E-Paper
Advertisement

TTD Reforms: ఇకపై టీటీడీలో పొలిటికల్ ఆటలు సాగవు… కూటమి సర్కార్ ప్లాన్ ఇదే..!

TTD Reforms: ఇకపై టీటీడీలో పొలిటికల్ ఆటలు సాగవు… కూటమి సర్కార్ ప్లాన్ ఇదే..!
Advertisement

TTD Reforms: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన పుణ్యక్షేత్రం తిరుమలలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఇప్పటికే తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తలెత్తిన వివాదం, భక్తుల మనోభవాలు దెబ్బతిన్న క్రమంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. టీటీడీ పాలనా వ్యవస్థలోనూ, నిబంధనల్లోనూ సమూల మార్పులు చేయబోతోంది. అపవిత్రతకు ఏమాత్రం తావులేకుండా, రాజకీయ జోక్యం లేకుండా.. శ్రీనివాసుడి సన్నిధిని ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కొనసాగించేలా, సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయ్.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహా చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ చట్టం ద్వారా తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వర్ణ దేవాలయం చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, టీటీడీ నిబంధనలని కూడా మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్యమతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది.

గోల్డెన్ టెంపుల్ చట్టంపై ప్రభుత్వ దృష్టి

Advertisement

ప్రస్తుతం టీటీడీ వ్యవహారాలన్నీ 1987 నాటి ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థల చట్టం పరిధిలో కొనసాగుతున్నాయి. అయితే, అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ నిర్వహణ కోసం ఉన్న స్వయంప్రతిపత్తి కలిగిన చట్టాన్ని ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. టీటీడీని ప్రభుత్వ విభాగంగా కాకుండా, పూర్తి స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థగా మార్చేందుకు అడుగులు పడుతున్నాయ్. దేవాలయ నిధులు, ఆస్తులు, పాలనా నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి, హిందూ ధర్మంపై అవగాహన ఉన్న ప్రముఖులకే పగ్గాలు అప్పగించే ఆలోచన చేస్తున్నారు. ఇక.. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిన వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది. దాంతో.. కల్తీకి అడ్డుకట్ట వేసేలా నెయ్యితో పాటు ఇతర ముడి పదార్థాల సేకరణలో ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయబోతోంది.

తిరుమల కొండపై అత్యాధునిక ఫుడ్ ల్యాబ్

తిరుమల కొండపైనే అత్యాధునిక సౌకర్యాలతో ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు చేసే ఆలోచనతో ఉంది ప్రభుత్వం. భక్తులకు సురక్షితమైన, నాణ్యత కలిగిన ప్రసాదాలు, ఆహారాన్ని అందించేందుకు, ముడి పదార్థాలను పరిశీలించేందుకు వీలుగా ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 25 కోట్లు మంజూరు చేసింది. అత్యాధునిక పరికరాలు, యంత్రాలతో సిద్ధం చేస్తున్న ఈ ల్యాబ్‌ మార్చిలో అందుబాటులోకి వస్తుంది. స్వామి వారి ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యితో పాటు అన్ని రకాల ముడిసరుకులు, ప్రసాదాల నాణ్యతను ఇందులోనే పరీక్షిస్తారు. ఇప్పటికే ల్యాబ్‌ ఏర్పాటు పనులు 90 శాతం దాకా పూర్తయ్యాయ్. ఆహార పదార్థాలు, ప్రసాదాల్లో 200 రకాల పురుగు మందుల అవశేషాలను గుర్తించే సామర్థ్యం కలిగిన యంత్రాలు ఈ ల్యాబ్‌లో ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్వహణపై.. త్వరలోనే వైద్య ఆరోగ్యసాఖ, టీటీడీ మధ్య ఒప్పందం కుదరనుంది.

దర్శన సమయాలపై కఠిన నియంత్రణ

Advertisement

తిరుమల పవిత్రతను కాపాడే క్రమంలో.. సిబ్బంది విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడం, వీఆర్ఎస్ కల్పించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఇక.. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై వేటు వేసేందుకు కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. శ్రీవారి సన్నిధిలో రాజకీయ అంశాలు మాట్లాడటంపైనా ఇప్పటికే నిషేధం విధించారు. కొండపై రాజకీయ విమర్శలు చేయడం, పార్టీల గురించి మాట్లాడటం చేస్తే చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. దర్శనం కోసం వచ్చే ప్రముఖుల ప్రోటోకాల్ విషయంలోనూ మార్పులు చేసి, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండే అవస్థలు తప్పించేందుకు.. ఏఐ టెక్నాలజీని వాడుకోవడంపై ఇప్పటికే దృష్టి పెట్టారు. దర్శనం సమయాన్ని కచ్చితంగా అంచనా వేయడం, క్యూ లైన్లలో రద్దీని కంట్రోల్ చేసేందుకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వాడుతున్నారు. దర్శన టికెట్ల జారీలోనూ.. దళారీ వ్యవస్థని పూర్తిగా అరికట్టే ఉద్దేశంతో ఉంది కూటమి ప్రభుత్వం.

తిరుమల కొండ పూర్వ వైభవం

తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు.. భారీ ప్రక్షాళనని సూచిస్తున్నాయ్. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం తరహాలో స్వయంప్రతిపత్తి కలిగిన, అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకురావాలనే ఆలోచన భక్తుల్లోనూ సానుకూలమైన ఆశలను రేకెత్తిస్తోంది. స్వర్ణ దేవాలయం తరహా చట్టం అమలులోకి వస్తే తిరుమల కొండపై సమూల మార్పులు కనిపిస్తాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా.. తిరుమల కొండకు పూర్వ వైభవం వస్తుందంటున్నారు. తిరుమల కేవలం ఓ ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు. కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్. ఎంతో మంది భక్తుల నమ్మకం. కొంతకాలంగా తిరుమల చుట్టూ నడుస్తున్న వివాదాలు.. తిరుమల ప్రతిష్ఠని మసకబార్చడమే కాదు, లడ్డూ ప్రసాదంపై భక్తుల విశ్వసనీయతని కూడా దెబ్బతీస్తోందనే వాదనలు వినిపించాయ్. దాంతో.. ఏపీ ప్రభుత్వం తిరుమల క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా, ఎలాంటి రాజకీయ జోక్యం లేని వ్యవస్థగా మార్చాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే.. గోల్డెన్ టెంపుల్ తరహా చట్టాన్ని తీసుకురావాలనే ఆలోచనతో ఉంది.

భక్తుల ద్యారా ఎన్నుకోబడిన ప్రతినిధులే..

అమృత్‌సర్‍‌‌లోని స్వర్ణ దేవాలయాన్ని నిర్వహించే శిరోమణి గురుద్వారా ప్రబంధనక్ కమిటీ.. 1925 సిక్కు గురుద్వారాల చట్టం ద్వారా నడుస్తుంది. దీని ప్రకారం.. గోల్డెన్ టెంపుల్ పూర్తి స్వయంప్రతిపత్తితో ఉంటుంది. ప్రభుత్వం గానీ, రాజకీయ నాయకుల ప్రమేయం గానీ ఉండదు. భక్తుల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధులే ఆలయ నిర్వహణని చూస్తారు. దేవాలయం లోపల ఏ విధమైన లౌకిక, రాజకీయ కార్యకలాపాలకు తావు ఉండదు. మతపరమైన నిబద్ధత మాత్రమే కనిపిస్తుంది. అక్కడ సేవకు ప్రాధాన్యత ఉంటుంది. స్వర్ణ దేవాలయంలో పనిచేసేవారు ఉద్యోగులుగా కాకుండా.. సేవకులుగా భావిస్తారు. ఇదే తరహా చట్టం.. తిరుమల కోసం తీసుకొస్తే.. కొండపై మనం సమూల మార్పులు వచ్చే అవకాశముంది.

నిధుల వినియోగంపై కఠిన నిబంధనలు

ప్రస్తుతం.. టీటీడీ బోర్డు సభ్యుల నియామకం రాజకీయ ప్రాతిపదికన జరుగుతోంది. కొత్త చట్టం వస్తే, కేవలం ఆధ్యాత్మిక వేత్తలు, ఆగమ శాస్త్ర పండితులు, నిజమైన భక్తులకు మాత్రమే బోర్డులో చోటు దక్కుతుంది. నిధుల వినియోగంపైనా కఠిన నిబంధనలుంటాయ్. శ్రీవారి హుండీ ఆధాయాన్ని కేవలం హిందూ ధర్మ ప్రచారం, భక్తుల సౌకర్యాలు, దేవాలయ నిర్వహణకు మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇతర ప్రయోజనాల కోసం ఒక్క రూపాయి కూడా మళ్లించడానికి వీలుండదు. వీటికి మించి.. అత్యున్నత స్థాయి భద్రత, క్రమశిక్షణ కనిపిస్తాయి. స్వర్ణ దేవాలయంలో ఏ చిన్న తప్పు జరిగినా.. శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. తిరుమలలోనూ భక్తులకు అసౌకర్యం కలిగించినా, అవినీతికి పాల్పడినా తక్షణమే కఠిన చర్యలు తీసుకునే యంత్రాంగం అమల్లోకి వస్తుంది. క్రిమనల్ చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్.

స్వర్ణ దేవాలయం మోడల్.. పారదర్శకతకు కొత్త ప్రమాణం

స్వర్ణ దేవాలయం మోడల్‌లో జవాబుదారీతనం అత్యంత కీలకం. తిరుమలలోనూ ఏఐ ఆధారిత నిఘా, డిజిటల్ ట్రాకింగ్ ద్వారా ప్రతి సేవని పర్యవేక్షిస్తారు. లడ్డూ నాణ్యత నుంచి హుండీ లెక్కింపు దాకా అంతా పారదర్శకంగా మారుతుంది. భక్తులతో అసభ్యంగా ప్రవర్తించే సిబ్బందిపై వేటు వేయడమే కాదు, వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోని విధంగా రూల్స్ ఉంటాయ్. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారు సామాన్యులైనా, వీఐపీలైనా.. చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తిరుమల కొండపై పరిపాలనలో మార్పులు వస్తే.. అది నేరుగా భక్తులకు కలిగే ఆధ్యాత్మిక అనుభూతిపై ప్రభావం చూపుతుంది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే అవస్థలు తగ్గి, ప్రశాంతమైన దర్శనం లభిస్తుంది. కొండపై సామాన్య భక్తుడిని దోచుకునే దళారీ వ్యవస్థ పూర్తిగా అంతమవుతుంది. తిరుమల గిరుల్లో.. గోవింద నామస్మరణ తప్ప.. ఇతర చర్చలు, అనవసర హడావుడి కనిపించని విధంగా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణమే ఏర్పడుతుంది. భక్తులు కూడా కేవలం భక్తి మార్గంలోనే ఈ వ్యవస్థ నడవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఈ మార్పులు.. కొండపై అమలులోకి వస్తే.. తిరుమల మళ్లీ కలియుగ వైకుంఠంగా పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది.

Also Read: కేసీఆర్ స్కెచ్.. బాజిరెడ్డి షాక్! బాన్సువాడ వెళ్ళనంటున్న గులాబీ సీనియర్.. అసలు ప్లాన్ ఇదేనా?

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×