ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ.. ఉపాధ్యాయ నియామకంలో జరిగిన అవకతవకలపై బీగ్ టీవీ కథనాలు ఏపీ రాజకీయాలకు కుదిపేశాయి. ఉన్నదున్నట్టుగా.. వాస్తవాలను వెలికి తీసే క్రమంలో జరిగిన ఇన్వెస్టిగేషన్ జర్నలిజానికి అంతటా నీరాజనాలు పలుకుతుంటే.. ఏపీ మాత్రం మెటాకు నోటీసులిచ్చింది. బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌ను నిలిపివేసింది.
చేతిలో అధికారం ఉంది కదా అని.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపినట్టు.. వాస్తవాలను వెలికితీసి, బాధితులకు అండగా నిలిచిన వైనం తమ పాలనకే మచ్చ అని భావించినట్టున్నారు పాలకులు. ఇది ప్రతిపక్షానికి అస్త్రంగా మారుతుందనే భయమే కానీ, బాధితుల పక్షం మాత్రం వహించేందుకు సిద్ధంగా లేదు.
పైగా ఏ మీడియా తీసుకోని ఓ డేర్ స్టెప్‌తో బాధితుల పక్షాన నిలిచి పోరాడుతున్న బిగ్‌టీవీపై ప్రతాపం చూపి, ప్రపంచానికి ఆ నిజాలు తెలయకుండా చేయాలనే భ్రమలో .. మీడియా స్వేచ్చను కాలరాసేందుకు కూడా వెనుకాడలేదు ఏపీ ప్రభుత్వం. లక్షల ఫాలోవర్స్ ఉన్న బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌ను నిలిపేయడానికి తగిన కారణాలు లేవు. కానీ చట్టబద్ద సూచన అనే సాకు వెతుక్కున్నారు.
ఇచ్చిన కథనాలు, ప్రసారమైన వార్తలు.. అన్నీ జర్నలిజం నిబంధనలకు లోబడే ఉన్నాయి. ఇది నిఖార్సైన జర్నలిజానికి ఓ మచ్చు తునక. కానీ తమ మచ్చలు బయటపడతాయనే భయంతో టీవీ మీద ముసుగేస్తే చాలనే నిప్పుకోడి బాపతు తెలివిని ప్రదర్శించి .. చవకబారు ఎత్తుగడను ప్రయోగించింది ఏపీ సర్కార్. ఈ మధ్యకాలంలో ఏ మీడియా కూడా ఉన్నదున్నట్టుగా..అదీ అధికార పార్టీకి ఎదురు నిలిచి వాస్తవాలను ప్రసారం చేయడం లేదనేది జగమెరిగిన సత్యం.
నిఖార్సయిన జర్నలిజం మసకబారుతున్నవేళ .. బిగ్ టీవీ రూపంలో బాధితులకు అండగా నిలిచిన తీరు..అందరి జేజేలందుకుంటున్నది. నిజంగా ఇది ప్లాంటెడ్ స్టోరీనా? ఉద్దేశ్య పూర్వకంగా ఎత్తుకున్న టాపికా..? ఆ ప్రసారాలు చూస్తే జర్నలిజం మీద కనీస అవగాహన కూడా లేని సాధారణ వ్యక్తులెవరైనా చెబుతారు. బాధితుల పక్షాన ఆ వార్తలున్నాయని, ఆధారాలు కూడా కళ్లకు కనబడుతున్నాయని. మరి అధికార పార్టీ కళ్లకు ఇది కనబడలేదా అంటే..? పచ్చ మీడియాను చూసీ చూసీ.. ఎల్లో జర్నలిజానికి అలవాటు పడీ పడీ.. తమనే ప్రశ్నించే స్థాయి ఏ మీడియాకు ఇక లేదనే భ్రమలో ఉన్న పాలకులకు ఇది మింగుడు పడని అంశంగా మారింది.
అందుకే అధికారం దారులు వెతుక్కున్నది. అది ఇలా బిగ్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌ను నిలిపేసే శక్తిగా తెరవెనుక పన్నాగాలు పన్నింది. ఇలా భయపెట్టొచ్చనుకున్నారో.. లేక ఇలాంటి జర్నలిజానికి పుల్ స్టాప్ పెట్టకపోతే.. మీ అంతు చూస్తామనే బెదిరింపు అందులో దాగుందో తెలియదు…కానీ.. ఇక్కడ ఉన్న బిగ్ టీవీ బెదిరింపులకు లొంగే, అణిచివేతకు భయపడే మీడియా హౌజ్ కాదనే విషయం తెలుసుకోవడమే ఇక ఏపీ సర్కార్‌కు మిగిలుంది.
ఇలాంటి చర్యలతో తప్పుల తడకల నియామకాల విషయాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో మరింత అభాసుపాలవ్వడం.. మీడియాను కూడా కంట్రోల్ చేయాలనుకునే దోరణితో మరింత పలుచన కావడం తప్ప.. బిగ్‌టీవీకి వచ్చే నష్టమేమీ లేదు. డీఎస్సీ అక్రమాల లోతులను బిగ్‌టీవీ తవ్వితీస్తున్న విధానం ఇప్పటికే ప్రపంచం ముందుకు వచ్చేసింది. ఒక ప్లాట్‌ఫామ్‌కు గంతలు కడితే.. మిగిలిన వేదికలు రెడీగా ఉన్నాయి.
పాదరసాన్ని ఆపడం తరం కానట్టుగా.. ఈ వార్త ప్రసారాలను, మున్ముందు మరిన్ని వాస్తవ కథనాల అంకురార్పణలను ఆపడం పాలకుల తరం కాదనే విషయం మరోమారు ఈ ఉదంతంతో నిరూపణ కానుంది. పవన్ కళ్యాణ్ తెలంగాణలో చేసిన కామెంట్లను కౌంటర్‌గా కేటీఆర్ అన్న మాటలను యథాతథంగా ప్రసారం చేస్తేనే తట్టుకోని పాలకుల తీరు.. ఎంతో కాలం ప్రజామోదం పొందేలా ఉండదనేది స్పష్టం.
తప్పులు జరుగుతాయి. వాటిని సరిదిద్దుకుని పోవడం, బాధితులకు అండగా నిలవడం, ప్రతిపక్షాలకు భయపడకుండా జవాబుదారీ పాలన అందించడమే ప్రజారంజక పాలన అవుతుంది. మీడియా హౌజ్‌లను బంధించి.. బెదిరించి,నిజాలను కప్పెట్టాలని చూస్తే అవి మట్టిని చీల్చుకుని బయటకు వచ్చే మొక్కలే అవుతాయి. ఆ తరువాత మానులుగా మారుతాయి. చరిత్ర ఇదే చెబుతోంది.
బిగ్‌టీవీ… చట్టపరమైన పోరాటానికి సిద్దంగా ఉంది. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. ధర్మమే నిలుస్తుంది.
బిగ్‌టీవీ ట్యాగ్‌లైనే.. వితవుట్ ఫియర్ ఆర్ ఫేవర్! దీనికి నూటికి నూరుపాళ్లు కట్టుబడి ఉంది. ఇదే కమిట్‌మెంట్‌తోనే ముందుకు సాగుతుంది.