E-Paper
Advertisement

AP Politics War: అధికారం మారితే లెక్కలు తేల్చుకోవడమేనా? ఆంధ్రా పాలిటిక్స్‌లో మారిన ‘ట్రెండ్’

AP Politics War: అధికారం మారితే లెక్కలు తేల్చుకోవడమేనా? ఆంధ్రా పాలిటిక్స్‌లో మారిన ‘ట్రెండ్’

AP Politics War:  భీకర దాడులతో దడ పుట్టిస్తున్నారు. ఆందోళనలతో అలజడి సృష్టిస్తున్నారు. ఆంధ్రా రాజకీయమంటే.. అంతులేని రివేంజ్ మాత్రమేనా? ప్రత్యర్థులు చిన్న పొరపాటు చేసి దొరికితే.. చుక్కలు చూపించాల్సిందేనా? ఏపీ పాలిటిక్స్‌లో ఇంత వేడి ఎందుకు? పగలతో రగులుతూ ఉంటేనే.. రాజకీయం చేయగలరా? దాడులు చేయడమే.. ఆంధ్రా పాలిటిక్స్ కల్చరా? అసలు.. ఏపీలో ఏం జరుగుతోంది?

అధికారం మారితే లెక్కలు తేల్చుకోవడమేనా..

జరుగుతున్న దాడులు.. సృష్టిస్తున్న అల్లర్లు.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులని చూస్తుంటే.. ఏపీ ఏంటి ఇలా అయిపోయిందనే చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఓ రకమైన ప్రతీకార పర్వంలా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సిద్ధాంతాలు, అభివృద్ధి ప్రాతిపదికన సాగిన రాజకీయం.. ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, అరెస్టులు, దాడుల చుట్టూ తిరుగుతోంది. గెలిచిన పార్టీ.. ప్రత్యర్థి పార్టీల నాయకులని వేధించడం, అధికారం మారగానే.. పాత లెక్కలు తేల్చుకోవడమే.. మన సంప్రదాయంగా అన్నట్లుగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు.. లేటెస్ట్, హీటెస్ట్ ఎగ్జాంపుల్స్ రెండు ఉన్నాయ్. మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నోరు జారి బూతు మాట మాట్లాడారని.. టీడీపీ శ్రేణులు రగిలిపోయారు. మా నాయకుడిని అంత మాట అంటావా? అంటూ.. ఆగ్రహావేశాలతో కదం తొక్కారు. ఇది.. అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసే దాకా వెళ్లింది.

ఫ్లెక్సీలతో మొదలై హింసకు దారి.. గుంటూరులో కలకలం

ఈ గొడవంతా.. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి వెలిసిన ఫ్లెక్సీల దగ్గర మొదలైంది. గుంటూరులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగిస్తానని అంబటి రాంబాబు సవాల్ చేశారు. ఆ ఫ్లెక్సీని తొలగించేందుకు వెళ్తున్న క్రమంలోనే.. అంబటి రాంబాబుని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇదే సమయంలో జరిగిన ఘర్షణ వాతావరణంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబుని తీవ్రమైన, అనుచితమైన పదజాలం వాడారని.. తెలుగుదేశం కార్యకర్తలు బాగా హర్ట్ అయ్యారు. సీఎంపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించి.. టీడీపీ కార్యకర్తలు, మహిళలు అంబటి రాంబాబు ఇంటి దగ్గరకు చేరుకొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి, కొందరు ఆయన ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్, కిటికీలు, కార్లని ధ్వంసం చేశారు. సీఎం చంద్రబాబుని దూషించినందుకు, విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్నందుకు.. అంబటి రాంబాబుపై పోలీసులు కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

చంద్రబాబు పై అంబటి వ్యాఖ్యలపై టీడీపీ ఖండన

చంద్రబాబుపై.. అంబటి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండాలి గానీ, వ్యక్తిగత దూషణలు తగవన్నారు. మరోవైపు.. వైసీపీ కూడా అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని ఖండించింది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా.. రాజకీయ విమర్శలు హద్దులు దాటి, వ్యక్తిగత దూషణల దాకా వెళ్లడంతో.. ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయ్. ఇది.. ఇక్కడితో అయిపోతుందనుకుంటే.. మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. దాంతో.. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంపై దాడులు జరిగాయి. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు జోగి రమేశ్ ఇంటిని ముట్టడించారు. ఇంటిపైకి రాళ్లు, కర్రలు విసరడమే కాకుండా, పెట్రోల్ బాంబులు విసిరి, ఇంటికి నిప్పు పెట్టారు. ఆయన ఇంటి ముందున్న ఫ్లెక్సీలను చించేసి, ఫర్నిచర్‌ని ధ్వంసం చేశారు.

అధికారం మారితే ఇళ్లపై దాడులా? ఇదేనా ప్రజాస్వామ్యం?

ఏపీ రాజకీయాల్లో అంబటి రాంబాబు, జోగి రమేశ్ నివాసాలపై జరిగిన దాడులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయ్. ఈ దాడుల వెనుక ప్రధానంగా రాజకీయ కక్షసాధింపులు, గత సంఘటనల తాలూకూ ప్రతిచర్యలు కనిపిస్తున్నాయ్. వైసీపీ హయాంలో.. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపైనా, తెలుగుదేశం ఆఫీసుపైనా జరిగిన దాడులకు ప్రతిచర్యగానే.. ప్రస్తుత దాడులు జరుగుతున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయ్. అంబటి, జోగి రమేశ్ లాంటి నాయకులు.. గతంలో వాడిన భాషణ చేసిన విమర్శలు.. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయ్.

నిరసనలు తెలపడం దాకా ఓకే. అవి దారి తప్పి హింసాత్మకంగా మారినప్పుడే.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది. ఓ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలే గానీ.. ఇలా నేరుగా ఇళ్లపైకి వెళ్లి దాడులు చేయడం సరైంది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. వ్యవస్థల కంటే, వ్యక్తుల ఆవేశమే పైచేయి సాధిస్తోందనే సందేశం జనాల్లోకి వెళ్తుంది. అధికారం మారిన ప్రతిసారీ.. ఇలాంటి దాడులు జరిగితే.. అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పక్కనపెట్టి, కేవలం రాజకీయ గొడవలతోనే కాలం గడిచిపోయేందుకు దారితీస్తుంది.

మీరు వేధించారు.. ఇప్పుడు మా వంతు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన కొన్నేళ్లలో లేనివిధంగా.. ఇప్పుడు కక్షపూరిత రాజకీయ సంస్కృతి మొదలైందనే చర్చ రీసౌండ్‌లో వినిపిస్తోంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్నల్ని వేధించారు. ఇప్పుడు.. మా వంతు అనే భావన కార్యకర్తల్లోనా, నాయకుల్లోనూ బలంగా నాటుకుపోయింది. దీనికితోడు కొందరు నేతలు వాడే భాష, అనుచిత వ్యాఖ్యలు కూడా కార్యకర్తలను రెచ్చగొడుతోంది. ఇలాంటి పొలిటికల్ కల్చర్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి?

యూపీ, బీహార్ కథలని ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయ్. యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలకు పరిమితమైన ఈ రివేంజ్ కల్చర్.. ఏపీకి కూడా పాకిందా? అనే చర్చ.. గట్టిగా వినిపిస్తోంది. ఆంధ్రా పాలిటిక్స్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న ధోరణి ఒకటే.. నువ్వు ఒకటి అంటే.. నేను పది అంటా. మేం అధికారంలోకి వచ్చాక చూసుకుంటాం.. ఇంకెంతో టైమ్ పట్టదు.. చూస్తుండగానే కాలం గడిచిపోతుంది.. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. అప్పుడు అందరి లెక్కలు తేలుస్తాం.. లాంటి డైలాగులు కూడా భవిష్యత్‌ ఎలా ఉంటుందో ముందే చెప్పేస్తున్నాయ్. దీనికోసమేనా.. అధికారం? పగలు, ప్రతీకారాలకోసమేనా ప్రభుత్వాలు? గతంలో జరిగిన కొన్ని పరిణామాలు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న చర్యలు చూస్తుంటే.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కంటే ఫ్యాక్షన్ మనస్తత్వమే ఎక్కువగా కనిపిస్తోందని.. జనాల్లో చర్చ జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీ నాయకులపై పాత కేసులని తిరగదోడటం, సోషల్ మీడియా పోస్టుల సాకుతో అరెస్టులు చేయడం పరిపాటిగా మారింది. నాయకుల మధ్య ఉన్న వైరం.. కింది స్థాయి కార్యకర్తల్లోకి విషంలా పాకుతోంది. దీనివల్ల.. గ్రామాల్లో వర్గపోరు పెరిగి, సామాన్యుల ప్రశాంతత దెబ్బతింటోంది.

ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ కల్చర్‌పై ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఈ స్థాయిలో సెగలు పుట్టడానికి కీలక కారణాలు ఉన్నాయి. రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలకు ఇది కేవలం అధికారం మాత్రమే కాదు. మనుగడకు సంబంధించిన సమస్య. ఏదైనా ఒక పార్టీ ఓడిపోతే.. దానిని కోలుకోలేని విధంగా దెబ్బతీయాలనే వ్యూహాలు అమలవుతున్నాయి. సిద్ధాంతాల కంటే వ్యక్తుల మధ్య ఉన్న శత్రుత్వమే రాజ్యమేలుతోంది. అసెంబ్లీ వేదికగా కుటుంబ సభ్యులను లాగడం లాంటి ఘటనలు.. ఇప్పుడు మండుతున్న మంటలకు ఏనాడో ఆజ్యం పోశాయ్. గతంలో లేని విధంగా.. సోషల్ మీడియా ఆర్మీలు.. ఒకరిపై ఒకరు విద్వేషాన్ని చిమ్ముతున్నాయ్. తప్పుడు ప్రచారాల ద్వారా.. క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయ్. ఇవన్నీ చూస్తుంటే.. ఇది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ కల్చరేనా? అనే డౌట్ కొడుతోంది.

రివేంజ్ డ్రామా … ఏపీ భవిష్యత్ పై ప్రభావం

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే.. మేధావులకు, గొప్ప వాగ్ధాటి గల రాజకీయ నాయకులకు కేరాఫ్‌గా ఉండేది. ఇప్పుడు.. ఆ సంస్కృతి మారుతూ వచ్చింది. రాజకీయం అంటే.. ప్రజాసేవ అనే భావన పోయి, ప్రత్యర్థిని రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా మారుతోంది. దాడులు చేయడం, ఆఫీసులు ధ్వంసం చేయడం, నివాసాలపై దాడులకు తెగబడటం లాంటివాటి వల్ల.. రాజకీయం అంటే ఇంతే, అల్లర్లు, ఘర్షణలు.. పాలిటిక్స్‌లో పార్ట్ అని.. భవిష్యత్ తరాలపై ఓ ముద్ర పడిపోతుంది. దీనివల్ల.. కొత్త తరం యువత కూడా తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. ఈ రివేంజ్ డ్రామా ఇలాగే కొనసాగితే.. ఏపీ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. పెట్టుబడులు రావడం కష్టమవుతుంది. రాజకీయ అస్థిరత ఉన్న చోట అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రజలు కూడా ఓ స్థాయి వరకు దీనిని భరిస్తారు. నిత్యవసర వస్తువుల ధరలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల దగ్గరకు వచ్చేసరికి.. ఈ పగలు, ప్రతీకారాలు జనం కడుపు నింపవు. రాజకీయ ఒత్తిళ్ల వల్ల పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించలేకపోతున్నారనే విమర్శలు కూడా ఆందోళన పెంచుతున్నాయ్.

పగలు, ప్రతీకారాలకు స్వస్తి పలికే కాలం ఆసన్నమైందా?

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. కానీ, అది హింసాత్మకంగా మారినప్పుడే వ్యవస్థ బలహీనపడుతుంది. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే, భౌతిక దాడులు కాకుండా చట్టపరమైన చర్యల ద్వారానే శిక్ష పడేలా చూడాలి. పార్టీల అధినేతలు.. తమ కార్యకర్తలను నియంత్రించాలి. హింసను ప్రోత్సహించే వారిని దూరం పెట్టాలి. అసెంబ్లీలో గానీ, బయట గానీ.. విమర్శలు విధానపరంగా ఉండాలే తప్ప వ్యక్తిగత దూషణల దాకా వెళ్లొద్దు. ప్రజలు కూడా అభివృద్ధి గురించి మాట్లాడే వారిని ఆదరించి, హింసను ప్రేరేపించే వారిని తిరస్కరించినప్పుడే ఈ సంస్కృతి మారుతుంది. ఏపీ రాజకీయాల్లో మార్పు రావాలంటే.. కేవలం నాయకుల వల్ల మాత్రమే సాధ్యం కాదు. ఓటరుగా ప్రజలు కూడా నైతికత లేని రాజకీయాలను తిరస్కరించాలి. అధికారం అంటే అణచివేయడం కాదు, అభివృద్ధి చేయడం అనే ఆలోచన నాయకుల్లో కలగాలి. లేకపోతే.. ఈ పగలు, ప్రతీకారాలు.. తర్వాతి తరాలకు కూడా శాపంగా మారతాయ్.

Also Read: అంబటి అరెస్ట్.. రంగంలోకి ‘కులం’

Story by: Anup, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×