AP Districts Reorganization: జిల్లాల పునర్విభజన కూటమి ప్రభుత్వంలో కాకరేపుతోంది.. పునర్విభజనలో జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి సైడ్ అయి మార్కాపురం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. ప్రతిపక్ష పార్టీకి అది అస్త్రంగా మారనుందా? … కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటి నేతల స్పందన ఎలా ఉంది? … మంత్రి రామప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎందుకంత ఎమెషనల్ అయ్యారు? అపలెప్రజల మనోభావాలకు అనుగుణంగా సర్కార్ అడుగులు వేసిందా?….చంద్రబాబు మనుసులో ఏముంది?
జిల్లా పునర్విభజన వ్యవహారం ఒకరికి వరంగా మారితే.. అదే మరొకరికి శోకానికి కారణమైంది. ఒకే పార్టీకి చెందిన రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిలకు ఆ అనుభవం ఎదురైంది. వరం దక్కిన నారాయణ రెడ్డికంట ఆనంద బాష్పాలు వస్తే .. తీవ్ర నిరాశకు గురైన రామప్రసాద్‌రెడ్డి కన్నీరు కట్టలు తెంచుకుంది. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారింది.
విధి విచిత్రమైంది.. తాము ఒకటి తలిస్తే దైవం మరోటి తలచినట్లు.. రాష్ట్రంలో ఆ ఇద్దరి నేతల పరిస్థితి తయారైందంట. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ఆ ఇద్దరి నేతల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. అనుకున్నది దక్కిందని ఎమ్మెల్యే కంట ఆనందంతో కంట ఆనంద బాష్పాలు వస్తే… అనుకున్నది దక్కక పోవటంతో మంత్రి కంట ఆవేదన పూరిత కన్నీరు ఉబికి వచ్చింది…
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం భిన్నత్వంలో ఏకత్వం కనిపించే ప్రాంతం. విద్యా, వైద్య, ఉపాధి, వ్యాపార, వాణిజ్య, అవకాశాలకి అక్కడ కొదువ లేదు. ఒంగోలు తర్వాత ప్రకాశం జిల్లాలో మార్కాపురమే చాలా మందికి సుపరిచితం. దీంతో మార్కాపురంను జిల్లా చేయాలని అక్కడి ప్రజలు, పార్టీల నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. ఆ సమయంలో మార్కాపురంను జిల్లాగా చేస్తారు అనే టాక్ వచ్చింది. కానీ అది జరగలేదు.. దీంతో ఇక్కడి పార్టీ నేతలు, ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు
2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభనపై దృష్టి పెట్టింది… దాంతో ఈ సారి మార్కాపురం జిల్లాగా మారడంతో అక్కడి ప్రజల ఆనందం అంబరాన్ని తాకుతోంది… ఇక మార్కాపురంను జిల్లాగా చేయాలి అనే చిరకాల కోరికతో వున్న స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కల కూడా నెరవేరింది…. ఆయన భావోద్వేగంతో కన్నీరు కార్చారు. ఆ నేత నుంచి వచ్చిన కన్నీరు బాధతో వచ్చినవి కావు…అవి ఆనంద భాగాలుగా ఉబికి వచ్చాయి…
మార్కాపురం జిల్లాగా మారిన ఆనందంలో కందుల నారాయణ రెడ్డి ఉండగా.. అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా వున్న రాయచోటి ఏ జిల్లాకు కేంద్రం కాకుండా పోయింది. రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచాలని స్థానికులు, వైసీపీ నేతలు గట్టిగా డిమాండ్ చేశారు. ఆందోళనలు కూడా నిర్వహించారు. ఇక రాయచోటి ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించేలా చివరి క్షణం వరకు విశ్వ ప్రయత్నం చేశారు. అయినా ప్రభుత్వం తన నిర్ణయం మేరకే అడుగులు వేసింది. దీంతో ఆయన ఆవేదన, ఆందోళనకు గురయ్యారు. ఆ క్రమంలో రాంప్రసాద్ రెడ్డి కంట నీరు పెట్టారు. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వేదనతో కన్నీరు తుడుచుకుంటూ వెళ్లి పోయారు. కనీసం మీడియాతో కూడా మాట్లాడటానికి కూడా ఆయన ఇష్టడలేదు.
ఏపీలో జిల్లాల పునర్విభజన వ్యవహారం ఇప్పుడు కూటమికి తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తోందని కొందరు అంటున్నారు. జిల్లా కేంద్రాలు మార్చటంపై ఓ వైపు వైసీపీ భగ్గుమంటోంది.. టీడీపీలోని కీలక నేతలే జిల్లాల పునర్విభజనపై ఆవేదనతో వున్నారు. ఇది ప్రతి పక్ష పార్టీలకు ఆయుధంగా మారుతుందా అనే సందేహం ఇప్పుడు తలెత్తుతోంది. ముఖ్యంగా రాయచోటికి అన్యాయం జరిగిందనే వాదన వుంది. అయితే రాయచోటిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పాటు ఇతర ప్రాధాన్యతలు ఇస్తామని సీఎం చంద్రబాబు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి హామీ ఇచ్చారు… ఈ హామీతో మంత్రి సంతృప్తి చెందారా అనేది అనుమానమే…
సీఎం చంద్రబాబుతో మంత్రిరాంప్రసాద్ రెడ్డి అమరావతిలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాయచోటిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మండిపల్లికి సీఎం హామీ ఇచ్చారు. రాయచోటి అభివృద్ధిలో భాగంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. రాయచోటిని అగ్రగామిగా నిలిపేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారంట. రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం కాదు అంటే చాలా బాధపడ్డానని మంత్రి చెప్పుకొచ్చారు. జరిగిన పొరపాటు, గ్రహపాటుకు తాను కూడా బాధ్యడినే అంటూ రాయచోటి ప్రజలకు క్షమాపణ చెప్పారు. మంత్రి పదవి తన ఆశ కాదని.. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షే ముఖ్యమని వ్యాఖ్యానించారు… ఏదైమైనా ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ శ్రేణులు అప్పుడే రంగంలోకి దిగిపోయాయి.
అయితే ముందస్తు ఆలోచన లేకుండా సీఎం చంద్రబాబు ఏమి చేయరని, ఆయన ఓ నిర్ణయం తీసుకుంటే దాని వెనుక పెద్ద ప్రణాళిక ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు… ఏది ఏమైనా జిల్లాల పునర్ విభజన నేపథ్యంలో రగిలిన చిచ్చు చంద్రబాబు ఎలా ఆర్పుతారో చూడాలి మరి.
Story By: Ajay, Big Tv