E-Paper
Advertisement

అసదుద్దీన్ మోదీకి శత్రువా? మిత్రుడా? యూపీలో ఏం జరుగుతోంది?

అసదుద్దీన్ మోదీకి శత్రువా? మిత్రుడా? యూపీలో ఏం జరుగుతోంది?
Advertisement

Asaduddin Owaisi: తెలంగాణలో బీజేపీ, ఎంఐఎం.. రాజకీయ బద్ధ శత్రువులు. ఒకరిపై మరొకరు విమర్శలు.. ఆరోపణలు. కానీ ఇదే అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ దాటి ఉత్తరాదికి వెళ్తే మాత్రం రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయనే చర్చ జరుగుతోంది. ఎన్నికలు ఎక్కడ జరిగినా ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీకి దిగడం.. ప్రధాన ప్రతిపక్షాల ఓట్లను చీల్చడం జరుగుతోంది. దీని వల్ల ఫైనల్‌గా బీజేపీ లాభపడుతున్నదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకంటే.. ఉత్తరప్రదేశ్‌లోనూ మరో కొత్త కూటమి ఏర్పాటైంది. కన్షీరాం రాజకీయ వారసుడిగా ఎదుగుతున్న చంద్రశేఖర్ ఆజాద్‌తో చేతులు కలిపింది ఎంఐఎం. యూపీలో 403 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. అసలు ఒవైసీ రాజకీయ లక్ష్యం ఏంటి? బీజేపీని ఓడించడమా? లేక బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడమా? మోడీకి ఆయన మిత్రుడా? శత్రువా?

తెలంగాణ రాజకీయాలను చూద్దాం..

Advertisement

ముందుగా తెలంగాణ రాజకీయాలను చూద్దాం. హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా బలమైన రాజకీయ పునాది ఏర్పరుచుకున్న పార్టీ ఏఐఎంఐఎం.. రాష్ట్రంలో బీజేపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉంది. బీజేపీ నేతలు ఒవైసీ కుటుంబాన్ని, ఎంఐఎం రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుంటారు. మరోవైపు ఒవైసీ కూడా ప్రధాని మోదీ, బీజేపీ విధానాలపై తీవ్రంగా విరుచుకుపడుతుంటారు. అయితే రాష్ట్రం దాటిన తర్వాత ఒవైసీ రాజకీయ వ్యూహంపై మాత్రం భిన్నమైన చర్చ మొదలవుతుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎంఐఎం విస్తరణకు ప్రయత్నించడం.. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అభ్యర్థులను నిలబెట్టడం.. ఇలా స్థానిక రాజకీయ సమీకరణాలను మార్చేస్తుంది ఎంఐఎం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది.

ఎంఐఎం పోటీ వల్ల బీజేపీకి లాభం జరిగిందనే చర్చ..

Advertisement

ఎన్నికల్లో గెలవాలంటే కేవలం ఓట్లు సాధిస్తే సరిపోదు. ప్రత్యర్థి ఓట్లు ఎన్ని ముక్కలవుతున్నాయన్నది కూడా కీలకమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో బీజేపీకి, ప్రధాన ప్రతిపక్షానికి మధ్య గట్టి పోటీ ఉందనుకుందాం. అలాంటి చోట ఎంఐఎం అభ్యర్థి బరిలోకి దిగితే.. ముస్లిం ఓట్లలో కొంత భాగం ఎంఐఎం వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ప్రధాన ప్రతిపక్షం ఓట్లు తగ్గి.. బీజేపీకి గెలుపు అవకాశాలు పెరగవచ్చనే చర్చ ఉంది. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలనే తీసుకుంటే.. ఎంఐఎం 95 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. పార్టీ సాధించిన ఓట్ల శాతం కూడా చాలా తక్కువగానే ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ వల్ల బీజేపీకి లాభం జరిగిందనే చర్చ ఉంది.

ఎంఐఎం వ్యూహం ఏంటి?

అసలు గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్న స్థానాల్లోనూ పోటీ చేయడం వెనుక ఎంఐఎం వ్యూహం ఏంటి? సొంత రాజకీయ బలాన్ని పెంచుకోవడమా? లేక ప్రతిపక్ష ఓట్లలో చీలిక తీసుకురావడమా?

ఓవైసీ రాజకీయంలో కూటములు కొత్త కాదు..

పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ రాజకీయ ప్రయాణంలో కూటములు కొత్త కాదు. 2019 మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీతో ఎంఐఎం కలిసి పనిచేసింది. బీహార్ ఎన్నికల్లోనూ ఎంఐఎం తన రాజకీయ ప్రభావాన్ని చూపించింది. 2025 బీహార్ ఎన్నికల్లో 28 స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో విజయం సాధించింది. అంటే ఉత్తరాదిలో ఎంఐఎం రాజకీయ విస్తరణ కేవలం ఓట్ల చీలికకే పరిమితం కాలేదు. కొన్ని చోట్ల సీట్లు కూడా సాధించింది. ఇప్పుడు ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో మరో కీలక అడుగు వేసింది. చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీతో కలిసి సామాజిక పరివర్తన్ మోర్చా పేరుతో కొత్త కూటమిని ప్రకటించింది. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడింది.

ఒకే వేదికపైకి దళిత, ముస్లిం..

యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని కూటమి ప్రకటించింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. చంద్రశేఖర్ ఆజాద్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఒకవైపు దళిత రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజాద్.. మరోవైపు ముస్లిం రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒవైసీ.. ఈ ఇద్దరూ కలిసి దళిత, ముస్లిం ఓటర్లను ఒకే రాజకీయ వేదిక పైకి తీసుకురావాలనుకుంటున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

ఓవైసీ డెడ్‌లైన్.. పట్టించుకోని పార్టీ అధినేత..

ఈ కూటమి ఏర్పడటానికి ముందు జరిగిన కొన్ని పొలిటికల్ డెవలప్‌మెంట్స్‌ను ఒకసారి చర్చించుకోవాలి. ఇండి కూటమిలో చేర్చుకోవాలంటూ ఒవైసీ పెట్టిన డెడ్‌లైన్‌ను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలు ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పుడే ప్రత్యేక కూటమికి బీజం పడింది. అఖిలేష్ యాదవ్ అహంకారంతో తమ ప్రతిపాదనలను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, ఇప్పుడు ఆజం ఖాన్ వంటి ముస్లిం నేతలకు అన్యాయం జరిగిందంటూ అఖిలేష్ ఓటు బ్యాంకునే ఒవైసీ నేరుగా టార్గెట్ చేశారు. అఖిలేష్ యాదవ్ అత్యంత నమ్మకంగా నిర్మించుకున్న PDA – వెనుకబడిన, దళిత, మైనారిటీ ఫార్ములాకు ఇది కోలుకోలేని దెబ్బ అనే చర్చ జరుగుతోంది. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమికి పడాల్సిన ముస్లిం, దళిత ఓట్లను సామాజిక పరివర్తన మోర్చా భారీగా చీలిస్తే.. అది నేరుగా బీజేపీకి వరంగా మారనుంది.

5 స్థానాల్లో పోటీ.. సాధించింది మాత్రం 0.49 ఓట్లు..

అయితే యూపీ జనాభాలో దాదాపు 41 శాతం వరకు ఉన్న దళిత, ముస్లిం ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకుంటే అధికార పీఠాన్ని శాసించవచ్చని ఒవైసీ-ఆజాద్ జోడీ లెక్కలు వేస్తోంది. ముఖ్యంగా పశ్చిమ యూపీ, రోహిల్‌ఖండ్, పూర్వాంచల్ ప్రాంతాల్లోని సుమారు 150 నియోజకవర్గాల్లో ముఖ్యంగా 58 కీలక స్థానాల్లో ఈ కూటమి అత్యంత బలమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. గత 2022 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఎంఐఎం 95 స్థానాల్లో పోటీ చేసి కేవలం 0.49 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. కానీ ఇప్పుడు బీఎస్పీ ఓటుబ్యాంకుకు వారసుడిగా ఎదుగుతున్న చంద్రశేఖర్ ఆజాద్ జతకట్టడంతో, ఈ కూటమి చీల్చే ప్రతి ఓటు ప్రత్యర్థి శిబిరాల గెలుపోటములను తలకిందులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందా?

అయితే ఈ కూటమి వల్ల సమాజ్‌వాదీ పార్టీకి వచ్చే ఓట్లలో చీలిక ఏర్పడుతుందా? కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందా? అంతిమంగా బీజేపీకి రాజకీయంగా లాభం జరుగుతుందా? అనే క్వశ్చన్స్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు యూపీ రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. ఒవైసీ మాత్రం తనపై వస్తున్న బీజేపీ బీ టీమ్ విమర్శలను అంగీకరించడం లేదు. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసినంత మాత్రాన బీజేపీకి సహకరించినట్లు ఎలా అవుతుందనేది ఆయన ప్రశ్న. చంద్రశేఖర్ ఆజాద్‌తో కూటమి ప్రకటించిన టైమ్‌లో కూడా బీజేపీని మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని ప్రకటించారు.

మోడీకి మిత్రుడా? శత్రువా?

మరి ఒకవైపు బీజేపీని వ్యతిరేకిస్తున్నానని చెబుతూనే.. మరోవైపు బీజేపీ వ్యతిరేక పార్టీల ఓట్లను చీల్చే పరిస్థితి ఎందుకు వస్తోంది? ఇది ఒవైసీ రాజకీయ వ్యూహమా? ఆయన పార్టీ విస్తరణ ప్రయత్నమా? లేక ప్రతిపక్షాల మధ్య సమన్వయ లోపమా? అసలు అసదుద్దీన్ ఒవైసీ మోడీకి మిత్రుడా? శత్రువా? ఈ ప్రశ్నకు సమాధానం ప్రసంగాల్లో కాదు.. ఎన్నికల ఫలితాల్లో, నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కల్లో తేలాల్సి ఉంటుంది.

Also Read: 3 వారాల్లో 3 తుఫానులు.. బంగాళాఖాతంలో అసలేం జరుగుతోంది?

Tags

Related News

స్టేట్‌లో సిద్దాంతపర విమర్శల దాడి! సెంట్రల్‌లో కేంద్ర సాయం కోరి..! భారత్‌ సమ్మిట్‌తో విమర్శలు గుప్పించినా.. ప్రధానితో సమస్యలు విన్నవించినా..!

ఐదు లక్షల మందికి పైగా ఉపాధి కూలీ పనులకు హాజరు! గత ఏడాదితో పోలిస్తే 15 రెట్లు ఎక్కువ..! నల్లగొండలో అత్యధికంగా ఉపాధి కూలీలకు!

3 వారాల్లో 3 తుఫానులు.. బంగాళాఖాతంలో అసలేం జరుగుతోంది?

సన్నరకాల బ్లాక్‌ మార్కెట్‌కు ఇదే సరైన గుణపాఠం..! సర్కార్‌ వార్నింగ్‌ ఇచ్చినా బహిరంగ మార్కెట్లో తగ్గని ధరలు..! మరో ఏడాది ఇదే తీరు..?

హాస్టళ్లలో మెనూ అమలు కావడం లేదు..! కరువు సాకుతో మూడు నెలలుగా సరకుల సరఫరా లేదు? అరకొర భోజనం.. అర్థాకలితో విద్యార్థులు!

ముందు కవిత.. వెనుక రేవంత్! హరీశ్ ను వెంటాడుతున్న ‘సిద్దిపేట’..! అవినీతిపై పోరాడుతానంటున్న కవిత.. సిద్దిపేట సభ వేళ సీఎంకు హరీశ్‌ లేఖ..!

రాజకీయాలకు కేసీఆర్‌ దూరం.. మీడియాతో కేటీఆర్‌ దూరం దూరం! ఇదేం వ్యూహం..? నష్టమా .. లాభమా??

Big Stories

Advertisement
×