E-Paper
Advertisement

Vizag-Janasena: జనసేన, టీడీపీ మధ్య కోల్డ్ వార్..!

Vizag-Janasena: జనసేన, టీడీపీ మధ్య కోల్డ్ వార్..!

Vizag-Janasena: ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ సమీకరణలు రోజురోజుకీ మారిపోతున్నాయి… జిల్లాల్లోని నాలుగు కీలక నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నా అధికారం, ఆధిపత్యం సున్నా గానే కనిపిస్తుంది… జనసేన పార్టీ క్యాడర్లో ఎన్నికలకు ముందు ఉన్న అదే జోష్ తో కంటిన్యూ అవుతున్నా తాము గెలిచిన స్థానాల్లో మిత్రపక్షం హవానే కొనసాగుతుందని కిందిస్థాయి కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్బన్ నుండి రూరల్ వరకు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నా పార్టీకి గాని క్యాడర్‌కు గాని సరైన గుర్తింపు ఇవ్వడం లేదని నాయకులు సైతం మదన పడుతున్నారు… అసలు ఉమ్మడి విశాఖ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా జనసేన పార్టీకి వస్తున్న ఇబ్బందులు ఏంటి?

విశాఖలో జనసేన సత్తా.. 4 స్థానాల్లో ఘన విజయం

అంగ బలం, అర్థ బలం ఉన్నా, పేరుకి కూటమి భాగస్వామిగా పవర్లో ఉన్నా అధికారం మాత్రం కోరుకున్నంత లేదనడానికి ఉమ్మడి విశాఖ జనసేన పార్టీ ఎమ్మెల్యేలను చూస్తే అర్థమవుతుంది… ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ సౌత్, పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది … గెలిచిన ప్రతిచోట అత్యంత భారీ మెజారిటీతో గెలిచి జనసేన పార్టీ సత్తా చూపించింది… ప్రత్యర్థి వైసీపీని దరిదాపుల్లోకి రానివ్వకుండా ఒక్కొక్క ఎమ్మెల్యే 50వేల ఓట్లకు పైనే మెజారిటీ తెచ్చుకొని ఘనవిజయం సాధించారు….

జనసేనకు విజయం, కానీ టీడీపీ చిన్నచూపు

ఉమ్మడి విశాఖ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు గెలవడంతో జనసేన అధినేతతో పాటు సాధారణ కార్యకర్తల్లో కూడా ఆనందం ఆకాశాన్ని తాకింది. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు ఉండదని జనసైనికులు, చివరికి ఎమ్మెల్యేలు కూడా బహుశా గుర్తించలేకపోయి ఉండొచ్చు…. ఎందుకంటే ఎన్నికల్లో కూటమి పార్టీలతో జత కట్టిన జనసేన పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టినా పవర్ షేరింగ్ లో రోజు రోజుకి ఉమ్మడి విశాఖ జిల్లాలో వెనకబడిపోతున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవర్ షేరింగ్ విషయంలో టీడీపీ చిన్నచూపు చూస్తుందన్న వాదన విశాఖ జిల్లాలో ఎక్కువగా వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ పాలనలో కమాండర్ లేని బాధ

ఏపీకి ఆర్థిక రాజధానిగా ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన పార్టీ స్థాయి రోజురోజుకి తగ్గిపోతుందని సాధారణ కార్యకర్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల నుండి మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి కార్యకర్తలను సైతం ఎదగనీయకుండా టీడీపీ తొక్కేస్తుందని జనసైనికులు వాపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన విశాఖపట్నం, అనకాపల్లి లాంటి ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఉన్నా… టీడీపీ అధికారాన్ని చెలాయిస్తుందని జనసేన నాయకులు ఎవరికీ చెప్పుకోలేక మధనపడుతున్నారంట. పార్టీ అధిష్టానానికి చెప్పుకుందాం అనుకున్నా, పొత్తుధర్మం మేరకు, కూటమి ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీ క్యాడర్ మొత్తం పని చేయాలని స్వయానా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్తుండడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి జనసేన కేడర్ లో కనిపిస్తుందంట.

విశాఖ దక్షిణలో ప్రజల మధ్య గుర్తింపు సవాలు

కీలకమైన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా భారీ విజయం సాధించినా, ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా పట్టు సాధించడంలో కొంత వెనకబడే ఉన్నట్లు చర్చ నడుస్తోంది. కేవలం నియోజకవర్గం పరిధిలో ఉన్న అరకొర శంకుస్థాపనలు, మంత్రులు వస్తే నియోజకవర్గం లో జరిగే ప్రారంభోత్సవాలు తప్ప జనసేన పార్టీ పరంగా ప్రజలకు గుర్తుండిపోయే ఏ పని ఇప్పటివరకు చేయలేదంట.

జనసేనలో ఎమ్మెల్యే అమిత ప్రాధాన్యం

ఎమ్మెల్యేగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ కంటే టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న సీతంరాజు సుధాకర్ వైపే ఎక్కువమంది నియోజకవర్గాల్లోని ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో జనసేనలో అలజడి మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో ఎలాంటి ప్రజా సమస్యలు ఉన్నా సీతరాజు సుధాకర్ ఎంపీ భరత్ దృష్టికి తీసుకు వెళ్లి వాటిని పరిష్కరించడం, టీడీపీ క్యాడర్నుల కేడర్‌ను నిత్యం యాక్టివ్‌గా ఉంచుతుండటంతో .. ఆయనే అనధికార ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారంట.

పెందుర్తిలో టీడీపీ నాయకుల హవా

ఇక పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి జనసేన ఎమ్మెల్యేగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల్లో గెలిచినప్పడు తప్ప సాధారణ రోజుల్లో నియోజకవర్గంలో కనిపించకపోవడంతో అక్కడ జనసేన క్యాడర్ ఢీలా పడిపోతోంది. పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి కొనసాగడం, అదే ప్రాంతంలో విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు ఉండడం, పెందుర్తి నియోజకవర్గానికి కీలకమైన పరవాడ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామం కావడంతో నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ నేతల హవానే నడుస్తోందంట… ఆ క్రమంలో పెందుర్తి వాసులకు టీడీపీ నాయకులే పనులు చేయిస్తుండటంతో జనసేన ఎమ్మెల్యేకి ప్రాధాన్యత లేకుండా పోతోందంట. .

విజయ్‌కుమార్‌పై జనసేనలో విమర్శలు

యలమంచిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సుందరపు విజయ్‌కుమార్ పరిస్థితి కూడా దారుణంగా మారిందంట. జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గం లో విజయ్‌కుమార్‌పై ఎన్నో విమర్శలు రావడం, జనసేన కేడర్‌ను పట్టించుకోవడం లేదు అన్న అనే ప్రచారంతో పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదంట. నియోజకవర్గ ఎమ్మెల్యేపై వస్తున్న వివాదాలకు తోడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా కొనసాగుతున్న ప్రగడ నాగేశ్వరరావు, కీలకమైన నాయకుడుగా ఉన్న పప్పల చలపతిరావు ఇద్దరు టీడీపీ క్యాడర్‌ను బలోపేతం చేయడం…లోకల్ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు చేయిస్తుండడంతో జనసేన నేతల్ని పట్టించుకునే వారే లేకుండా పోతున్నారంట.

టీడీపీ నియోజకవర్గంలో సవాళ్లు ఎదుర్కొంటోంది

మరోపక్క అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన కొణతాల రామకృష్ణ పరిస్థితి నియోజకవర్గంలో కొంత బెటర్ గా కనిపిస్తోంది. నియోజకవర్గంలో జనసేనని కొణతాల రామకృష్ణ వర్గం స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నం చేస్తుందట. అనకాపల్లి నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా నియమితులైన బత్తుల తాతబ్బాయి మాడుగుల ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం ఆ పార్టీకి కొంత మైనస్‌గా మారిందంటున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే పీల గోవిందు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవిలో ఉండడంతో తన కేడర్‌కు పనులు చేస్తుండడంతో జనసేన పార్టీ కార్యక్రమాలకు కొంత ఇబ్బందిగా మారిందంట. దాంతో టీడీపీ క్యాడర్ నియోజకవర్గంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నా, కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో సన్నిహితంగా ఉండడంతో జనసేన పరిస్థితి బ్యాలెన్స్‌డ్‌గా ఉందంట.

నామినేటెడ్ పదవుల పంపిణీపై అసంతృప్తి

ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన నుండి నలుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో జనసేన క్యాడర్‌కు న్యాయం జరగడం లేదన్న ఆవేదన కార్యకర్తల్లో కనిపిస్తోంది. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో టిడిపి హవా కొనసాగడం, నామినేటెడ్ పదవులను కూడా ఎక్కువగా టిడిపి వాళ్ళకే కేటాయిస్తుండడంతో జనసేన పార్టీ అధినేత మాటను కాదనలేక, టీడీపీతో సమన్వయం చేసుకోలేక, పార్టీ నుండి బయటకు వెళ్ళిపోలేక గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఉన్న కార్యకర్తలంతా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారంట.

జనసేన పార్టీ స్థానాల క్షీణతకు హెచ్చరిక

ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నియోజవర్గాల స్థాయిలో జనసేన పార్టీకి పూర్తిగా ఇంపార్టెన్స్ లేకుండా చేస్తూ … ఆధిపత్యం చలాయిస్తున్న టీడీపీ నేతల విషయంలో ఆ పార్టీ అధిష్టానంతో మాట్లాడి సమన్వయం చేసుకోకపోతే.. భవిష్యత్తులో గెలిచిన ఎమ్మెల్యే స్థానాలను సైతం జనసేన కోల్పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరి జనసేనాని ఏ విధంగా దిద్దుబాటు చర్యలు చేపడతారో చూడాలి.

ALSO READ: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?

Story by: Apparao, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×