E-Paper
Advertisement

Artemis-2: చందమామ వెనుక ఉన్న ఆ చీకటి సామ్రాజ్యంలో ఏముంది? 56 ఏళ్ల నాటి రికార్డు బద్దలు!

Artemis-2: చందమామ వెనుక ఉన్న ఆ చీకటి సామ్రాజ్యంలో ఏముంది? 56 ఏళ్ల నాటి రికార్డు బద్దలు!
Advertisement

Artemis-2: ఎస్.. అంతరిక్ష ప్రయోగాల్లో, ముఖ్యంగా చంద్రుడిపై చేస్తున్న పరిశోధనల్లో.. నాసా ఆర్టెమిస్ మిషన్ కీలక ముందడుగనే చెప్పాలి. ఎందుకంటే, ఆర్టెమిస్-2 అనేది కేవలం ఓ జర్నీ మాత్రమే కాదు. ఇది మనిషి.. చంద్రుడిని చూసే కోణాన్నే మార్చేసింది. వేల సంవత్సరాలుగా మానవాళికి తెలిసిన వెన్నెల ఒక్కటే. ఆ వెలుగు వెనుక దాగిన చీకటిలో.. చంద్రుడు ఎలా ఉన్నాడో.. ఆర్టెమిస్-2తో మనందరి కళ్ల ముందుకొచ్చింది. అసలు.. చంద్రుడి అవతలి వైపు ఏముంది? అనేదే.. ఇప్పుడు మోస్ట్ ఇంట్రస్టింగ్ మ్యాటర్.

56 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి ఆర్టెమిస్-2

ఆర్టెమిస్ 2 లోని వ్యోమగాములు.. చంద్రుని చుట్టూ ప్రయాణించడమే కాదు, అవతలి వైపు కూడా ప్రయాణించి.. 56 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూశారు. 2023లో చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో దిగి, తనకంటూ ఓ చరిత్రను సృష్టించిన భారతదేశపు చంద్రయాన్-3తో పోలిస్తే.. నాసా ఆర్టెమిస్-2 మిషన్‌తో కొత్తగా ఏం తేలిందనేది ఆసక్తి రేపుతోంది. ఈ మిషన్‌లో భాగంగా.. నలుగురు వ్యోమగాములు చంద్రుడిని చుట్టి వచ్చారు. వారిని తీసుకెళ్లిన ఒరియన్ స్పేస్‌క్రాఫ్ట్ 4 లక్షల 6 వేల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి, అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్రగా రికార్డు సృష్టించింది. 1970లో అపోలో 13 ప్రయాణించిన దూరం కంటే.. ఇది 2500 కిలోమీటర్లు ఎక్కువ. ఒరియన్ స్పేస్ క్రాఫ్ట్ చందమామను దాటి 6 వేల 400 కిలోమీటర్ల దూరం వెళ్లింది. మనకు ఎప్పుడూ కనిపించని చంద్రుడి రెండో వైపుని చూపించింది.

చంద్రుడి అవతలి వైపు కనిపించకపోవడానికి కారణం?

Advertisement

చంద్రుడి అవతలి వైపు మనకు కనిపించకపోవడానికి ఓ రీజన్ ఉంది. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి, తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ఒక్కటే. దీనినే, టైడల్ లాకింగ్ అంటారు. అందువల్ల.. జాబిల్లి ఎప్పుడూ ఒకే వైపు కనిపిస్తుంది. కానీ, 1959లో సోవియట్ లూనా-3 తొలిసారి ఆ రెండో వైపు ఫోటోలు తీసినప్పటి నుంచి మొదలైన కుతూహలం.. ఇప్పుడు నాసా ఆర్టెమిస్ మిషన్లతో పీక్‌కు చేరింది. 50 ఏళ్ల తర్వాత మళ్లీ.. మనుషులు చంద్రుడి కక్ష్యలోకి వెళ్లారు. నేరుగా.. చంద్రుడి వెనుక భాగాన్ని తమ కళ్లతో చూశారు. జాబిల్లికి అవతలి వైపు ఎలా ఉందనే ఫోటోలు కూడా పంపారు. అలా.. నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ తిరుగు ప్రయాణం మొదలైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఆర్టెమిస్-2 బృందానికి, నాసాకు అభినందనలు తెలిపారు. వాళ్ల జర్నీ టైమ్‌లోనే.. వ్యోమగాములకు ట్రంప్ సర్‌ప్రైజ్ కాల్ చేశారు. మనుషులు ఇంతవరకు చూడనిదాన్ని మీరు చూశారని, చరిత్ర సృష్టించారని చెప్పారు.

చంద్ర పై ప్రయాణంలో కీలక 40 నిమిషాల బ్రేక్

లూనార్‌ ఫ్లైబై ప్రయాణక్రమంలో.. నాసాతో ఆర్టెమిస్‌-2 సంబంధాలు దాదాపు 40 నిమిషాలు తెగిపోయాయి. ఈ క్రమంలో వ్యోమగాములు చంద్రుడిపై అనేక పరిశీలనలు చేసి ఫొటోలు తీశారు. బిలాలను, ఖనిజ కూర్పుని తెలియజేసే రంగు వైవిధ్యాలను గమనించారు. తర్వాత.. మళ్లీ నాసాతో లింక్ కనెక్ట్ అయింది. అప్పుడు.. భూమి నుంచి మళ్లీ సమాచారం వినడం ఆనందంగా ఉందని వ్యోమగాములు చెప్పారు. ఇదే సమయంలో.. వాళ్లంతా సంపూర్ణ సూర్య గ్రహణాన్ని వీక్షించారు. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళరేఖపైకి రావడంతో.. వ్యోమగాములకు అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని.. ముందు వరుసలో కూర్చుని చూసే అవకాశం లభించింది.

అంతరిక్షంలో సూర్యగ్రహణం

Advertisement

సూర్యుడు దాదాపు గంట సేపు చంద్రుని వెనుక అదృశ్యమయ్యాడు. ఇది చాలా అద్భుతంగా ఉందన్నారు. 1970లో అపోలో 13 కూడా ఎన్నడూ చూడని దృశ్యాలను తాము చూశామని, తమకు అది అద్భుతంగా అనిపించిందని చెప్పారు. అంతేకాదు.. చంద్రుని వెనుక ఉన్న శుక్ర, అంగారక, శని గ్రహాలను కూడా గుర్తించారు. చంద్రుని ఉపరితలంపై నాలుగు ఉల్కాపాతాల మెరుపులను సైతం గమనించారు. అంతరిక్ష శిలలు చంద్రుడిని ఢీకొట్టినప్పుడు వచ్చే కాంతి విస్ఫోటనాలు, భవిష్యత్ యాత్రల కోసం ఉపరితల ప్రమాదాలను అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలకు సహాయపడతాయ్. ముఖ్యంగా చంద్రుని దక్షిణ ధృవం దగ్గర ఉన్న శాశ్వత చీకటి ప్రాంతాల్లో.. ఐస్ రూపంలో నీరు ఉందని భావిస్తున్నారు.

చంద్రుడిపై నల్లని మచ్చలు..

మనకు భూమిపై నుంచి కనిపించే చంద్రుడిపై నల్లని మచ్చలు కనిపిస్తాయ్. వాటినే.. మారియా అంటారు. ఇవి గతంలో లావా ప్రవహించి గడ్డకట్టడం వల్ల ఏర్పడిన మైదానాలు. అయితే, చంద్రుడి అవతలి వైపు ఈ నల్లటి మైదానాలు లేవు. అంతా ఎత్తుపల్లాలు, గుట్టలు, గోతులతో నిండిన గరుకైన ఉపరితలం మాత్రమే ఉంది. చంద్రుడి మరో వైపు క్రస్ట్ చాలా మందంగా ఉండటం వల్ల, లోపల ఉన్న లావా బయటకు రాలేకపోయిందని సైంటిస్టులు గుర్తించారు. చంద్రుడి రెండో వైపు చూస్తే ఏదో యుద్ధం జరిగిన మైదానంలా కనిపిస్తోంది.

ఒరియన్ స్పేస్ క్రాఫ్ట్ రీ-ఎంట్రీ

అక్కడ.. సౌరకుటుంబంలోనే అతిపెద్ద, అత్యంత లోతైన గుంత ఉంది. కోట్ల సంవత్సరాల క్రితం.. భారీ గ్రహ శకలాలు చంద్రుడిని ఢీకొన్నప్పుడు ఏర్పడిన ఈ గోతులు, సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించిన రహస్యాలను దాచుకున్నాయ్. ఆర్టెమిస్ డేటా ప్రకారం, చంద్రుడి అవతలి వైపు కొన్ని ప్రాంతాల్లో వింతైన అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయ్. ఇవి జాబిల్లి ఉపరితలంలో భారీ లోహపు నిక్షేపాలు ఉండొచ్చనే సంకేతాలిస్తున్నాయ్. ఇప్పటికే.. ఒరియన్ స్పేస్ క్రాఫ్ట్ తిరిగి భూమి దిశగా కదులుదుతోంది. ఈ నెల 10న.. పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అయ్యే అవకాశాలున్నాయి.

చందమామపై పాగా వేసేందుకు పోటీ

అంతరిక్షంలో అల్లంత దూరాన ఉండే చందమామను అందుకునేందుకు.. ప్రపంచ దేశాల మధ్య పతాక స్థాయిలో పోటీ నడుస్తోంది. ఒకప్పుడు.. చూసేందుకు మాత్రమే కనిపించే జాబిల్లిపై, ఇప్పుడు ఏకంగా స్థావరం ఏర్పాటు చేసే ఆలోచనల్లో ఉన్నారు. నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతమైన వేళ, మన ఇస్రో కూడా తన తదుపరి భారీ టార్గెట్ రీచ్ అయ్యేందుకు.. చంద్రయాన్-4తో సిద్ధమవుతోంది. ఇప్పుటికే.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడి మట్టిలో సల్ఫర్, ఇతర మూలకాలను గుర్తించింది. ఇస్రోకు చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో, 69 డిగ్రీల సౌత్ పోల్‌ దగ్గర దిగింది. దాంతో.. చరిత్రలో ఈ భిన్నమైన ప్రాంతానికి చేరిన తొలి దేశంలో ఇండియా అవతరించింది. మనకంటే ముందు ఏ అమెరికన్, రష్యన్, చైనీస్ ల్యాండర్.. అక్కడ దిగలేదు.

చంద్రుడి మట్టిలో దాగి ఉన్న నిధులు

శాస్త్రీయంగా చంద్రుని దక్షిణ ధ్రువం.. ఇతర ప్రాంతాల కంటే భిన్నమైనది. దాని లోతైన బిలాలు.. బిలియన్ల సంవత్సరాలుగా సూర్యకాంతిని చూడలేదు. వాటి లోపల, ఉష్ణోగ్రతలు మైనస్ 230 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోగలవు. ఆ శాశ్వత చీకటిలో, సౌర వ్యవస్థ ఆరంభం నుంచి గడ్డకట్టి, చెక్కుచెదరకుండా ఉన్న నీటి మంచు ఉన్నట్లు నిర్ధారించారు శాస్త్రవేత్తలు. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రజ్ఞాన్, చంద్రుని ఉపరితలంపై 14 రోజులు గడిపింది. ఇది.. లేజర్ ఆధారిత పరికరాన్ని ఉపయోగించి, చంద్రుని నేలపైకి లేజర్ పల్స్‌ని ప్రయోగించింది. దాంతో ఏర్పడిన ప్లాస్మా నుంచి వెలువడే కాంతిని అనలైజ్ చేసింది.

జాబిల్లిపై జల నిధులు

ఈ పద్ధతి ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంలో.. అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, ఆక్సిజన్‌ని గుర్తించింది. సౌత్‌ పోల్‌పై ఉన్న నీటి మంచు కారణంగానే.. భారత్, నాసా అటువైపు ఆసక్తి చూపుతున్నాయ్. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించొచ్చు. ఇవి రాకెట్ ఇంధనంలోని ప్రాథమిక భాగాలు. చంద్రునిపై నీటి సరఫరా ఉండటం వల్ల.. వ్యోమగాములు ఆ నీటిని తాగొచ్చు. దాంతో.. ఆహారాన్ని పండించొచ్చు. సౌర వ్యవస్థలో మరింత ముందుకు ప్రయాణించేందుకు అవసరమైన ఇంధనాన్ని తయారు చేసుకోవచ్చు. అందుకే, చంద్రుని దక్షిణ ధ్రువం సౌర వ్యవస్థలోనే.. అత్యంత విలువైన భూభాగం అని చెబుతున్నారు. 2028లో.. నాసా తన మొట్టమొదటి మానవసహిత చంద్రునిపై ల్యాండింగ్‌ని.. ఆర్టెమిస్ ద్వారా ప్లాన్ చేస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపైనే వ్యోమగాముల్ని దించాలని చూస్తోంది.

చందమామ మట్టి ఇక మన చేతుల్లోకి

భారత్ కూడా.. చంద్రయాన్-3తో ఇండియా ల్యాండింగ్ టెక్నాలజీని ప్రూవ్ చేసింది. చంద్రయాన్-4తో అంతకంటే కష్టమైన పని చేయబోతోంది ఇస్రో. అదే.. లూనార్ శాంపిల్ రిటర్న్. కేవలం చంద్రుడిపై దిగడమే కాదు, అక్కడి మట్టిని, రాళ్లని సేకరించి తిరిగి భూమికి తీసుకురావడమే నెక్ట్స్ మిషన్. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండర్లు దిగడం, రోవర్లు తిరగడం చూశాం. చంద్రయాన్-4 చంద్రుడి ఉపరితలం నుంచి మళ్లీ నింగిలోకి ఎగిరి, భూమికి ఆ మట్టి నమూనాలను మోసుకొస్తుంది. ఈ మిషన్ కోసం ఇస్రో ఐదు వేర్వేరు మాడ్యూళ్లను ఉపయోగిస్తోంది. ఇది.. ఇస్రో చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రయోగం.

నెక్స్ట్ జనరేషన్ పవర్ ప్లాంట్

అమెరికా, భారత్ మాత్రమే కాదు, చైనా, జపాన్ లాంటి దేశాలు కూడా చంద్రుడి సౌత్‌ పోల్‌పై దిగేందుకు పోటీ పడుతున్నాయ్. అక్కడ ఉన్న మంచుని రాకెట్ ఇంధనంగా, ఆక్సిజన్‌గా మార్చుకోవచ్చు. భూమిపై తక్కువగా ఉండే హీలియం-3 ఖనిజం చంద్రుడిపై పుష్కలంగా ఉంది. ఇది భవిష్యత్తులో.. విద్యుత్ అవసరాలకు చాలా కీలకం. మార్స్‌పైకి వెళ్లాలంటే, చంద్రుడిని ఓ లాంచ్ ప్యాడ్‌గా వాడుకోవాలని కూడా అంతరిక్ష పరిశోధన సంస్థలు ప్లాన్ చేస్తున్నాయ్. నాసా ఆర్టెమిస్-3 ద్వారా మనుషులను చంద్రుడిపై దించాలని చూస్తోంది.

అందని చందమామ.. ఇక మన చెంతకే!

భారత్ కూడా చంద్రయాన్-4 ద్వారా చంద్రుడి మట్టిని భూమికి తెచ్చి.. తన స్వశక్తిని ప్రపంచానికి చాటబోతోంది. వినీలాకాశంలో అందంగా కనిపించే చందమామ, ఇప్పుడు శాస్త్రవేత్తల పరిశోధనలతో మానవాళికి మరో ఇల్లుగా మారబోతోంది. మన ఇస్రో.. ఈ రేసులో అగ్రగామిగా ఉండటం భారతీయులందరికీ గర్వకారణం. ఆర్టెమిస్-2 జర్నీ.. చంద్రుడి అవతలి వైపు వింతలను చూపిస్తే, మన చంద్రయాన్-3 అక్కడి రహస్యాలను ఎప్పుడో ప్రపంచానికి చూపించింది.

Also Read: ఒకే రాజధాని.. మూడు గ్రోత్ ఇంజిన్లు.. ఏపీ అభివృద్ధికి బాబు ‘మాస్టర్ ప్లాన్’!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×