Badvel constituency: తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న బద్వేలు నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్నారు. 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో సైకిల్ సత్తా చాటిన టీడీపీకి బద్వేలు నియోజకవర్గంలో మాత్రం ఓటమి తప్పలేదు. పార్టీ అధికారం లో ఉన్నప్పుడు నియోజకవర్గంలో పట్టు సాధించాల్సిన నేతలు వర్గ పోరుతో పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారట.. నియోజకవర్గం ఇన్చార్జ్ రితీష్‌రెడ్డికి వ్యతిరేకంగా బీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి గ్రూపు కడుతున్నారట.. దాంతో బద్వేలులో టీడీపీ పరిస్థితి మరింత దిగజారిపోతోందంట
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. వైఎస్ రాజశేఖరరెడ్డికి సొంత జిల్లాలో మింగుపడకుండా తయారైన నేతల్లో బిజివేముల వీరారెడ్డి ఒకరు. నియోజకవర్గం పేరును తన పేరుగా మార్చుకొని బద్వేల్ వీరారెడ్డిగా ఎన్టీఆర్ మంత్రి వర్గంలో పనిచేయడంతో పాటు రెండు దశాబ్దాలు జిల్లా రాజకీయాలు శాసించారు. టీడీపీ ఆవిర్బావం తర్వాత బద్వేల్ నియోజకవర్గాన్ని దివంగత వీరారెడ్డి పార్టీకి కంచుకోట మార్చారు. అయితే 2001 తర్వాత బద్వేల్ లో టీడీపీ ఇప్పటి వరకు గెలుపు రుచి చూడలేదు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ అక్కడ పాగా వేస్తూ వచ్చాయి.
వీరారెడ్డి వారసురాలిగా రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన కుమార్తె విజయమ్మ తండ్రి మరణం తర్వాత జరిగిన 2001 ఉప ఎన్నికల్లో గెలిచినా ఆ తర్వాత జరిగిన 2004 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. 2009 లో బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారడంతో విజయమ్మ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ గా కొనసాగుతూ వచ్చారు. తర్వత ఆమె కుమారుడు రితీష్‌రెడ్డి నియోజకవర్గం ఇన్చార్జ్‌గా భాద్యతలు చేపట్టినా టీడీపీ అభ్యర్థుల ఓటమి పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సొంత జిల్లాలో 7 సెగ్మెంట్లలో కూటమి జెండాలు రెపరెపలాడాయి. అయినా బద్వేల్ లో మాత్రం ఫ్యాన్ హవా కొనసాగింది. బద్వేల్ నుంచి వైసీపీ అభ్యర్థి దాసరి సుధ మరోసారి గెలిచి కూటమికి షాక్ ఇచ్చారు. ఇక్కడ సైకిల్ పార్టీ ఓటమికి నియోజకవర్గం ఇన్చార్జ్ రితీష్‌రెడ్డి వ్యవహార శైలే కారణమని పార్టీలో అంతర్గతంగా మొదలైన వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడిందట.. రితేష్ రెడ్డికి వ్యతిరేకంగా డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి గ్రూపు కట్టారని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. సంక్రాంతి పండగ సందర్బంగా ఇరు వర్గాల అనుచరులు పోటాపోటీగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. గెలిచిన టీంకు ప్రకటించిన రూ.30 వేలప్రైజ్ మనీ కాస్తా.. రెండువర్గాల పోటీతో 3 లక్షలకు చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
డీసీసీబీ చైర్మన్ సర్యనారాయణ రెడ్డి పార్టీ ఇన్చార్జ్‌తో విభేదించడంతో రితీష్ రెడ్డి వ్యతిరేక వర్గం సూర్యనారాయణరెడ్డి పక్కన చేరింది. దాంతో ఇద్దరి విభేదాలు మరింత రాజుకున్నాయి.. గత రెండు దశాబ్దాలుగా దివంగత వీరారెడ్డి కుటుంబసభ్యులు నియోజకవర్గం ఇన్చార్జ్ ఉన్నా పార్టీ గెలిచిన దాఖలాలు లేవని కొత్త వ్యక్తికి పార్టీ పగ్గాలు కట్టబెట్టాలనే వాదన పార్టీలో వినిపిస్తోందట. ప్రముఖ కాంట్రాక్టర్ సూర్యనారాయణ రెడ్డిని మొదట డీసీసీబీ చైర్మన్‌ను చేసి, ఆ తర్వాత బద్వేల్ ఇన్చార్జిగా చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే 2029 లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బద్వేల్ నియోజకవర్గం రిజర్వ్డ్ నుంచి జనరల్ గా మారే అవకాశం ఉంటుందని ఎవరికి వారు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోందట.. మరి సూర్యనారాయణ రెడ్డి, రితీష్ రెడ్డి మద్య మొదలైన రాజకీయ ఆధిపత్య పోరు ఎలాంటి మలుపు తిరుగుతుందో?
ALSO READ: జనసేన, టీడీపీ మధ్య కోల్డ్ వార్..!
Story by: Apparao, Big Tv