ఆ నియోజకవర్గంలో ఆ కుటుంబానిది 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. ఆ కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను ఆ కుటుంబమే నిర్వహిస్తూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం నమ్ముకున్న పార్టీయే ఆ ఫ్యామిలీకి ఝలక్ ఇచ్చింది. మొదటిసారి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు ఆ కుటుంబాన్ని కాదని కొత్త వ్యక్తికి దక్కాయి. ఇంతకీ ఆ కుటుంబం ఏది? వారి పెత్తనం కొనసాగిస్తున్న నియోజకవర్గంలో పార్టీ ఎందుకు హాండ్ ఇచ్చింది?
తమ్మినేని సీతారాం.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు ఉండరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తమ్మినేని సీతారం. వివిధ కేబినెట్‌లలో పలుమార్లు మంత్రిగా, వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్‌గా పని చేసారు. ముందు టిడిపిలో ఉన్న తమ్మినేని సీతారం తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఆ తర్వాత YSRCP లో చేరారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తరుపున ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆయనే బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు.
అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు సొంత పార్టీలో వర్గపోరు కొంత మేర ఇబ్బంది పెట్టింది. తమ్మినేని సీతారాంకి పోటీగా అతని నాయకత్వాన్ని కాదని నియోజకవర్గ కేంద్రంలో మూడు గ్రూపులు , మూడు పార్టీ కార్యాలయాలు కొనసాగాయి. తమ్మినేని నాయకత్వాన్ని కాదని ప్రచార విభాగం జోనల్ ఇంచార్జ్ చింతాడ రవి కుమార్ వేరుగా ఒక పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తే…. అదే కోవలో సువ్వారి గాంధీ వేరొక పార్టీ కార్యాలయాన్ని నిర్వహించారు. ఎవరికివారు వైసీపీ టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాలు వేరువేరుగా జరుపుతూ వచ్చారు. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో తమ్మినేనికి ఆముదాలవలస నియోజకవర్గ వైసిపి టికెట్ వస్తుందా లేదా అన్న సందిగ్ధం కూడా ఒక దశలో ఏర్పడినప్పటికీ టికెట్ మళ్ళీ తమ్మినేనికే దక్కింది.
గత ఎన్నికల్లో పోటీ చేసిన తమ్మినేని సీతారం టీడీపీ నుంచి పోటీ చేసిన తన సమీప బంధువు కూన రవిపై 20 వేల మెజార్టీకి తగ్గకుండా గెలుస్తానని సవాల్ చేశారు . ఒక వేళ మెజార్టీ తగ్గితే ఇక అవే తనకు చివరి ఎన్నికలని ప్రకటించారు. అయితే మాజీ స్పీకర్‌కి ఆశించిన మెజార్టీ కాదు కదా.. అసలు విజయమే దక్కలేదు. ఆ క్రమంలో తాజాగా ఇపుడు వైసీపీ అధిష్టానం తమ్మినేని కుటుంబానికి జలక్ ఇచ్చింది. ఆముదాలవలస నియోజకవర్గ వైసిపి సమన్వయకర్తగా చింతాడ రవికుమార్ పేరును ప్రకటించింది. తన పొలిటికల్ కెరియర్లో మొదటిసారి నియోజకవర్గ బాధ్యతలు తమ కుటుంబం నుండి చేజారిపోవటంతో పాటు తమ నాయకత్వాన్ని వ్యతిరేకించిన చింతాడ రవికుమార్ పార్టీ బాధ్యతలు కి దక్కటం పట్ల తమ్మినేని వర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది.
తమ్మినేని సీతారాం తన రాజకీయ వారసత్వాన్ని తన కుమారుడు, వైసిపి రాష్ట్ర యువజన విభాగం నేత చిరంజీవి నాగ్ కు ఇవ్వాలని ఎప్పటినుంచో ఆలోచనలో ఉన్నారు. ఇటీవల అధిష్టానం తమ్మినేనిని శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకులుగా నియమించడంతో ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పదవి ఖాళీ అయింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు తమ కుటుంబం నుంచి చేజారి పోకూడదని భావించిన తమ్మినేని కొద్ది రోజుల కిందట తన కుమారుడు చిరంజీవి నాగ్ తో కలిసి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి భేటీ అయ్యారు. ఆమదాలవలస నియోజకవర్గంతో తమ కుటుంబానికి దశాబ్దాలుగా ప్రత్యేక అనుబంధం ఉందని కావున తన కుమారుడికి ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలని జగన్‌ని తమ్మినేని కోరారంట.
తమ్మినేని ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమ్మినేనిని పార్లమెంట్‌కు పోటీ చేయాలని చెబుతూ…ఆముదాలవలస ఇన్చార్జి బాధ్యతలు వేరే వారికి ఇద్దామని చెప్పారట. అదే సమయంలో చిరంజీవి నాగ్ విషయం తాను చూసుకుంటానని జగన్ తెలిపారట. దాంతో చేసేదిలేక అక్కడి నుంచి వెనుతిరిగారంటాయన. తమ్మినేని కుటుంబాన్ని కాదని బయటివారికి ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇస్తున్నారని ఉప్పు అందినప్పటి నుండి వైసిపి ప్రచార విభాగం జోనల్ ఇంచార్జ్ చింతాడ రవికుమార్ , ఆముదాలవలస మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, సరుబుజ్జిలి ఎంపీపీ కిల్లి సత్యారావు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటూ వచ్చారు. అయితే పార్టీ అధిష్టానం చింతాడ రవి కుమార్ వైపే మొగ్గు చూపింది.
తమ్మినేని సీతారాం, ఆయన మేనల్లుడు, ఆముదాలవలస టిడిపి ఎమ్మెల్యే కూన రవికుమార్లు అవగాహన రాజకీయాలు చేస్తూ… బయటకు మాత్రం ప్రత్యర్థులుగా తిట్టుకుంటూ నియోజకవర్గంలో కుటుంబపాలన నిర్వహిస్తున్నారని ముందు నుండి చింతాడ రవికుమార్ ఆరోపిస్తూ వచ్చారు. ఒకవైపు తమ్మినేని నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే మరోవైపు అధిష్టాన పెద్దలను ఎప్పటికప్పుడు టచ్ చేస్తూ సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. దీనికి తోడు నియోజకవర్గంలో ఉన్న మూడు గ్రూపులలో సువ్వారి గాంధీ తనను కాదని మళ్లీ తమ్మినేనికే 2024 ఎన్నికల్లో టికెట్ కేటాయించడంతో పార్టీకి రిజైన్ చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి 10వేలకు పైగా ఓట్లు దక్కించుకున్నారు. అయితే పార్టీ అధిష్టానంపైన తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీకి సువ్వారి రాజీనామా చేయటంతో చింతాడ రవికి మరింతగా లైన్ క్లియర్ అయిందంటున్నారు.
మరోవైపు తనతో పాటు ఇన్చార్జ్ పదవిని ఆశిస్తున్న బొడ్డేపల్లి రమేష్ కుమార్, కిల్లి సత్యనారాయణల ఇంటికి చింతాడ రవి ఇటీవల స్వయంగా వెళ్లి ఎవరికి టికెట్టు వచ్చిన పార్టీ అభివృద్ధికంతా కలిసి కృషి చేద్దామని ఐక్యతరాగాన్ని వినిపిస్తూ రాజకీయ చతురతను ప్రదర్శించాడు. ప్రచార విభాగం జోనల్ ఇంచార్జ్ గా, 2024 ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గ పార్టీ పరిసీలికునిగా ఉన్న చింతాడ రవి గతంలో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 20 వేల ఓట్లు సాధించుకొని ఆ తరవాత వైసిపి లో చేరి జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యాడు.
గత కొన్నేళ్లుగా అసెంబ్లీ ఎన్నికలు అంటే ఆముదాలవలస నియోజకవర్గంలో మామ తమ్మినేని, మేనల్లుడు కూన రవి మధ్యే పోరు జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి తమ్మినేని కుటుంబం నుంచి నియోజకవర్గ ఇన్చార్జ్ పగ్గాలు కొత్త వ్యక్తికి ఇవ్వడంతో ఆముదాలవలస పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. నియోజకవర్గ ఇన్చార్జిగా తన పేరు ప్రకటించిన వెంటనే చింతాడ రవి తమ్మినేని నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి… ఆయన సహకారాన్ని కోరారు. అయితే ఇకపై తమ్మినేని తీరు ఎలా ఉంటుంది అనేది అందులోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
సీతారాం గతంలో సమన్వయకర్తగా ఉండగా ఆయన నాయకత్వాన్ని కాదని చింతాడ రవి వేరే పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలను వేరుగా జరుపుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు తన కుమారుడు చిరంజీవి నాగ్ కు ఇంచార్జ్ పదవి కోసం యత్నించి భంగపడ్డ తమ్మినేని కుటుంబం చింతాడ రవికి పూర్తిగా సహకరిస్తారా అన్నచర్చ ఆమదాలవలస నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. చింతాడ రవికుమార్ కి. నియోజకవర్గం భాద్యతలు ఇవ్వకముందు పార్టీ తరపున తమ్మినేని కొన్ని కార్యక్రమాలలో పాల్గొనేవారు. అయితే రెండు మూడు నెలలుగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాలకు సీతారాం హాజరుకాలేదు.
Also Read: విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 15 వేలు.. ప్రభుత్వం కీలక ప్రకటన
తనను ఆమదాలవలస నియోజకవర్గం భాద్యతల నుంచి తొలిగించడమే కాకుండా తన కుమారుడికి కూడా ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయ కర్తగా అవకాశం ఇవ్వకపోవడం పై అలకబూనారనే వాదన నియోజకవర్గం లో బలంగా వినిపిస్తుంది. తమ్మినేని సీతారాం జనసేన వైపు వెళతారానే వాదన కుడా జిల్లాలో జోరుగా సాగింది. మరో వైవు తన కుమారుడు నాగ్ ని కూడ జనసేన పార్టీ లోకి పంపిస్తారనే గుసగుసలు కూడా వినిపించాయి. సుమారు గా రెండు నెలలు నుంచి తమ్మినేని సీతారాంతో పాటు తను కుమారుడు కూడా నియోజకవర్గం లో కనిపించపోవడం దానికి బలం చేకూర్చినట్లయింది.
ఇటీవల అముదాలవలస వచ్చిన తమ్మినేని సీతారం ఇంటికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వచ్చారు .. సీతారంని పార్టీ మారకుండా ఓదార్చేంందుకు వచ్చారనే వార్త ఒక్కసారి గా నియోజకవర్గంలో గుప్పుమంది. అయితే తన కుమారుడికి చికిత్స అయింది. పరామర్శ కోసమే బొత్స వచ్చారని మాజీ స్పీకర్ తమ్మినేని క్లారిటీ ఇచ్చారు. తాను జనసేనలో చేరుతాననే వార్తల్లో నిజం లేదని తమ్మినేని చెప్పుకొచ్చారు, ఎవడైనా జనసేన పార్టీలో చేరుతారా..అని వెటకారమాడిన తమ్మినేని పార్టీ మారతాననే వార్తలను తిప్పికొట్టారు. చూడాలి మరి ఆయన ఫ్యూచర్ స్టెప్స్ ఎలా ఉంటాయో?