YSRCP-TDP War: ఏపీలో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగు రమేశ్ నివాసాలపై జరిగిన దాడులు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కులాల కుంపటిని రాజేస్తున్నాయి. ఈ ఘటనలను వైసీపీ నేతలు సామాజిక కోణంలో విశ్లేషిస్తుండగా… టీడీపీ నేతలు మాత్రం ఇది కులాల రాజకీయం కాదని, వారి నోటి దురుసు వల్ల కలిగిన పర్యవసానమని కొట్టిపారేస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి చంద్రబాబు, లోకేష్‌లను అంబటి, జోగు రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలే కారణమని కౌంటర్లు ఇస్తున్నారు. తప్పు చేసినప్పుడు నిలదీస్తే కులం అంటగడతారా? అని మండిపడుతున్నారు.
అంబటి రాంబాబు నివాసంపై దాడిని వైసీపీ నేతలు కాపు సామాజిక వర్గంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నారు. అంబటి రాంబాబు కాపు వర్గంలో కీలక నేత అని, ఆయనను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆ వర్గాన్ని అణచివేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. కూటమి పాలనలో కాపు కులామే టార్గెట్ అవుతోందని వైసీపీ కాపు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారంటూ సీఎం చంద్రబాబుకు వైసిపి నేత, పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకున్న ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. అంబటి వ్యాఖ్యలు తర్వాత జరిగిన దాడిని కాపులపై దాడిగా వైసీపీ నేతలు మాట్లాడడం హాట్ టాపిక్‌గా మారింది.
చంద్రబాబుకు తాజాగా లేఖాస్త్రం సంధించిన ముద్రగడ పద్మనాభం దాన్ని మీడియా ముందు విడుదల చేశారు.. వైసీపీ మాజీ మంత్రులు, విడదల రజనీ, అంబటి రాంబాబు, జోగి రమేష్‌లను ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంత వరకూ న్యాయమని, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి పాలన ఎక్కడైనా ఉందా అని లేఖలో నిలదీశారు. గతంలో కాపు కులానికి బీసీ రిజర్వేషను ఇస్తానని అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు మొండి చేయి చూపించారని విమర్శించారు. అయినా డిప్యూటి ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌పై అభిమానంతో ఆ వర్గం కూటమికి మద్దతిచ్చిందన్నారు. అయినా ఆ కులం మీద రగిలిపోతానే ఉన్నారని… దయచేసి ఈ కులాన్ని ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టు బట్టలతో పంపించే కార్యక్రమం చేయండని ముద్రగడ తన లేఖలో సలహా ఇచ్చారు.
పనిలో పనిగా వైసీపీ నేతలు అంబటి రాంబాబుని కాపు కుల పెద్దగా ఫోకస్ చేయాలని చూస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరైతే అంబటిని ఏకంగా కాపునాడు వ్యవస్థాపకుడు, దివంగత నేత వంగవీటి మోహనరంగాతో పోలుస్తున్నారు. ఇంకొందరు పవన్ కంటే అంబటే ఆ సామాజికవర్గానికి పెద్ద దిక్కని ఆకాశానికెత్తేస్తున్నారు. దానిపై పొన్నూరు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రియాక్ట్ అయ్యారు. సంబరాల రాంబాబుకి వంగవీటి రంగాకి పోలికా అని ఎద్దేవా చేశారు.
ఇక అంబటి ఇష్యూ నడుస్తున్న తరుణంలోనే మరో వైసీపీ నేత జోగు రమేశ్ నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం రాజకీయం మరింత వేడెక్కింది. మంత్రి నారా లోకేష్‌పై జోగు రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో అగ్రహించిన టీడీపీ శ్రేణులు జోగి రమేశ్ ఇంట్లో లేని సమయంలో దాడి చేశారు. జోగు రమేశ్ నివాసంపై చేసిన దాడిని వైసీపీ బీసీలపై అణచివేతగా ప్రచారం చేస్తోంది. జోగు రమేశ్ ఇంటిపై జరిగిన దాడిని వైసీపీ నేతలు బీసీ నేతలపై అగ్రవర్ణాల దాడిగా మాట్లాడుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత ప్రశ్నిస్తుంటే సహించలేక, అగ్రవర్ణ నేతలే ఉద్దేశపూర్వకంగా ఈ విధ్వంసానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు.
వైసీపీ చేస్తున్న కుల రాజకీయాలను కూటమి పార్టీల నేతలు తప్పుబడుతున్నారు. వైసీపీ నేతలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని.. కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం లేదా ఇతర వ్యక్తిగత దూషణల వల్ల ఆగ్రహించిన కార్యకర్తలే ఈ చర్యలకు పాల్పడ్డారని…దీనికి కులాన్ని ఆపాదించడం హాస్యాస్పదమని టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. తప్పు చేస్తే అడిగితే కులం అంటగడతారా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది కులాల మధ్య గొడవ కాదని, ముఖ్యమంత్రి , ఇతర నేతలపై వైసీపీ నేతలు వాడుతున్న అభ్యంతరకర భాషపై ప్రజలు , కార్యకర్తలు వ్యక్తం చేస్తున్న ఆగ్రహమని పేర్కొంటున్నారు. వైసీపీ నాయకుల ఆసభ్య పదజాలంపై ఎన్నికల కమిషన్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్‌పై టీడీపీ నేతలతో పాటు బీజేపీ నాయకులు సైతం వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతుండటం విశేషం. జగన్ కనుసన్నల్లోనే జోగి రమేష్, అంబటి రాంబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
అదలాఉంటే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసి 53 రోజల పాటు రాజమండ్రి జైల్లో ఉంచినప్పుడు కూడా ఎక్కడా గీత దాటకుండా, టీడీపీ శ్రేణులు ఉద్యమించాయి. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సైతం తెలుగుతమ్ముళ్లు, మహిళలు ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వలేదు. ఆఖరికి చంద్రబాబు నివాసంపై జోగు రమేష్ దాడికి ప్రయత్నించినప్పుడు కూడా అప్పటి ప్రతిపక్షం ఖండనలకే పరిమితమైంది. అయితే ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యాలతో టీడీపీ వర్గాలు ఈ స్థాయిలో భగ్గుమనడం గమనార్హం. తమ అధినేతను దూషించినా, అనుచితంగా వ్యవహరించినా ఇక ఊరుకునేది లేదన్న స్ఫష్టమైన సందేశాన్ని తెలుగుదేశం శ్రేణులు ఇస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అలాగే ఇష్టానుసారం వ్యవహరిస్తున్న వైసీపీ వారిపై చర్యల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి కూడా తమ్ముళ్ల ఆగ్రహం ఒక హెచ్చరికగా భావించవచ్చన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
Also Read: వైసీపీ ఒక ‘నకిలీ పార్టీ’.. జగన్ కుట్రలు సాగవు.. కేశినేని చిన్ని ఫైర్!
Story by: Apparao, Big Tv