ఆయనను బీఆర్‌ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. కేసీఆర్ తనకు పార్టీ పరంగా ఏదైనా ఆపత్కాలం వస్తే చాలు .. ఇతన్నే రంగంలోకి దించుతాడు. ఎలాగైనా ఆ ట్రబుల్‌ను పరిష్కరించే విజయవంతమైన షూటర్‌గా అధినేతకు అతనిపై గట్టి నమ్మకం. ఇది ఒక్కప్పటి వరకు. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి.
ట్రబుల్ షూటరే స్వయంగా ట్రబుల్‌లో పడ్డాడు. ప్రస్తుత రాజకీయాలు ఆయన్ను వెంటాడుతున్నాయి. ఇంటా, బయట కలిసిరాని కాలంతో సమయం కోసం వేచిచూస్తున్నఆయనపై వరుస రాజకీయ ఉపద్రవాలు ముసురుకుంటున్నాయి. ట్రబుల్ షూటర్ పేరు మసకబారిపోగా.. తనకు ఆ క్రెడిబిలిటీ ఇవ్వటం ఇప్పుడు అతని బావమరిదికి ఏమాత్రం ఇష్టం లేదు. ట్రబుల్స్ ఎదుర్కొంటున్న ఆ ట్రబుల్ షూటర్ ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే.
తన్నీరు హరీశ్ రావు. రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకుని, కేసీఆర్‌కు నమ్మిన బంటుగా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఆ ప్రయార్టీ తగ్గుతోంది. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ పాత్రకు విలువ పెరుగుతున్న తరుణంలో.. హరీశ్ ప్రయార్టీ కూడా అంతే స్పీడుగా తగ్గుతూ వస్తోంది. కొన్ని పార్టీ అవసరాల కోసం, కొన్ని లిమిటెడ్ కార్యక్రమాల కోసం మాత్రమే హరీశ్ సేవలను ఇప్పుడు పార్టీ వినియోగించుకుంటున్నది.
ఇప్పుడు కొత్త ప్రమాదం వేటాడుతోంది ట్రబుల్ షూటర్‌ను. తన ఆయువు పట్టు సిద్దిపేట అడ్డాగా రాజకీయ దాడి జరుగుతోంది. ఓ వైపు కవిత.. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి .. ఇద్దరి టార్గెట్ ఇప్పుడు సిద్దిపేట. సిద్దిపేట భుజంపై తుపాకీపెట్టి హరీశ్ పై మాటల తూటాలు ఎక్కుపెడుతున్నారు. కవిత ఇప్పటికే సిద్దిపేట అడ్డగా హరీశ్‌రావు అవినీతి చిట్టాను విప్పి … రాజకీయాల్లో కొత్త చర్చకు తెర తీశారు.
చాలా మందికి హరీశ్ రావు ఒక కోణమే తెలుసు. కానీ ఆయనలోని మరో కోణాన్ని జనానికి చూపించే క్రమంలో కవిత తీసుకున్న స్టాండ్.. వ్యక్తిగతంగా అతన్నే కాదు.. ఆ పార్టీని కూడా ఇరుకున పెడుతోంది. సిద్దిపేట భుజంపై తుపాకీ పెట్టి హరీశ్‌ను వెంటాడుతున్న కవిత… అదే సమయంలో హరీశ్ భుజంపై తుపాకీ పెట్టి కేటీఆర్, కేసీఆర్‌లను కూడా కాల్చే ప్రయత్నం చేస్తున్నారు.
కాళేశ్వరంపై కవిత చేసిన కామెంట్లు ద్వారా ఇండైరెక్టుగా కేసీఆర్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించడమే కాదు.. తన మానస పుత్రికగా చెప్పుకునే ప్రాజెక్టును నిష్ఫలమేనని తేల్చి చెప్పడం చిన్న ఆరోపణ కాదు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు హరీశ్‌కు. నేరుగా తను రంగంలోకి దిగలేడు. కామెంట్స్ చేయలేడు. అతని తరుపున ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ వకాల్తా పుచ్చుకున్నా.. దానికి అంత క్రెడిబిలిటీ దొరకడం లేదు.
పైగా కవిత వర్గం ప్రవీణ్‌పై దాడి ముమ్మరం చేసే క్రమంలో బీఆర్‌ఎస్‌పై పైచేయి సాధిస్తున్నది. ఇప్పుడు 19న సీఎం సిద్దిపేట సభ కూడా హరీశ్‌లో కొత్త కలవరానికి కారణమవుతోంది. ఓవైపు కవిత.. నిన్ను వదల బొమ్మాళి..! అని శపథం పూని మరీ వెంటాడుతున్నారు. అవినీతి చిట్టాపై వెనక్కి తగ్గేదేలేదని, కోర్టులను ఆశ్రయిస్తానని తాజాగా ప్రకటించడం.. విషయం మరింత జఠిలమవుతున్నట్టు కనిపిస్తోంది.
కవితను ఎదుర్కోలేని హరీశ్.. సీఎం ధాటిని నిలువరించుకునేందుకు.. ముందుగా ఓ లేఖాస్త్రాన్ని సంధిస్తున్నాడు. ‘ఏం చేశావో చెప్పి మరీ సిద్దిపేటకు రా.. హామీలేమయ్యాయని, సాగునీటి దుస్థితికి కారణం మీరు కాదా?’ అనే ప్రశ్నలను సంధిస్తూ లేఖను విడుదల చేశారు. ఇదంతా సిద్దిపేట సభకు మరింత సీరియస్ స్థితినే తెచ్చిపెడుతున్నాయి. ఆ రోజు సీఎం ఏ మాట్లాడుతారోననే ఆసక్తి కూడా రాజకీయాల్లో వర్గాల్లో పెంచుతోంది.