దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదంటారు. ఇక్కడ సర్కార్ మెనూ బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని చెబుతున్నా.. అక్కడ క్షేత్రస్థాయిలో హాస్టల్ విద్యార్థులను అర్థాకలితో మాడుస్తున్నారు. పిల్లల కడుపుకొడుతున్నారు. కారణం ఏంటా.. అని ఆరా తీస్తే.. కరువొచ్చింది మీకు తెలియదా? అని పిల్లల మదిలో కరువు మొక్క నాటి .. ఇకపై ఇలాగే అరకొర భోజనమే ఉంటుందని వారిని మెంటల్‌గా ప్రిపేర్ చేసేస్తున్నారట. గత మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
రాష్ట్రంలో మొత్తం 3,500 కి పైగా రెసిడెన్షియల్, సంక్షేమ హాస్టళ్లున్నాయి. 1,002 గురుకులాలు కొనసాగుతున్నాయి. 495 కేజీబీవీ హాస్టళ్లున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో రెండు వేలకు పైగా హాస్టళ్లు కొనసాగుతున్నాయి. వీటన్నింటి పరిధిలో దాదాపు పది లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
రేవంత్ సర్కార్ వచ్చిన తరువాత మెనూ లో చాలా మార్పులు తెచ్చింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్‌తో పాటు నాణ్యమైన భోజనం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నది. దీని కోసం డైట్ చార్జీలను కూడా పెంచి ఇస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం కోసం సరకులు సరఫరా చేసేందుకు ఏడాదికి రూ. 900 కోట్లు ఖర్చు పెడుతోంది. గతంలో మాదిరిగా కాకుండా.. ఈ ఏడాది ఆగస్టు నుంచి టెండర్ నిర్వహణను కేంద్రీకృతం చేసింది. అంటే ఒక్కరికే టెండర్‌ను అప్పగించి.. వారి ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టళ్లకు సరకులు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నది.
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్‌మెంట్, ప్రాసెసింగ్ అండ్ రిటైలింగ్ కో ఆపరేటివ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్( నాకాఫ్)కు కాంట్రాక్టు ను అప్పగించింది సర్కార్. దీన్ని గతంలో బీఆరెస్ హయాంలో కార్పొరేషన్ చైర్మన్‌గా చేసిన మచ్చ శ్రీనివాస్ అనే వ్యక్తి నడిపిస్తున్నాడు. అయితే ఈ కాంట్రాక్టు అప్పగించిన తరువాత ఓ నెల పాటు సరకులు టంచనుగా అన్నీ సరఫరా అయినా.. ఆ తరువాత మూడు నెలల నుంచి అరకొర సరకులే వెళ్తున్నాయట. పిల్లలకు నిత్యం అందించే భోజనం, స్నాక్స్, బ్రేక్ ఫాస్ట్‌లో తేడాలు కనిపిస్తున్నాయి.
దీంతో కొందరు నిలదీసి అడగటంతో హైదరాబాద్‌లో తీవ్రమైన కరువు వచ్చింది. అందుకే సర్కార్ సరకులు సరిగా సరఫరా చేయలేకపోతున్నదని వారికి సర్ది చెప్పి.. ఈ భోజనంతోనే సరిపెట్టుకోవాలనే విధంగా వారిని మానసికంగా సిద్దం చేస్తున్నారట. అంటే మరో ఏడాది పాటు ఇలా కరువు పేరు చెప్పుకుని ఈ సరకుల కాంట్రాక్టరు … పిల్లల కడుపు కొట్టి కోట్లు సంపాదించేందుకు వ్యూహం పన్నాడన్నమాట.
ఇప్పటికే దీనిపై ఆదిలాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సోమ రాజేశ్వర్ లేఖ రాశారట. ఇదేంటీ..? ఏం భోజనం పెడుతున్నారు..? ఎందుకు మెనూలో కోతలు పెట్టారు? అరకొర సరకులే ఎందుకు సరఫరా చేస్తున్నారు? అని లేఖ రాయడంతో విషయం వెలుగు చూసింది. దీనిపై సంబంధిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా మీటింగు పెట్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చినా.. పెద్దగా మార్పు లేదట. అక్కడ పిల్లలనే మేనేజ్ చేసిన వీరు.. ఇక్కడ అధికారులను మేనేజ్ చేయరా? అనే అపవాదును సర్కార్ మూటగట్టుకుంటోంది.
కరువు పేరుతో సన్నబియ్యాన్ని బ్లాక్ చేసి పదివేలకు క్వింటాలుకు అమ్ముకుంటున్న వైనం మరవకముందే.. పేద విద్యార్థులకు పెట్టే తిండిని కూడా కరువు పేరుతో కొల్లగొట్టి కోట్లు గడించేందుకు రెడీ అయిపోయింది ఆ కాంట్రాక్టు సంస్థ. నెలకు 88 రకాల నిత్యావసర సరకులు సరఫరా చేయాల్సి ఉండగా.. మొత్తానికి మొత్తం నిలిపివేసింది ఆ సంస్థ. ఉన్న స్టాకునే పొదుపుగా వాడుకుని, పప్పు చారు లేకుండా, స్నాక్స్ ఎగ్గొట్టి, బూస్ట్, పాలు తీసేసి.. భోజనంలో నాణ్యతకు పాతరేసి కరువు పొదుపును పాటిస్తున్నారట. పిల్లల కడుపులు కొట్టి.. కరువు పేరిట కోట్ల సంపాదిస్తున్నారట. గత మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు కనిపిస్తోంది అన్ని హాస్టళ్లలో.