు రేర్ ఎర్త్ కారిడార్

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన రేర్ ఎర్త్ కారిడార్ సహా వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశంపై సీఎం చంద్రబాబు ఈ వారం అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ కార్యక్రమాలను లింక్ చేసుకుంటూ అదనపు నిధులు సాధించాలని సూచించారు. కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్‌ను శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. మెగా టెక్స్‌టైల్ పార్కును పలనాడు ప్రాంతంలోనూ, స్పోర్ట్ మాన్యుఫాక్చరింగ్ హబ్ తిరుపతిలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0లో భాగంగా సెమీ కండక్టర్ డిజైన్ తదితర ప్రాజెక్టులను అమరావతిలో ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. వీటితో పాటు రాజధాని ప్రాంతంలోని హెల్త్ సిటీలో బయోడిజైన్, మెడ్ టెక్ పార్క్, బయో ఫార్మా శక్తి మిషన్ లాంటి ఎకోసిస్టం వస్తుందన్నారు. మెడికల్ టూరిజం- హీల్ ఇన్ ఏపీ అన్న విధానంలో అమరావతిలో ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. హిందుపురంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీని ప్రతిపాదించాలన్నారు. తిరుపతిని టూరిజం డెస్టినేషన్ కింద అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను సద్వినియోగం చేసుకుని మరిన్ని ఈ-బస్సులను సాధించేలా ప్రణాళిక చేయాలన్నారు.

Story by: Anup, Big Tv

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×