Bay of Bengal Cyclones: ఒక తుఫాను వస్తేనే తీర ప్రాంత ప్రజలు వణికిపోతారు. అలాంటిది.. మూడు వారాల వ్యవధిలో మూడు తుఫానులు. ఒకటి తీరం దాటి బీభత్సం సృష్టించింది. రెండోది వెంటనే వచ్చి వర్షాలతో అతలాకుతలం చేసింది. ఇప్పుడు మూడోది.. అంతకుమించిన తీవ్రతతో ఏపీని వణికిస్తోంది. అసలు బంగాళాఖాతంలో ఏం జరుగుతోంది? సముద్రం ఎందుకిలా తుఫానులను సృష్టిస్తోంది? ఎల్‌నినో ప్రభావం ఉందా? అసలు ఈ వరుస తుఫానుల వెనక కథేంటి?
145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు..
అక్టోబర్ 28.. అర్ణబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది. ఆ తర్వాత నవంబర్ 3న మురసు తుఫాను ఒంగోలు సమీపంలో తీరం దాటింది. ఈ రెండు తుఫానుల ప్రభావం నుంచి తీర ప్రాంతాలు పూర్తిగా కోలుకోకముందే.. ఇప్పుడు బంగాళాఖాతంలో అక్వాన్ తుఫాను వణికిస్తోంది. ఇది సాధారణ తుఫాను కాదు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నవంబర్ 19 నాటికి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. నవంబర్ 20న నెల్లూరు నుంచి తుని మధ్య ఏపీ, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆ టైమ్‌లో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు.. అప్పుడప్పుడు 145 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.
అసలు మూడు వారాల్లో మూడు తుఫానులు ఏర్పడటానికి కారణమేంటి?
దీనికి ప్రధానంగా మూడు వాతావరణ, భౌగోళిక కారణాలు ఉన్నాయి. మొదటిది.. సముద్రంలో వేడి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. తుఫానులకు సముద్రంలోని వేడి చాలా అవసరం. వర్షాకాలం వెళ్లిపోయిన తర్వాత కూడా బంగాళాఖాతంలో నీరు బాగా వేడిగానే ఉంటుంది. చాలా ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 28 డిగ్రీలకు పైనే ఉంటుంది. ఈ వేడి వల్ల సముద్రం నుంచి గాలిలోకి తేమ చేరుతుంది. అదే తేమ తుఫానులకు ఇంధనంలా పనిచేస్తుంది. ఒక తుఫాను వెళ్లిపోయిన తర్వాత కూడా సముద్రంలోని చాలా ప్రాంతాలు వేడిగానే ఉంటాయి. దీంతో మరో అల్పపీడనం ఏర్పడి, అది తుఫానుగా మారడానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి.
ఈ రాష్ట్రాలకు తుఫాన్ల ముప్పు ఎక్కువ..
రెండో కారణం.. గాలులు. వర్షాకాలంలో వాతావరణంలో పైస్థాయిలో బలమైన గాలులు వీస్తుంటాయి. ఇవి తుఫానులు బలపడకుండా అడ్డుకుంటాయి. కానీ వర్షాకాలం ముగిసిన తర్వాత ఆ గాలుల ప్రభావం తగ్గుతుంది. దీంతో సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు క్రమంగా బలపడి తుఫానులుగా మారే అవకాశం ఉంటుంది. మూడో కారణం.. బంగాళాఖాతం ఆకారం. బంగాళాఖాతం చుట్టూ మూడు వైపులా భూభాగం ఉంటుంది. పైకి వెళ్లే కొద్దీ ఇది ఇరుకుగా మారుతుంది. దీంతో సముద్రం నుంచి వచ్చే తేమ గాలులు మన తూర్పు తీర ప్రాంతాల వైపు కదులుతుంటాయి. ఈ ఎఫెక్ట్‌తోనే ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు తుఫానుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.
ఎల్‌నినో ఎఫెక్ట్..
ఇక ఇప్పుడు మరో అసలైన కారణం దగ్గరికి వద్దాం.. అదే ఎల్‌నినో. పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఏర్పడే వాతావరణ పరిస్థితినే ఎల్‌నినో అంటారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ, వర్షాలు కురిసే విధానం మారుతుంటాయి. భారతదేశ వాతావరణంపై కూడా దీని ప్రభావం ఉంటుంది. కొంతమంది వాతావరణ నిపుణులు ప్రస్తుత తుఫానులకు ఎల్‌నినో కూడా ఒక కారణమంటున్నారు. అయితే ఎల్‌నినో ఉంటే తప్పనిసరిగా ఎక్కువ తుఫానులు వస్తాయని కాదు. సముద్రంలోని వేడి, గాలుల పరిస్థితులు, తేమ.. ఇలా చాలా అంశాలు కలిసి తుఫానుల ఏర్పాటుకు కారణమవుతాయి.
ఒకసార చరిత్రలోకి వెళ్దాం..
నిజానికి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడటానికి సాధారణంగానే అనుకూల సమయం. అంటే ఇప్పుడు ఏర్పడుతున్న పరిస్థితులు ఈ సీజన్‌కు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. ఇప్పుడు ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. ఏపీ తక్కువ టైమ్‌లో వరుస తుఫానులు రావడం ఇదే మొదటిసారి కాదు. 1976 నవంబర్‌లో రాష్ట్రాన్ని వరుసగా మూడు తుఫానులు ప్రభావితం చేశాయి. ఆ తర్వాత 1987 అక్టోబర్ మధ్య నుంచి నవంబర్ మధ్య వరకు కూడా ఇలాంటి సిచ్యూవేషన్ ఏర్పడింది. ఆ రెండు సందర్భాల్లోనూ ఎల్‌నినో సిచ్యూవేషన్ ఉంది. ఇక 2015 నుంచి 2025 మధ్య బంగాళాఖాతంలో దాదాపు 34 తుఫానులు ఏర్పడ్డాయి. దీంతో బంగాళాఖాతం తీర ప్రాంతాలకు తుఫానుల ముప్పు ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అక్వాన్ తుఫాను విషయంలో ఏపీ ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. నవంబర్ 20 మధ్యాహ్నం నెల్లూరు నుంచి తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సముద్రపు అలలు ఉప్పొంగి తీర ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు. అందుకే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు. తీర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటించాలి. అత్యవసర పరిస్థితుల కోసం ముందుగానే సిద్ధంగా ఉండాలి.
సముద్రం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం..?
మొత్తంగా చూస్తే… బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస తుఫానులు మనకు ఒక విషయాన్ని మాత్రం క్లారిటీ ఇస్తున్నాయి. తుఫాను ఏర్పడటం ఒక పరిణామం అయితే.. అది ఎంత వేగంగా బలపడుతోంది? ఎటువైపు ప్రయాణిస్తోంది? ఎక్కడ తీరం దాటుతోంది? అనేవే ఇప్పుడు అత్యంత కీలకం. సముద్రం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. కానీ ముందస్తు జాగ్రత్తలను పాటిస్తే ప్రాణనష్టాన్ని మాత్రం తగ్గించుకోవచ్చు. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.. బిగ్‌టీవీని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇక లెటెస్ట్ అప్‌డేట్స్ కోసం బిగ్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
Also Read: పాన్ షాప్ ముసుగులో గంజాయి దందా.. 21 కిలోల సరుకుతో క్యారియర్ అరెస్ట్