Game Changer Trailer Launch: మామూలుగా సినీ సెలబ్రిటీలు ఎక్కడైనా వస్తున్నారని తెలిస్తే చాలు.. ప్రేక్షకులంతా వారిని చూడడానికి భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఇక స్టార్ హీరోలు ఏదైనా ఈవెంట్‌కు వస్తున్నారని తెలిస్తే ఆ హడావిడి మామూలుగా ఉండదు. అలా హడావిడి చేయడం వల్లే ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతిచెందింది. ఇన్నేళ్లలో అలా ఎప్పుడూ జరగలేదు. దానివల్ల ఒకరి ప్రాణం పోయింది. దీంతో అప్పటినుండి పోలీసులతో పాటు సినీ సెలబ్రిటీల్లో కూడా జాగ్రత్త పెరిగింది. తాజాగా జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ కోసం బందోబస్తు పెరిగింది.
ఎన్నో జాగ్రత్తలు
గత కొన్నాళ్లుగా చాలావరకు చిన్న చిన్న సినిమా ఈవెంట్స్ అన్నీ ఏఎమ్‌బీలోనే జరుగుతున్నాయి. సినీ సెలబ్రిటీలు రావడానికి, సౌకర్యంగా అందరితో మాట్లాడడానికి అదే బెటర్ అని ఆ ప్లేస్‌ను ఎంచుకుంటున్నారు. అలాగే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఏఎమ్‌బీలోనే జరుగుతుందని ప్రకటన వచ్చింది. దీంతో రామ్ చరణ్‌ను అక్కడ చూడొచ్చని భారీగా ఫ్యాన్స్ ప్లాన్ చేశారు. కానీ పోలీసులు, ఏఎమ్‌బీ సిబ్బంది, సెక్యూరిటీ అంతా కలిసి అలా జరగనివ్వలేదు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం ముందు నుండే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటనను దృష్టిలో పెట్టుకొని వారు మరింత జాగ్రత్తగా ఉన్నారు.
Also Read: దుమ్ములేపుతున్న ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్.. 25 నిమిషాల్లోనే రికార్డు బ్రేక్
లోపలికి అనుమతి లేదు
ఏఎమ్‌బీ అనేది థియేటర్ కావడంతో రామ్ చరణ్ అక్కడికి వస్తున్నారని తెలిసి టికెట్లు లేని ప్రేక్షకులు కూడా అక్కడికి వచ్చారు. కానీ అక్కడి సిబ్బంది మాత్రం వారిని లోపలికి రానివ్వలేదు. కేవలం టికెట్లు ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతినిచ్చారు. థియేటర్ ఎంట్రెన్స్‌లోనే భారీగా పోలీసులు, బౌన్సర్లు ఉన్నారు. అలా వారి సాయంతో రామ్ చరణ్, రాజమౌళి, శంకర్.. ప్రశాంతంగా వచ్చి ట్రైలర్ లాంచ్ చేసుకొని వెళ్లారు. ఇదంతా చూస్తుంటే సంధ్య థియేటర్ ఘటన తర్వాత సినీ సెలబ్రిటీల్లో కూడా జాగ్రత్తలు పెరిగాయని తెలుస్తోంది. మళ్లీ అలాంటి ఘటన జరిగితే కచ్చితంగా సినీ పరిశ్రమపై భారీ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే సంధ్య థియేటర్ ఘటన ఎన్నో పరిణామాలకు దారితీసింది.
అప్పుడలా జరిగింది
డిసెంబర్ 4న ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ను మూవీ టీమ్‌తో కలిసి చూడాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారు. దానికోసం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ను ఎంచుకున్నారు. థియేటర్‌కు వచ్చే దారిలో రోడ్ షో చేశారు. దీంతో ప్రీమియర్ షో టికెట్లు లేని ప్రేక్షకులు కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్‌ను చూడాలని రోడ్ మీద ఉన్న ప్రేక్షకులు కూడా థియేటర్‌లోకి వచ్చేశారు. అలా హఠాత్తుగా తొక్కిసలాట జరిగింది. అక్కడ బందోబస్తుగా పోలీసులు ఉన్నా కూడా ఇంతమంది జనాలను ఒకేసారి కంట్రల్ చేయడం వారి వల్ల కాలేదు. అలా తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందింది.