Bangaladesh Pakistan on India: బంగ్లాదేశ్ నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తూర్పు పాకిస్తాన్ పేరును సార్థకం చేసుకోవాలని అనుకుంటుంది. యూనస్‌ని రబ్బర్ స్టాంప్ చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్మీ, గేమ్ అడుతున్నట్లు కనిపిస్తుంది. పరిస్థితులన్నీ ఈ కామెంట్లకు తగ్గట్లే ఉన్నాయ్. భారత్‌తో బంగ్లా సంబంధం క్షీణిస్తున్న నేపధ్యంలో.. పాకిస్తానీయులు బంగ్లాదేశ్ వెళ్లడానికి సెక్యూరిటీ క్లియరెన్స్ ఎత్తేశారు. బంగ్లా పాకిస్తాన్‌కు దగ్గరౌతుందనడానికి ఇది పెద్ద నిదర్శనంగా కనిపిస్తోంది. అంటే.. బంగ్లా, పాక్ కలిసి భారత్‌ను టార్గెట్ చేస్తున్నారా? అసలు, బంగ్లా చీఫ్ అడ్వైజర్ యూనస్ లక్ష్యం ఏంటీ..? బంగ్లాను మిలటరీ నడిపిస్తుందా..? అంతర్జాతీయ ఒత్తిడిని తగ్గించుకోడానికే నోబుల్ గ్రహీత యూనస్ చేతికి అధికారమిచ్చారా? బంగ్లా మరో ఇస్లామిక్ దేశంగా మారనుందా..?
పాకిస్తాన్‌కు మరింత దగ్గరవుతున్న బంగ్లాదేశ్
ఇండియా సహకారంతో స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్, భారత్‌కే ముప్పుగా మారుతుందనే సందేహం వస్తోంది. బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే.. భారత వ్యతిరేక పాకిస్తాన్‌కు మరింత దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయ్. విద్యార్థి ఉద్యమంతో మొదలైన బంగ్లాదేశ్ ఉద్రిక్తత.. తర్వాత, భారత వ్యతిరేక ఉద్యమంగా మార్పు చెందడం చాలా అనుమానాలను రేపింది.
బంగ్లాదేశ్ మిలటరీ కనుసన్నల్లో ఏర్పాటైన యూనస్ మధ్యంతర ప్రభుత్వం దీనికి మరింత ఆజ్యం పోసింది. నోబుల్ శాంతి బహుమతి పొందిన ముహమ్మద్ యూనస్.. తన దేశాన్ని తీవ్రమైన అశాంతి దిశగా నడిపే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా, యూనస్‌కి అధికారం వచ్చిన తర్వాత ఉగ్రవాదుల్ని పెంచి పోషించే పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ మరింత దగ్గరయ్యింది. పాకిస్తాన్ నాయకులతో పెరిగిన సంప్రదింపుల నుండీ పాక్‌తో చేసుకుంటున్న మిలటరీ ఒప్పందాల వరకూ చాలా అంశాల్లో పాక్-బంగ్లాదేశ్‌ల మధ్య బంధం బలపడుతూ ఉంది.
పాకిస్తాన్ నుండి భారీ సంఖ్యలో ఆయుధాల కొనుగోలు
ఇటీవల, బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి భారీ సంఖ్యలో ఆయుధాలను కొనుగోలు చేసింది. దీని తర్వాత, కొన్ని రోజుల క్రితమే, బంగ్లాదేశ్- భారత్ సరిహద్దుల్లో అత్యంత బలమైన వార్ డ్రోన్లను మొహరించింది. నిఘా కోసం మాత్రమే పెట్టామంటూ బొంకింది కూడా. ఇక, తాజాగా, మిలటరీ ఆదేశాలతో నడుస్తున్న యూనస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పాకిస్తానీయులు బంగ్లాదేశ్ రావాలంటే సెక్యూరిటీ క్లియరెన్స్ తప్పనిసరిగా ఉండేది. అలాంటిది, ఇప్పుడు ఆ క్లియరెన్స్ ఏమీ లేకుండానే వీసాలకు అనుమతి ఇచ్చేశారు.
క్లియరెన్స్ లేకుండానే పాకిస్తానీయులకు బంగ్లా వీసాలు
అంటే, పాక్ ఉగ్రవాదులు కూడా స్వేఛ్చగా బంగ్లాదేశ్‌లోకి అడుగుపెట్టడానికి ఎంట్రీ మరింత సులువుగా మార్చారు. బంగ్లాదేశ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ సర్వీసెస్ విభాగం.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లు ఆ దేశ స్థానిక మీడియా చెప్పింది. అయితే, ప్రభుత్వం నిర్ణయంపై అక్కడ నుండి ఎలాంటి కామెంట్లూ రాలేదు. గతంలో, తమ దేశంలోకి ఉగ్రవాదుల్ని రాకుండా అరికట్టడానికి చేసిన చట్టాన్ని ఇప్పుడు ఎందుకు ఎత్తేశారనే దానిపై ఎలాంటి విశ్లేషణా లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
2019 నుండి పాకిస్తాన్ పౌరులకు బంగ్లాదేశ్ వీసా విధానం
2019 నుండి.. పాకిస్తాన్ పౌరులు బంగ్లాదేశ్ వీసా పొందాలంటే బంగ్లా సెక్యూరిటీ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ నుండి “నో అబ్జెక్షన్” సర్టిఫికేట్ పొందాలి. ఆ సమయంలో పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న రాజకీయ, దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య భద్రతా ప్రోటోకాల్స్‌లో భాగంగా ఈ విధానం ప్రవేశపెట్టారు. అయితే, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పాకిస్తాన్-బంగ్లాదేశ్ సంబంధాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ విధానాన్ని రద్దు చేశారు. ఇకపై, సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం లేదంటూ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్‌లో కరాచీ నుండి చిట్టగాంగ్‌కు నేరుగా కార్గో నౌకల తరలింపును బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతించిన ఒక నెల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్
డిసెంబర్ 3న, బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధినేత బేగం ఖలీదా జియాను తన ఇంటిలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం ఈ ప్రకటన రావడం చర్చకు దారి తీసింది. దేశ భద్రతకు అవసరమైన ఈ చర్యను మాఫీ చేయడంపై చాలా మంది విమర్శలు కూడా చేస్తున్నారు. ఖలీదా జియా బంగ్లాదేశ్ ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక హోదాలో లేకపోయినప్పటికీ.. ఆమే సలహా మేరకే ఇది జరిగినట్లు కొందరు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో.. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ కనుసన్నల్లో గవర్నమెంట్ చీఫ్ సలహాదారుగా ఉన్న యూనస్ రబ్బర్ స్టాంప్‌లా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వస్తున్నాయి.
జూలై-ఆగస్టు అల్లర్ల వెనక “మాస్టర్ మైండ్” యూనస్
ప్రస్తుతం, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఉగ్రవాదులు, ఛాందసవాదులను అనుమతించే “ఫాసిస్ట్ పాలన” నడుస్తుందని ఆరోపించారు. డిసెంబర్ 8న లండన్‌లో విదేశీ అవామీ లీగ్ మద్దతుదారుల సమావేశానికి వర్చువల్‌గా చేసిన ప్రసంగంలో హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని కూలదోసిన జూలై-ఆగస్టు అల్లర్ల వెనక యూనస్ “మాస్టర్ మైండ్” ఉందని కూడా ఆమె ఆరోపించారు.
ఆగస్టు 5 నుండి, మైనార్టీలు, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధుల ప్రార్థనా స్థలాలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయనీ.. యూనస్ పాలనలో జమాత్, ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ విమర్శించారు. కాల్పులు, హత్యలకు పాల్పిడిన ఉగ్రవాదులు, నేరస్థులకు యూనస్ ప్రభుత్వం క్షమాభిక్ష కల్పిస్తోందని హసీనా ఆరోపించారు. హసీనా విడుదల చేసిన 37 నిమిషాల ఆడియో రికార్డింగ్‌ను బంగ్లాదేశ్ స్టూడెంట్స్ లీగ్, బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు.
దేశం చట్టపరమైన హక్కులను ఉల్లంఘిస్తుందన్న భారత్
అయితే, ఈ కీలక పరిణామల మధ్య తాజాగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ డిసెంబర్ 9న ఢాకా పర్యటించారు. అక్కడ, యూనస్‌తో సమావేశమైన మిస్రీ… బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రతపై ఆందోళనను తెలియజేశారు. “సాంస్కృతిక, మత, దౌత్యపరమైన ఆస్తులపై దాడులు చేయడం విచారకరమని” మిస్రీ, యూనస్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల, దేశ ద్రోహం కేసులో బంగ్లా పోలీసులు అరెస్ట్ చేసిన ఇస్కాన్ గురువు చిన్మోయ్ కృష్ణ దాస్ కేసును వాదించే న్యాయవాదిని కూడా కేసును వాదించకుండా నిరోధించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
దేశం చట్టపరమైన హక్కులను ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక, బంగ్లాదేశ్‌లో ప్రస్తుతమున్న పరిస్థితిపై యూరోపియన్ యూనియన్ కూడా స్పందించింది. యూనస్ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం చట్టపరమైన పాలనకు ప్రాధాన్యతనివ్వాలని, విధి విధానాలను గౌరవించాలని, దేశ పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాలని కోరింది. బంగ్లాదేశ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది.
బంగ్లాలో యూరోపియన్ యూనియన్ రాయబారి మైఖేల్ మిల్లర్
బంగ్లాదేశ్‌లోని యూరోపియన్ యూనియన్ రాయబారి మైఖేల్ మిల్లర్.. యూనస్‌తో పాటు బంగ్లా విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుస్సేన్, మరో 19 మంది యూరోపియన్ యూనియన్ దౌత్యవేత్తలతో ఢాకాలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా.. “మీరు ఏం చేస్తున్నారో విశ్లేషించుకోవాలనీ.. బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం చాలా ముఖ్యం” అని మిల్లెర్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే, ఫ్రాన్స్‌లోని పారిస్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ జస్టిస్ మేకర్స్ బంగ్లాదేశ్ కూడా.. దేశంలో హక్కుల ఉల్లంఘనను ఎదుర్కోవాలని గతంలో ఈయూ రాయబారులకు విజ్ఞప్తి చేసింది. ప్రముఖ ఫ్రెంచ్ మానవ హక్కుల కార్యకర్త, జస్టీస్ మేకర్స్ బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు అయిన రాబర్ట్ సైమన్, మాట్లాడుతూ.. ఇందులో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరారు.
భారత్ ఆందోళనలను లైట్ తీసుకుంటున్న బంగ్లాదేశ్
అయితే, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఢాకా పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ అసలు స్వరూపం స్పష్టంగానే అర్థమయ్యింది. మొన్నటి వరకూ భారత్ సహకారానికి ప్రాధాన్యత ఇచ్చిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్ ఆందోళనలను లైట్ తీసుకుంటున్నట్లు కనిపించింది. మిస్రీ అభ్యర్థనలను పట్టించుకోకపోగా… ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు భారత్ మీడియా చేస్తున్న పుకార్లు తప్ప మరోటి కాదన్నట్లు బంగ్లా విదేశాంగ శాఖ పేర్కొంది. యూనస్ సైతం దానికే వంత పాడినట్లు తెలుస్తోంది.
ఆపోహలను భారతదేశమే పరిష్కారించుకోవాలని యూనస్ సూచన
పొరుగు దేశాలతో బంగ్లాదేశ్ దౌత్య సంబంధం క్లోజ్‌గా, బలంగా ఉంటుందని చెబుతూనే రెండు దేశాల మధ్య ఉన్న ఆపోహలను భారతదేశమే పరిష్కారించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే, మాజీ ప్రధాని షేక్ హసీనాను ఇంకా భారత్‌లోనే ఉంచడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ… భారతదేశానికి వ్యతిరేకిగా.. చైనాకు అనుకూలంగా ఉన్న బంగ్లా ఆర్మీ చీఫ్, జనరల్ వాకర్-ఉజ్-జమాన్ ఆదేశాలమేరకే మహ్మద్ యూనస్ ప్రభుత్వం నడుస్తుందనే వాదన గట్టిగా ఉంది. అందుకే, భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు దగ్గరౌతుందని నిపుణులు కూడా భావిస్తున్నారు.