Bihar Election Result 2025: భారత రాజకీయాల దృష్టిని బీహార్ వైపు తిప్పిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఏ కూటమిని గద్దె దించుతామన్న ప్రతిపక్షాల అంచనాలను బీహార్ ఓటర్లు పూర్తిగా తిప్పికొట్టారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలు అంచనాలను మించి 200లకు పైగా స్థానాలను గెలుచుకున్నాయి. బీహారీలు.. వన్స్ మోర్ నితీష్ కుమార్ అంటూ తీర్పు చెప్పారు. ఫలితంగా ఎన్డీయే కూటమి మరోసారి అధికారాన్ని చేపట్టబోతోంది.
ఓట్ చోరీ ఆరోపణలను పట్టించుకోని ప్రజలు..
బీహార్‌లో హోరాహోరీగా సాగిన ఎన్నికలు చివరికి ఎన్డీఏ కూటమిని విజేతను చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ.. రకరకాల ఆరోపణలు చేసిన బీహార్ ప్రజలు వాటిని పట్టించుకోలేదు. అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేశారు. తద్వారా నితీష్ కుమార్, నరేంద్ర మోడీ నాయకత్వానికి మరోసారి జై కొట్టారు.. వాస్తవానికి బీహార్ ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ ఇలా వస్తుందని అంచనా వేయలేదు. RJD అసలు ఊహించలేదు. అందుకే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయఢంకా మోగించింది. 200లకుపైగా సీట్లతో NDA కూటమి తిరుగులేని విక్టరీని అందుకుంది. సర్వే సంస్థలు అంచనా వేసినట్టే.. నితీశ్, మోడీ జోడీ వైపు మొగ్గు చూపారు బీహార్ ఓటర్లు. ఓవైపు నితీశ్ కుమార్ ఎప్పటికప్పుడు కూటములను మార్చేసే అలవాటున్నా.. ఆయన చేసే అభివృద్ధి మంత్రం ముందు ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. పైగా కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ అత్యంత కీలక భాగస్వామిగా ఉంది.
ప్రజల నమ్మకాన్ని పొందలేని మహాఘట్‌బంధన్
ఫలితంగా బీహార్‌కు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుల్లో పెద్ద పీట వేస్తున్నారు ప్రధాని మోడీ. దీంతో.. మరోసారి ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే రాష్ట్రం మరింతగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని విశ్వసించారు బీహార్ ప్రజలు. ఇక, మహాగట్ బంధన్ మాత్రం ఏ దశలోనూ ప్రజల నమ్మకాన్ని చూరగొనలేకపోయింది. కేవలం జేడీయూ, బీజేపీపై పసలేని విమర్శలు చేయడం మినహా మరేమీ చేయలేని పరిస్థితి. పోనీ, అవినీతి ఆరోపణలు చేద్దామంటే వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చూసుకున్నారు సీఎంగా ఉన్న నితీశ్ కుమార్. దీనికితోడు తమ కూటముల మధ్య ఓట్ షేర్ బదిలీ చేయించుకోవడంలోనూ మహాగట్ బంధన్ సఫలీకృతం కాలేకపోవడం మైనస్‌గా మారింది.
1951 తర్వాత బీహార్ చరిత్రలోనే ఇదే అత్యధికం
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మొత్తంగా 67.13శాతం ఓటింగ్ నమోదైంది. 1951 తర్వాత బీహార్ చరిత్రలోనే ఇదే అత్యధిక పోలింగ్ కావడం విశేషం. ఇంతటి భారీ పోలింగ్ కారణంగా ప్రభుత్వం మారుతుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా ఉందని అంతా అంచనా వేశారు. కానీ.. ఎన్నికల ఫలితాల రోజున ఆ అంచనా పూర్తిగా తారుమారు అయ్యింది. ఈ ఫలితాలను బట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు ఎక్కువ పోలవ్వలేదని తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ మీడియా, ఇతర సర్వేలు ఎన్డీఏ కూటమి విజయాన్ని అంచనా వేశాయి. బిహార్ లో పురుషుల కంటే మహిళలు ఓట్ల పండుగలో పాల్గొన్నారు. దాంతో ఆ ఓట్లన్నీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు సహకరించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది ఎన్డీఏ కూటమికి బెనిఫిట్‌గా మారిందని తెలుస్తోంది. నితీష్ కుమార్ కు ముఖ్యంగా మహిళల ఓట్లు అనుకూలంగా ఏకపక్షంగా పడినట్లు కనిపిస్తుంది.
ఎన్డీఏ కూటమికి బెనిఫిట్‌గా మహిళల ఓట్లు..
నితీష్ కుమార్ ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేయడంతో అనేక కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. అలాగే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నితీష్ కుమార్ పది వేల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేయడం కూడా కూటమికి కలిసి వచ్చింది. దాంతో నితీష్ పట్ల మహిళల్లో ఆదరణ పెరిగిందని.. అది ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపిందని తెలుస్తోంది. అటు యువ నాయకుడు, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్‌కు ఈ ఎన్నికలు నిరాశనే మిగిల్చాయి. మహిళలకు 30వేలు ఇస్తామని తేజస్వి యాదవ్ ప్రకటించినా.. ఆ హామీ ప్రభావం పెద్దగా చూపలేకపోయింది. అప్పటికే మొదటి దశ పోలింగ్ ముగియడంతో ఆ వాగ్దానం నీరుగారిపోయింది.
త్వరలో ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు..
నిజంగా అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ విజయం ఆ కూటమికి మంచి బూస్ట్ ఇచ్చినట్లే. త్వరలోనే ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ వేవ్ తో వెళ్లాలంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజీపీ అలయన్స్ గెలవడం ముఖ్యమైంది. ఏకపక్షంగా బీహార్ ఓటర్లు బీజేపీ కూటమికి పట్టం కట్టారు. అందుకే 243 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బీహార్ అసెంబ్లీలో దాదాపు రెండువందలకుపైగా స్థానాలు గెలవడం అంటే వార్ వన్ సైడ్ అనే చెప్పాలి. నిజానికి బీహార్ లో మోడీ, నితీష్ కుమార్ కాంబినేషన్ బాగా వర్క్ అవుట్ అయింది. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు కూడా బాగా పనిచేశాయి. సీమాంచల్ లో ఆర్జేడీకి పట్టుంది. అలాంటి ప్రాంతంలోనూ బీజేపీ, జేడీయూలు గెలవడమంటే ప్రజలు ఇక ఎన్డీఏ కూటమికి తిరుగులేని విజయాన్ని అందించారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎన్డీఏ కూటమి ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్లింది. సీట్ల సర్దుబాటులోనూ ఎలాంటి అలకలు, ఇబ్బందులు లేకుండా చూసుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ను ప్రకటించింది. అదే సమయంలో అన్ని సామాజికవర్గాల నేతలను దగ్గరకు తీసుకుని ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం ఎన్డీఏ కూటమి చేసింది. ఇక పోల్ మేనేజ్ మెంట్ విషయంలో కానీ, ప్రచారంలో కానీ బీజేపీ కూటమి మహా ఘట్ బంధన్ కంటే ముందంజలో ఉంది. ఆర్జేడీ వస్తే అవినీతి పెరుగుతుందన్న బీజేపీ అందులోనూ మోడీ పదే పదే చేసిన ప్రచారం ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లింది. అన్నీ కలిసి బీజేపీ కూటమిని కలసి వచ్చినట్లే కనిపిస్తుంది. మొత్తం మీద, ఈ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత కన్నా… నితీష్ కుమార్ పరిపాలనపై మహిళల బలమైన ఆదరణ, మోడీపై నమ్మకం ఎన్డీఏ కూటమికి చారిత్రక విజయాన్ని అందించాయని పొలిటికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
కాలం మారింది, కథ మారింది. దశాబ్దాలుగా ఈ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ నేడు దేశవ్యాప్తంగా తన పట్టును కోల్పోతూ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2004కు ముందు ఒకలా, 2014 తర్వాత మరోలా కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీజేపీ ఆధిపత్యం పెరిగిన తర్వాత… ఒకప్పుడు అధికారాన్ని పంచిన కాంగ్రెస్, నేడు ప్రాంతీయ పార్టీల సహకారం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితికి చేరింది.
ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలకు తల్లిలా ఉన్న కాంగ్రెస్.. నేడు వాటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితికి చేరుకుంది. నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ హయాం వరకు… కాంగ్రెస్కు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగులేని స్థానం ఉండేది. కానీ రానురాను రాహుల్ గాంధీ జమానాకు వచ్చే సరికి ఆ పట్టు పూర్తిగా సడలిపోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ పిడికిలి బిగించి గెలిచిన రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ, ఒడిశా వంటి చోట్ల పార్టీ దాదాపు ఉనికి కోల్పోయింది. పదేళ్లు దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో బలాన్ని పెంచుకోలేకపోయింది. బలమైన సంస్థాగత నిర్మాణం లేకపోవడం, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించలేకపోవడం ఈ పతనానికి ప్రధాన కారణం. బీజేపీని తట్టుకోవడానికి ప్రాంతీయ పార్టీలతో కలిసి వెళ్లాలనే కాంగ్రెస్ వ్యూహం.. ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యంగా మారింది.
దారుణంగా పడిపోయిన కాంగ్రెస్ సీట్లు..
అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలు ఇచ్చే సీట్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పొత్తుల కారణంగా కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో సొంతంగా పుంజుకునే అవకాశం లేకుండా పోతోంది. బీహార్ లో ఆర్జేడీ వంటి పార్టీలు బలపడటానికి కాంగ్రెస్ పరోక్షంగా కారణమైంది. మహాఘట్ బంధన్‌లో భాగమైనప్పటికీ, కాంగ్రెస్ స్థానాలు దారుణంగా పడిపోతున్నాయి. ఇక మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పొత్తులతోనే బరిలోకి దిగింది. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ జాతీయ పార్టీగా ఒంటరిగా పోటీ చేసే సత్తాను నిలుపుకోగలిగింది. ఒకప్పుడు రాష్ట్రాల్లో ఉన్న బలమైన నాయకత్వం రానురాను బలహీనంగా మారింది. రాష్ట్ర నేతలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేకపోవడం, కేంద్ర నాయకత్వంపై అధికంగా ఆధారపడటం ఇబ్బందికరంగా మారింది. బలమైన కాంగ్రెస్ నేతలు విడిపోయి ప్రాంతీయ పార్టీలు పెట్టుకోవడం కూడా పార్టీకి భారీ నష్టం చేకూర్చింది.
తేజస్వీ యాదవ్‌కు మళ్లీ సీఎం కుర్చీ దూరం..
బీహార్ రాజకీయాల్లో యువ నాయకుడిగా ఎదిగిన తేజస్వీ యాదవ్‌కు మళ్లీ సీఎం కుర్చీ దక్కే అవకాశాలు దూరమయ్యాయి. 2017 తర్వాత ఇది ఆయనకు సీఎం అయ్యే అవకాశం చేజారిన మూడో ప్రధాన సందర్భం. రెండు సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినా, రాజకీయం మారిన ప్రతిసారి ఆయన స్వప్నం నెరవేరకుండా ఉంది. 2017లో తేజస్వీకి సీఎం పదవి అతి చేరువలోకి వచ్చి మళ్లీ దూరమైంది. 2015 ఎన్నికల్లో ఆర్జేడీ,జేడీయూ,కాంగ్రెస్ మహాఘట్‌బంధన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాగా, తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే తేజస్వీపై వచ్చిన అవినీతి ఆరోపణలను కారణంగా చూపుతూ నితీష్ అకస్మాత్తుగా కూటమి నుంచి నిష్క్రమించారు. వెంటనే జేడీయూ ఎన్డీయేలో చేరడంతో తేజస్వీ పదవి కోల్పోయి ప్రతిపక్ష నాయకుడిగా మారారు. ఈ నిర్ణయంతో ఆయనకు సీఎం అయ్యే అవకాశం పూర్తిగా తగ్గిపోయింది. తేజస్వీకి రెండో పెద్ద అవకాశం 2020 ఎన్నికలు. నిరుద్యోగం, 10 లక్షల ఉద్యోగాల వాగ్దానంతో ఆయన భారీ ప్రచారం నిర్వహించారు. ఆర్జేడీ 75 సీట్లను గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే కూటమిలో కీలకపాత్రలో ఉన్న కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితమవడంతో మహాఘట్‌బంధన్ మెజారిటీ మార్కు చేరుకోలేదు. కాంగ్రెస్ పర్ఫామెన్స్ కారణంగా కూటమి కీలక సీట్లను కోల్పోయింది. ఫలితంగా ఎన్డీయే 125 సీట్లతో తిరిగి అధికారాన్ని కాపాడుకుంది. కేవలం కొన్ని సీట్లు దూరంలోనే తేజస్వీకి సీఎం పదవి మళ్లీ చేజారిపోయింది.
ప్రజల దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ కిశోర్
అయితే ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ప్రశాంత్ కిశోర్. ఎన్నికల వ్యూహకర్త నుండి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ .. జన సురాజ్ పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే పీకే పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కింగ్ కాకపోయినా, కనీసం కింగ్ మేకర్‌గా ఎదగాలనే ఆయన వ్యూహం తుడిచిపెట్టుకుపోయింది. ఇది కేవలం పీకే వ్యక్తిగత వైఫల్యంగానే కాకుండా, ఆధునిక భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్రపై ఆధారపడిన పార్టీలన్నింటికీ ఓ గుణపాఠం అని చెప్పొచ్చు. 2014లో నరేంద్ర మోడీ, 2015లో నితీష్ కుమార్, 2017లో అమరీందర్ సింగ్, 2019లో జగన్మోహన్ రెడ్డి, 2021లో మమతా బెనర్జీ… ఇలా అనేక రాష్ట్రాల్లో, వివిధ సిద్ధాంతాలు కలిగిన రాజకీయ నాయకులను అధికారంలోకి తీసుకురావడంలో పీకే వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. అయితే, వ్యూహకర్తగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన పీకే, స్వయంగా రాజకీయ నేతగా మారిన తర్వాత మాత్రం ఘోర వైఫల్యాన్ని చవిచూశారు.
ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది.
బీహార్‌లో తన పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. కనీసం 7-8 శాతం ఓట్లను సాధించవచ్చని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా, ఆ అంచనాలు కూడా తప్పాయి. చివరికి, పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు కూడా రాలేదు. దీంతో ప్రశాంత్ కిశోర్‌కు చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. కేవలం వ్యూహాలు, ప్రచారం, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ ద్వారా అధికారం లభించదని ప్రశాంత్ కిశోర్ స్టోరీ తెలియజేస్తోంది. ప్రజాబలం, పార్టీ నిర్మాణం, నాయకులపై నమ్మకం అనే పునాదులు బలంగా ఉంటేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి రాగలదని నిరూపించింది. బీహార్ ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ బొక్కబోర్లా పడటానికి అనేక కారణాలున్నాయి. ఎన్నికల ముందు పీకే చేసిన పాదయాత్రలు, క్షేత్రస్థాయి పర్యటనలు మీడియాలో హైలైట్ అయ్యాయి. కానీ, ఎన్నికల్లో గెలుపుకు అవసరమైన బలమైన సంస్థాగత నిర్మాణం, ప్రతి బూత్‌లో పనిచేసే కార్యకర్తల వ్యవస్థ జన సురాజ్‌కు కొరవడింది.
Also Read: జమ్మూకశ్మీర్‌లో బాంబ్ బ్లాస్ట్.. స్పాట్‌లో 37 మంది!
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టినప్పటికీ, ఆ ఉద్యమం ఎన్నికల ఫలితాలపై ఆశించినంత ప్రభావం చూపలేదని స్పష్టమవుతోంది. బీహార్ వంటి రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోవడం వంటి పరిణామాలు పాదయాత్ర సృష్టించిన ఉత్సాహాన్ని ఓట్లుగా మలచడంలో పార్టీ విఫలమైందని సూచిస్తున్నాయి. అయితే, కర్ణాటక, తెలంగాణ విజయాలు… కాంగ్రెస్‌కు ఇంకా పుంజుకునే సత్తా ఉందని నిరూపించాయి. ఈ మోడల్‌ను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసి, సంస్థాగత బలాన్ని పెంచుకోగలిగితేనే.. కాంగ్రెస్ పార్టీ భారత రాజకీయాల్లో తన స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతుంది. లేదంటే, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల నీడలో మసకబారక తప్పదు అనేది రాజకీయ పండితుల మాట.
Story By Venkatesh, Bigtv