E-Paper
Advertisement

Bangladesh: భగ్గుమన్న బంగ్లాదేశ్.. ఎవరీ ఉస్మాన్ హాదీ

Bangladesh: భగ్గుమన్న బంగ్లాదేశ్.. ఎవరీ ఉస్మాన్ హాదీ

Bangladesh: బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది. నిరసన జ్వాలల్లో మండిపోతోంది. ఆందోళనకారుల అలర్లలో.. బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హత్యతో.. దేశమంతటా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్. అసలు.. ఎవరీ ఉస్మాన్ హదీ? అతను చనిపోతే.. దేశాన్నే అగ్నిగుండంగా మార్చేంత పరిస్థితులు ఎందుకొచ్చాయ్?

బంగ్లాదేశ్‌నే మండించిన ఒక్క హత్య

ఒక్క హత్య.. మొత్తం దేశాన్ని మండించింది! ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాలలు రేగేలా చేసింది. మొత్తం బంగ్లాదేశ్‌నే రణరంగంగా మార్చేసింది. స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో.. బంగ్లాదేశ్ భగ్గుమంది. విద్యార్థి ఉద్యమంతో.. షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలకపాత్ర పోషించిన షరీఫ్ ఉస్మాన్.. గుర్తుతెలియని దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో ఆగ్రహ జ్వాలలు ఎగశాయ్. నిరసనకారులంతా రోడ్డెక్కడంతో.. పరిస్థితులు అదుపుతప్పి హింసాత్మకంగా మారాయ్.

రాజ్‌షాహీలోని అవామీలీగ్‌ పార్టీ ఆఫీసు ధ్వంసం

బంగ్లాదేశ్‌‌లో కొద్దిరోజుల క్రితం జరిగిన కాల్పుల్లో ఇంక్విలాబ్‌ మంచ్‌ కన్వీనర్‌ షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హాదీ తీవ్రంగా గాయపడ్డాడు. అతను సింగపూర్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. దాంతో.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సహా.. దేశంలోని అనేక చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయ్. ఆందోళనకారులు అర్ధరాత్రి.. చత్తోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. భారత్, షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్‌షాహీలోని అవామీలీగ్‌ పార్టీ ఆఫీసుని నిరసనకారులు ధ్వంసం చేశారు.

జర్నలిస్టులపై దాడులు, చారిత్రక కట్టడాలకు నిప్పు

చిట్టగాంగ్‌ మాజీ మేయర్‌ మొహియుద్దీన్‌ నివాసానికి నిప్పు పెట్టారు. ఢాకాలోని చారిత్రక సాంస్కృతిక సంస్థ ఛాయానట్‌ ప్రాంగణాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. అంతేకాదు.. బంగ్లాదేశ్‌లోని పత్రికా కార్యాలయాలపైనా అల్లరిమూకలు దాడులు చేశాయి. ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది గంటల తరబడి శ్రమించి.. పదుల సంఖ్యలో జర్నలిస్టులను అగ్నికీలల నుంచి కాపాడారు. బెంగాలీ పత్రిక ప్రోథోమ్ అలో ఆఫీసుపైనా దాడి జరిగింది. దుండగులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన న్యూఏజ్ పత్రిక ఎడిటర్‌పైనా దాడి జరిగింది. బంగ్లాదేశ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ కుటుంబానికి చెందిన ఇంటిని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ప్రస్తుతం మ్యూజియంగా వాడుతున్న ఆ ఇంటిపైనా దాడులు చేశారంటే.. పరిస్థితులు ఏ స్థాయిలో అదుపుతప్పాయో అర్థం చేసుకోవచ్చు.

జాతీయ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం

బంగ్లాదేశ్‌లోని ఝల్‌కాతీ జిల్లాలో 1994లో ఉస్మాన్‌ హాదీ జన్మించాడు. ముందునుంచీ ఉద్యమ భావజాలంతో ఉండే ఉస్మాన్‌.. విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు. గతేడాది జులైలో అవామీ లీగ్‌ నేత, నాటి ప్రధాని షేక్‌ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో కీలక పాత్ర పోషించాడు. ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చిన ఇంక్విలాబ్‌ మంచ్‌ రాజకీయ సంస్థలో కన్వీనర్‌గా కీలక బాధ్యతలు చేపట్టాడు. కొన్నాళ్ల క్రితం భారత్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో చూపిస్తున్నట్లుగా ఉన్న మ్యాప్‌లను కూడా పంచినట్లు తెలుస్తోంది. షేక్ హసీనాను గద్దె దించే విషయంలో.. గతేడాది విద్యార్థుల తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించినా.. ప్రస్తుతం ఉన్న మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం.. ఇంక్విలాబ్ మంచ్‌ని రాజకీయ పార్టీగా గుర్తించలేదు. ఈ సంస్థ.. వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దాంతో.. ఉస్మాన్ హాదీ ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమయ్యాడు.

మెరుగైన వైద్యం కోసం సింగపూర్

ఢాకా-8 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన హాదీ.. డిసెంబరు 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. హాదీ ఆటోలో వెళ్తుండగా.. బైక్‌పై వచ్చి అతి సమీపం నుంచి హాదీపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయం కారణంగా.. అతని మెదడుకు తీవ్ర గాయమైందని డాక్టర్లు తెలిపారు. దాంతో.. మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌ తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ.. హాదీ ప్రాణాలు విడిచాడు.

హాదీ మరణవార్త.. బంగ్లాదేశ్‌లో అగ్రహజ్వాలలు

హాదీ మరణవార్త తెలియగానే.. బంగ్లాదేశ్‌లో ఆగ్రహజ్వాలలు మొదలయ్యాయి. ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్, ఇంక్విలాబ్‌ మంచ్‌ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారత్‌, అవామీలీగ్‌ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని మీడియా కార్యాలయాలు, అవామీలీగ్‌ ఆఫీసులకు నిప్పుపెట్టారు. దాంతో.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు హాదీ మృతికి గానూ బంగ్లా ప్రభుత్వం ఒకరోజు సంతాపదినం ప్రకటించింది.

భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక

ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్‌ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అక్కడున్న ఇండియన్స్, భారత విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఏదైనా.. ఎమర్జెన్సీ అయితే.. సాయం కోసం హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ ఆఫీసులను సంప్రదించాలని అడ్వైజరీలో కోరారు. మరోవైపు బంగ్లాదేశ్‌‌లో పరిణామాలపై భారత విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ స్పందించింది. బంగ్లాలో మైనార్టీలపై దాడుల గురించి తెలిసి.. విదేశాంగ శాఖ ఆందోళనతో ఉంది. తాత్కాలిక ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. బంగ్లాదేశ్‌లో.. వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలపైనా అనిశ్చితి నెలకొందని తెలిపింది.

బంగ్లాదేశ్‌లో పదే పదే ఎందుకు అల్లర్లు చెలరేగుతున్నాయ్? మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం దేశంలో శాంతిభద్రతలను కంట్రోల్ చేయలేకపోతోందా? షేక్ హసీనాని గద్దె దించిన తర్వాత బంగ్లా పరిస్థితి మరింత దారుణంగా తయారైందనే అభిప్రాయాలు ఎందుకు వినిపిస్తున్నాయ్? ఎన్నికల ముందు ఇంత విధ్వంసం దేనికి సంకేతం? ఇక.. బంగ్లాదేశ్‌ని ఎవ్వరూ బాగుచేయలేరా?

బంగ్లాలో పదే పదే అల్లర్లు ఎందుకు చెలరేగుతున్నాయ్?

రోజులు గడుస్తున్నకొద్దీ.. బంగ్లాదేశ్ ఓ అగ్నిపర్వతంలా తయారవుతోంది. గతేడాది ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ద్వారా.. షేక్ హసీనా సర్కార్ కూలిన తర్వాత.. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. దాంతో.. ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని ఆశించిన బంగ్లాదేశ్ ప్రజలకు.. ఇప్పటికీ అశాంతి, అనిశ్చితి, అల్లర్లు, ఆందోళనలు, నిరసనలు, విధ్వంసం, హింస మాత్రమే కనిపిస్తున్నాయ్. బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం, యూనస్ ప్రభుత్వ వైఫల్యాలు.. రానున్న రోజుల్లో ఎక్కడికి దారితీస్తాయన్నది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. బంగ్లాదేశ్‌లో ఏదో రకంగా, ఏదో ఒక అంశంపై.. పదే పదే అల్లర్లు జరుగుతూనే ఉన్నాయ్. ఆ దేశంలో అల్లర్లు ఆగకపోవడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయ్. అందులో మొదటిది.. పొలిటికల్ వాక్యూమ్.

హిందూ మైనారిటీలపై దాడులు, ఆలయాల ధ్వంసం..

షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్.. దాదాపు 15 ఏళ్లు పాలించి ఒక్కసారిగా పతనమైంది. ఆ పార్టీ శ్రేణులపై దాడులు, ప్రతీకారేచ్ఛ ఓ వైపు ఉండగా.. మరోవైపు ఇస్లామిక్ సంస్థలు తమ పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. హసీనా హయాంలో అణచివేతకు గురైన తీవ్రవాద, మతతత్వ శక్తులు.. ఇప్పుడు స్వేచ్ఛగా వీధుల్లోకి వస్తున్నాయి. ఇటీవల హిందూ మైనారిటీలపై జరిగిన దాడులు, ఆలయాల ధ్వంసమే దీనికి నిదర్శనం. ఇప్పుడు.. 2024 తిరుగుబాటులో కీలకపాత్ర పోషించిన స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యకు గురవడం.. దేశవ్యాప్తంగా మళ్లీ మంటలు రేపింది. అతని మరణానికి భారత్ కారణమని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం.. బంగ్లాదేశ్ ప్రజల్లో మరింత ఆగ్రహ జ్వాలలు రేగేలా చేస్తోంది.

మహ్మద్ యూనస్ ప్రభుత్వం విఫలం..

మరోవైపు.. బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలను నియంత్రించడంలో.. మహ్మద్ యూనస్ ప్రభుత్వం విఫలమవుతోంది. యూనస్ సర్కార్ తాత్కాలికం కాబట్టి.. పూర్తిస్థాయి సైనిక, పాలనాపరమైన నియంత్రణ కష్టమవుతోంది. పోలీసు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. హసీనా అనుచరులుగా ముద్రపడిన పోలీసులపైనా దాడులు జరిగాయ్. దాంతో.. వారు కూడా వీధుల్లోకి వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. సైన్యం రంగంలోకి దిగినా మొబిలైజేషన్ సరిగ్గా లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఎన్నికలు నిర్వహిస్తామని.. యూనస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. అప్పటివరకు ఈ అరాచక శక్తులను ఎలా అదుపు చేస్తారనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ముఖ్యంగా.. జమాత్-ఏ-ఇస్లామీ సంస్థపై నిషేధాన్ని ఎత్తేయడం, జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేయడం లాంటి చర్యలు.. యూనస్ ప్రభుత్వానికి మైనస్‌గా మారాయి. ఇప్పుడు జరుగుతున్న అల్లర్లలో వారి పాత్ర కూడా ఎక్కువగా ఉందనే వాదన గట్టిగా వినిపిస్తోంది.

బంగ్లాదేశ్‌లో మైనారిటీల రక్షణపై భారత్ ఆందోళన

షేక్ హసీనా పాలన ఎన్ని రకాల విమర్శలు, ఆరోపణలు ఉన్నా.. ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్‌లో.. స్థిరత్వం ఉండేది. కానీ.. ఇప్పుడు మైనారిటీలకు రక్షణ కరువైంది. హిందువులపైనా, వారి వ్యాపారాల పైనా దాడులు పెరిగాయ్. ఇదే.. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ ప్రతిష్ఠను దెబ్బతీసింది. ప్రభుత్వంపై విమర్శలు చేసే మీడియా కార్యాలయాలపైనా నిరసనకారులు దాడులకు తెగబడుతున్నారు. హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం, బంగ్లాదేశ్‌లో మైనారిటీల రక్షణపై భారత్ ఆందోళన వ్యక్తం చేయడం లాంటివి కూడా రెండు దేశాల మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తతలను పెంచాయ్. బంగ్లాదేశ్‌లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఈలోపే దేశాన్ని పూర్తిగా ఇస్లామీకరణ చేయాలనే పన్నాగం.. కొన్ని తీవ్రవాద, మతతత్వ శక్తుల్లో కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో.. అవామీ లీగ్ పాల్గొనకుండా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అదే గనక జరిగితే.. బంగ్లాదేశ్‌లో మరింత అశాంతి నెలకొనే ప్రమాదం ఉంది. అల్లర్లు ఇలాగే కొనసాగితే.. మళ్లీ సైన్యమే ప్రత్యక్షంగా అధికారాన్ని చేపట్టే అవకాశాలున్నాయ్.

వీలైనంత తొందరగా ఎన్నికలు జరగాలి..

బంగ్లాదేశ్ భవిష్యత్ ఇప్పుడు సందిగ్ధంలో ఉంది. ఆ దేశంలో పరిస్థితులు ఓ కొలిక్కి రావాలంటే.. వీలైనంత తొందరగా ఎన్నికలు జరిగిన.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరముంది. మత సామరస్యాన్ని పునరుద్ధరించాలి. మైనారిటీల భద్రతకు హామీ ఇవ్వాలి. మతవాద శక్తుల కంటే.. రాజ్యాంగబద్ధమైన పాలనకు ప్రాధాన్యత ఇవ్వాలి. రోజురోజుకు కూలుతున్న ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు.. అంతర్జాతీయ సహకారం తీసుకోవాలి. బంగ్లాదేశ్.. తన చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన మలుపులో ఉంది. మహ్మద్ యూనస్.. తాత్కాలిక ప్రభుత్వంలో సలహాదారుగా కాకుండా.. బలమైన నాయకుడిగా వ్యవహరించకపోతే.. బంగ్లాదేశ్ మరో అప్ఘానిస్థాన్, పాకిస్థాన్‌గా మారిపోతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.

Story by Anup, big Tv 

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×