Bigg Boss..బిగ్ బాస్ (Bigg Boss).. ఈ రియాల్టీ షో కి ఎంత పెద్ద క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ బిగ్ బాస్ అంటూ ఉంటారే కానీ ఆయన ఎవరో మనకు కనిపించరు. తెర వెనుక దాగుండి ఆటాడించే ఆ బిగ్ బాస్ ఎవరు? ఎలా ఉంటాడో? తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. ఎక్కడో విదేశాలలో బిగ్ బ్రదర్ అంటూ రియాల్టీ షో గా ప్రాచుర్యం పొందిన ఈ టెలివిజన్ షోని బిగ్ బాస్ గా ఇండియాకి తీసుకురావడం జరిగింది. 2006లో నటుడు అర్షద్ వార్షి హోస్ట్ గా బిగ్ బాస్ హిందీ ఫస్ట్ సీజన్ ప్రారంభం అయ్యింది. అప్పటినుంచి ఈ షో కొనసాగుతూనే ఉంది.
బిగ్ బ్రదర్ గా ప్రారంభం..
ఇకపోతే శిల్పా శెట్టి (Shilpa Shetty), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan),సంజయ్ దత్(Sanjay dutt) వంటి అగ్రతారాలు కూడా ఈ షోకే హోస్ట్ గా వ్యవహరించారు. ఇక సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ ఖాన్(Salman Khan)తన మార్క్ హోస్టింగ్ స్కిల్స్ తో సెటిల్ అయిపోయారు. ప్రస్తుతం హిందీలో 18వ సీజన్ నడుస్తోంది. ఇప్పటికీ కూడా ఆయనే బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగు కార్యక్రమం విషయానికి వస్తే.. హిందీలో మొదలైన పదేళ్లకి అంటే 2017లో స్టార్ మా బిగ్ బాస్ షోని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)హోస్ట్ గా మొదటి సీజన్ మొదలయ్యింది. టాప్ సెలబ్రిటీలందరూ పాల్గొన్నారు. అంతేకాదు ఈ సీజన్ సూపర్ హిట్ అయిపోయింది. ముఖ్యంగా ఈ షో గురించి పూర్తిగా అవగాహన లేకపోయినా ఆడియన్స్ మాత్రం ఎగబడి చూశారు. దీనికి తోడు ఎన్టీఆర్ హోస్టింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక మొదటి సీజన్లో విన్నర్ గా శివబాలాజీ నిలిచారు. ఇక ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఎన్టీఆర్ సీజన్ 2 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వచ్చారు. నానికి మాత్రం యావరేజ్ గా మార్కులు పడ్డాయి. ఇక ఆ తర్వాత సీజన్ 3 కి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున(Nagarjuna) తన హోస్టింగ్ తో ఇక్కడే సెటిల్ అయిపోయారు. ముఖ్యంగా బెంచ్ మార్క్ సెట్ చేసిన ఈయన ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కి కూడా హోస్ట్ గా చేస్తూ ఉండడం గమనార్హం. దీనికి తోడు ఈ సీజన్ లు అధిక టిఆర్పి రేటింగ్ ను కూడా రాబడుతున్నాయి.
బిగ్ బాస్ ఎవరంటే..?
ఇకపోతే ఈ రియాల్టీ షో ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది కానీ ఈ సక్సెస్ కు ప్రధాన కారణమైన బిగ్ బాస్ పాత్ర తెరవెనకే ఉంటుంది. గంభీరమైన స్వరంతో కంటెస్టెంట్స్ కి ఆదేశాలిచ్చే బిగ్ బాస్ గొంతు ప్రేక్షకుల్లో ఎక్కడ లేని క్యూరియాసిటీని కలిగిస్తుంది. బిగ్ బాస్ ను ప్రేక్షకులు ఒక్కసారైనా చూడాలని కోరుకుంటారు. ఎలాంటి ఎమోషన్స్ చూపించకుండా కేవలం రూల్స్, రెగ్యులేషన్స్ మాత్రమే మాట్లాడుతూ కంటెస్టెంట్స్ ని గైడ్ చేస్తూ ఉంటారు. చివరికి హోస్ట్ నాగార్జున కూడా బిగ్ బాస్ మాటలు వినాల్సిందే. ఎవరీ బిగ్ బాస్ అంటే వాస్తవానికి ఎవరూ లేరు. అది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ మాత్రమే. బిగ్ బాస్ వాయిస్ ని మాత్రం రేణుకుంట్ల శంకర్ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన చాలాకాలంగా సినిమాలు, సీరియల్స్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారు. ఈ క్యారెక్టర్ వాయిస్ చాలా చక్కగా సెట్ అయింది. ఇకపోతే ఇప్పుడు ఎనిమిదవ సీజన్ మరో వారంలో పూర్తి కాబోతోంది.