భారత్ సామర్థ్యమే పాశ్చాత్య దేశాలను భయపెడుతుందా?
భారత్… ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కలవరిస్తున్న పేరు. ఒక విధంగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అత్యంత వేగంగా పరుగులు పెడుతున్న దేశం కూడా భారతదేశమే. ప్రపంచ ఉద్రిక్తతల మధ్య శాంతి జెండాను పట్టుకొని, సగర్వంగా ముందుకు నడుస్తున్న దేశం. అంతర్జాతీయ వేదికలపై అగ్రదేశాలతో సమానమైన స్థానాన్ని దక్కించుకుంటున్న దేశం. కరోనాతో ప్రముఖ దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లకల్లోలం అయితే భారత్ మాత్రమే నిర్భయంగా పాలన సాగించింది. అయితే, ఈ సామర్థ్యమే పాశ్చాత్య దేశాలను భయపెడుతుందా..? అందుకే, భారత్‌పై అమెరికా కుట్రలు పన్నుతుందా..?
అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ గోతులు తవ్వుతుందా?
అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఇండియా వెనుక గోతులు తవ్వుతున్నారా..? పరిస్థితులన్నీ అలాగే కనిపిస్తున్నాయి. అందుకే, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దీనిపై తీవ్రంగా మండిపడుతుంది. బిజెపి పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తాజాగా అమెరికా డీప్ స్టేట్ చేస్తున్న కుట్రలపై మాట్లాడారు. మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని, అమెరికాకు చెందిన ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్’ కన్నింగ్ వ్యూహాలు పన్నుతుందని ఆరోపించారు. అమెరికా డీప్ స్టేట్ నుండి జరుగుతున్న కుట్రను మొట్టమొదటి సారి బిజెపి అధికారికంగా ఖండించిన ఈ సందర్భం, ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాశమయ్యింది.
ఆర్గనైజ్డ్ నేరాలు, అవినితిపై OCCRP ప్రత్యేక నివేదికలు
ఓసీసీఆర్పీ-‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్’.. ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాల్లో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరుతో బలమైన నెట్‌వర్క్ ఉన్న అమెరికా సంస్థ. ఆర్గనైజ్డ్ నేరాలు, అవినితికి సంబంధించిన వ్యవహారాలపై ప్రత్యేక నివేదికలు తయారుచేస్తూ అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆడమన్నట్లు ఆడే ఒక గ్లోబల్ సంస్థ. ఇదే సంస్థ ఇప్పుడు భారతదేశాన్ని విచ్ఛిన్నంచేసే ప్లాన్లు చేస్తోంది. అభివృద్ధి నిరోధక కుట్రలకు తెరలేపుతోంది.
భారత్, అగ్రదేశం అమెరికా చెప్పుచేతల్లోనే ఉండాలనే విధంగా వ్యూహాలు పన్నుతోంది. ప్రతీ పార్లమెంట్ సమావేశాలకు ముందు భారత వ్యాపార, వాణిజ్యాలతో పాటు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఈ సంస్థ ఎప్పటి నుండో ప్రయత్నిస్తుందనీ.. ముఖ్యంగా, మోడీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచడానికి అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అజెండా వెనుక ఇది ఉన్నట్లు, బిజెపి ఎంపీ సుధాన్షు త్రివేది ఇటీవల పార్లమెంట్‌లో కూడా ప్రకటించారు. తాజాగా, ఓ ప్రెస్ మీట్‌లో దీనిపై సుదాన్షు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మానవ హక్కుల ప్రాక్టీసెస్ వార్షిక కంట్రీ రిపోర్ట్
ఎంపీ సుదాన్షు ప్రస్తావించిన వాటిలో.. మూడు కీలక పాయింట్లు ఆసక్తిని రేపుతున్నాయి. ఒకటి, అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్.. దాని ఫండింగ్‌తో నడిచే ఓసీసీఆర్పీ, దాన్ని వెనకుండి నడిపించే జార్జ్ సోరోస్ అనే ప్రముఖ అమెరికన్ ఇన్వెస్టర్, వ్యాపారవేత్త. సుదాన్షు ప్రెస్ మీట్‌లో కేంద్రంలో ప్రతిపక్షాన్ని కూడా కలిపినప్పటికీ.. దాని రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఆలోచిస్తే.. భారతదేశాన్ని అస్థిరపరచడానికి అమెరికాకు అనుబంధంగా నడుస్తున్న ఓసీసీఆర్పీ, దాని వెనుక ఉన్న జార్జ్ సోరోస్ కీలకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
మోడీ ప్రభుత్వాన్ని నిందించడంలో భాగంగా, కేంద్రంలోని ప్రతిక్ష నేతలను జార్జ్ సోరస్ పావులుగా వాడుకుంటున్నారంటూ బిజెపి ఎప్పటి నుండో ఆరోపిస్తోంది. ఆ మధ్య, అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన మానవ హక్కుల ప్రాక్టీసెస్ వార్షిక కంట్రీ రిపోర్ట్ ప్రకారం, సోరోస్‌కు వ్యతిరేకంగా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని “యాంటిసెమిటిజం” విభాగంలో చేర్చారు.
సోరోస్‌పై సంచలన ఆరోపణలు చేసిన మంత్రి జైశంకర్
మొదటి నుండీ సోరస్‌ను వ్యతిరేకిస్తున్న బిజెపి పార్టీ అధికారిక వైఖరిపై అమెరికా ఈ ఆరోపణలు చేసింది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ రూపొందించిన ఈ రిపోర్ట్‌లో భారత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి ఎస్. జైశంకర్ పేరు డైరెక్ట్‌గా ప్రస్తావించనప్పటికీ.. సోరోస్‌పై ఆరోపణలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారనే విధంగా వ్యాఖ్యలు చేసింది. గతంలో, మంత్రి జైశంకర్.. జార్జ్ సోరోస్‌ను ఉద్దేశిస్తూ… ఆయన అభిప్రాయాలు ప్రమాదకరమైనవనీ, సోరోస్ చాలా డేంజరస్ వ్యక్తి అంటూ అభివర్ణించారు.
ప్రపంచం మొత్తం ఆయన అభిప్రాయాల ప్రకారమే పనిచేయాలనుకునే వ్యక్తి అంటూ విమర్శించారు. దీని వెనకున్న కారణం, గతంలో సోరోస్ అభిప్రాయాల ప్రకారం.. భారతదేశంలో మోడీ ప్రభుత్వం.. భారత్‌లోని జర్నలిస్ట్‌లకు, యాక్టివిస్ట్‌లకు, మానవ హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని వెల్లడించారు. కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాది హత్యలో భారత్ ప్రమేయం గురించి కూడా అందులో ప్రస్తావించారు. ఇక, దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలపై కూడా సోరస్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడారు. అదానీ అవినీతికి మోడీ ప్రభుత్వానికి లింక్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదానీ వ్యవహారంలో ప్రధాని మోడీ సంజాయిషీ
సోరోస్ వ్యాఖ్యలు చూస్తేంటే.. అదానీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రధాని మోడీ మౌనంగా ఉండటాన్ని అనుమానిస్తున్నట్లు స్పష్టంగానే తెలుస్తుంది. అలాగే, అదానీ వ్యవహారంలో ప్రపంచ దేశాల ముందు ప్రధాని మోడీ సంజాయిషీ ఇచ్చుకోవాలానీ.. భారత పార్లమెంట్‌లో మోడీ చాలా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క సందర్భంలోనే కాదు.. గతంలో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారి రాబర్ట్ గిల్ క్రిస్ట్ కూడా ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోడీ ప్రభుత్వం మానవ హక్కులకు భగం కలిగిస్తుందనీ.. అందుకే, మోడీ ప్రభుత్వం తరుచుగా పౌర హక్కుల సంఘాలను కలుస్తూ.. కేవలం చర్చించడమే కాదు, భారతదేశంలో పౌర హక్కులపై వారి అభిప్రాయాలను కూడా పరిగణించాలని సూచించారు. అయితే, ఈ పరిణామాలన్నీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భారత్, భారత ప్రభుత్వం అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ చెప్పిన విధంగా నడుచుకోవాలనే సూచనలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే, దీని వెనుక కథ నడిపిందంతా అమెరికాకు చెందిన ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్’ అన్నది ఇప్పుడు బిజెపి చేస్తున్న వాదన.