గతం ఘనం.. వర్తమానమే పరమ దరిద్రం.. అన్నట్టుగా తయారు చేసుకుంటున్నది చేజేతులా బీఆరెస్ పార్టీ. ఓటమి తరువాత కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితం కావడం, కేటీఆర్‌కు పగ్గాలివ్వడంతో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలా పడ్డ చందంగా మారింది. ఓ వ్యూహం లేదు.. ఓ ప్లానింగూ కరువయ్యింది. అందుకే తలోదారి.. చెరోదారిలా .. తండ్రీకొడుకులు ఓ వైపు.. క్యాడర్, లీడర్ మరోవైపు అన్నట్టుగా సాగుతోంది బీఆరెస్ పార్టీ తీరు.
కేసీఆర్ ఏం చెబుతున్నారో… కేటీఆర్ ఏం పాటిస్తున్నారో తెలియదు కానీ, కేటీఆర్ వేస్తున్న ప్రతి అడుగూ తప్పటడుగులాగే పడుతోంది. ఆయన నోటి వెంట వచ్చే ప్రతి పలుకూ అధికార పార్టీని ఇరుకున పెట్టడమేమో గానీ, తనకు తానుగా కత్తితో గాయాలు చేసుకుంటున్నట్టుగానే ఉంటుంది. తాజాగా ఆయన నిర్మల్‌లో చేపట్టిన రైతు గర్జనలో శివుడి పాదాల దగ్గరున్న గంగను రాముడి తలపైకి తెచ్చిన ఘనుడు కేసీఆర్.. అని ఏదో చెప్పబోయి ఏదో అన్నాడు. దీన్ని బీజేపీ బాగా వాడుకున్నది. అతని నాస్తికత్వాన్ని పనిలో పనిగా ఎండగట్టింది.
తేలు మంత్రం తెలవనోడు.. పాము పుట్టలో వేలు పెట్టినట్టుగానే.. ఇలాగే ఉంటున్నాయి కేటీఆర్ అడుగులు. మాటలు. ఇప్పుడు అసలు పాయింట్‌కు వద్దాం. ఓటమి తరువాత జనంపై అలిగి ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యాడు కేసీఆర్. జనంతో దూరం పెంచుకుంటున్నాడు. కానీ, తననే కలవరిస్తున్నారని, కేసీఆర్ లేని లోటు జనాలకు స్పష్టంగా తెలిసి వస్తుందని ఆ పార్టీ పదే పదే అన్ని వేదికలపైనా చెప్పుకుంటున్నది. జనం సమస్యల్లో ఉంటే, ఇబ్బందుల పాలవుతుంటే పల్లెత్తు మాట కూడా మాట్లాడని, బయటకు రాని నేత పట్ల జనానికి ముందున్నంత సానుభూతి ఉంటుందా? అనే చర్చ కూడా సాగుతోంది మరోవైపు.
ఆయన అలా రాజకీయాలతో పాటు జనాలతో కూడా దూరం పెంచుకుంటూ .దాన్ని ఓ వ్యూహంగా అమలు పరుస్తున్నామని చెప్పుకుంటున్నారు. కేటీఆర్ మీడియాకు మొత్తం దూరమే అవుతున్నాడు. అసలు తాను ‘ఏండ్లుగా పేపర్లనే చదవడం మానేశానని, అసలు జర్నలిజం బతికే ఉందా? ఇప్పుడంతా సోషల్ మీడియా శకం, రీల్స్ కాలం..’ అంటూ తను పరిశోధించిన విషయాన్ని వెల్లడించి ‘తన దారి.. సోషల్ మీడియా దారి’ అని చెప్పుకున్నాడు.
దీంతో సరిపెట్టుకోలేదు. మెయిన్ మీడియాతో పెట్టుకుంటున్నాడు. కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. అధికారంలో పదేండ్ల పాటు ఉన్న సమయంలో ఆ మీడియానే బీఆరెస్‌కు సపోర్టుగా నిలిచింది. అప్పుడు శత్రవులుగా కనిపించలేదు. ఇప్పుడు తమపై కత్తికట్టి వార్తలు రాస్తున్నారంటూ మీడియా మొత్తాన్ని శత్రు శిబిరం ఖాతాలోకి నెట్టేశాడు కేటీఆర్. బిగ్ టీవీ పేరు వచ్చేలా సోషల్ మీడియాలో ఓ అకౌంట్ సృష్టించి తన టీమ్ తో తమ పైత్యమంతా వెళ్లగక్కేందుకు వెనుకాడలేదాయన. అసలు జర్నలిజం బతికే ఉందా? అని నీతి పాఠాలు వల్లెవేసే కేటీఆర్.. ఆ జర్నలిజానికి తూట్లు పొడిచే విధంగా తన రాజకీయాలకు వాడుకునేందుకు దిగజారిన వైనం.. ఆయన పట్ల చులకన భావాన్నే ఏర్పరుస్తోంది.
‘ఈనాడుతో క్షమాపణలు చెప్పించుకున్నా చూశావా?’ అని అల్పత్వాన్ని చాటుకోవడమే కాదు.. వెలుగు పేపర్ లో వచ్చిన కొండ పోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు నీళ్లు తరలించుకున్నారని వచ్చిన వార్తపై పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించి భంగపాటుకు గురయ్యారు. తాజాగా స్వయంగా కవితే.. సిద్దిపేట వేదికగా కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లోని బావిలోకి కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు వస్తున్నాయని ప్రకటించారు.
ఇక మెయిన్ మీడియాను పట్టించుకోని కేటీఆర్.. తన మీడియా ‘నమస్తే’ పై కూడా పట్టు కోల్పోయినట్టున్నాడు. ఉదయం పత్రికలో వచ్చిన ‘సాగర్‌కు చంద్రబాబు గండి’ అనే వార్తను యథాతథంగా అచ్చేసి పెద్దల మెప్పు పొందే ప్రయత్నంలో కాపీ పేస్ట్ వార్తలకూ దిగజారిందనిపించుకున్నదా పత్రిక.
మెయిన్ మీడియాతో దూరం పెంచుకుని, తన మీడియాను గాలికొదిలేసి.. జనాన్ని కూడా ‘ఓడగొట్టారుగా అనుభవించండి..’ అనే విధంగా మాట్లాడే తీరు.. కేటీఆర్ లో పెరిగిన అసహనానికి నిదర్శనంగా చూస్తున్నారు. ఓడిన తరువాత ఇద్దరు తండ్రీ కొడుకులు ‘టచ్ మీ నాట్’ పాలసీనే అవలంభిస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేని తత్వంతో.. తమంతట తాముగా దూరం పెంచుకోవడం పార్టీని నష్టమే తప్ప ఏమాత్రం లాభం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.