Vishnu Kumar Raju: విశాఖ రాజకీయాల్లో డిఫరెంట్ పర్సన్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు… ఆయ ఏం మాట్లాడినా ఓ సంచలనమే….విష్ణుకుమార్ రాజు నోట మాట వస్తే ప్రతిపక్షాలకే కాదు సొంత పార్టీకి, ప్రభుత్వానికి కూడా నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లే … ఏ క్షణాన ఆయన వాయిస్ ఎలా మారుతుందో ఎవ్వరు అర్థం చేసుకోలేకపోతున్నారు.. ఆ క్రమంలో మొన్న రిషికొండ ప్యాలస్ గురించి, ఇప్పుడేమో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి విష్ణుకుమార్ రాజు చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయంట… గతంలో ప్రభుత్వంపై విపక్షాలు చేసే విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విష్ణుకుమార్ రాజు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలపై నెగటివ్ కామెంట్స్ చేయడం వెనక ఉన్న వ్యూహం ఏంటి?
విశాఖ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేరు వినిపిస్తే చాలు అది అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైన ఒక్కసారిగా అప్రమత్తం అవ్వాల్సిందే…. ఎందుకంటే విష్ణుకుమార్ రాజు అన్ ప్రెడిక్టబుల్ పొలిటిషన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు… ఏ రాజకీయ నాయకుడికైనా తన స్టాండ్ ఎలా ఉండబోతుంది, తాను పనిచేస్తున్న పార్టీకి గాని ప్రభుత్వానికి గాని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా రాజకీయాన్ని నడపాలి అని ఆలోచిస్తారు… కానీ విష్ణుకుమార్ రాజు మాత్రం ప్రస్తుత రాజకీయ ప్రయాణంలో ఎవరికి అర్థం కాకుండా తన మనసులో ఏది అనుకుంటే అది బయట పెడుతూ ఒక్కసారి ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేలాగా, అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేలాగా వ్యాఖ్యలు చేస్తూ అందరికీ తలనొప్పిగా మారుతున్నారంట.
వైసీపీతో విభేదించిన అధికార కూటమితో కలిసిమెలిసి తిరుగుతున్న విష్ణుకుమార్ రాజు మనసులో ఏదైనా అనుకుంటే .. అది మాట్లాడేస్తారని.. తనమన అన్న తేడా లేకుండా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తారు అనే భయం మిగిలిన నాయకుల్లో కనిపిస్తుంది… ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో విభేదిస్తున్న విష్ణుకుమార్ రాజు తన సొంత ఇమేజ్ ను డెవలప్ చేసుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అనేది అర్థం కాక సొంత పార్టీ నాయకులు జుట్టు పీక్కుంటున్నారు.
విష్ణు కుమార్ రాజు ఏం మాట్లాడినా ఓ సంచలనమే… కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే విష్ణుకుమార్ రాజు … రిషికొండ ప్యాలెస్ ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో పూర్తిగా విభేదించారు…. రిషికుండ పాలేస్‌ను ఎలా వినియోగంలోకి తీసుకురావాలనే అంశంపై మంత్రుల కమిటీ ప్రజాభిప్రాయ సేకరణతో పాటు అనేక సంస్థల అభిప్రాయాలను తీసుకుంది. కీలకమైన నాలుగు సంస్థల అభిప్రాయాలతో ఏకీభవించి, అప్పగించడానికి రంగం సిద్ధం చేస్తున్న తరుణంలో విశాఖ నార్త్ బిజెపి ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రిషికొండ పాలస్ భవనాల అన్నింటిని టీటీడీకి అప్పగించాలని ప్రతిపాదన తెరమీదకు తీసుకొచ్చారు.
ముఖ్యంగా రిషికొండ ప్యాలస్ కు ఎదురుగా కొండపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండడంతో టీడీడీకి అప్పగిస్తే వివాహాలతో పాటు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపే అవకాశం ఉంటుందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు… రుషికొండ ప్యాలెస్ భవనాలను టీటీడీకి అప్పగించాలనే నిర్ణయం బీజేపీకి సంబంధించినది కాదు తన వ్యక్తిగత ఆలోచన అని చెప్తూ లేనిపోని కలకలం సృష్టించారు…. రిషికొండ భవనాలపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన విష్ణుకుమార్ రాజు 20 రోజులు తిరగకముందే ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన భోగాపురం ఎయిర్పోర్ట్ అంశాన్ని తెర మీదగా తీసుకువచ్చి మరో కొత్త వివాదానికి తెర తీశారు
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళే కంటే వందేభారత్ లో విజయవాడ చేరుకోవడం సులభం అంటూ బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఎయిర్‌పోర్ట్ కనెక్టింగ్ రోడ్లు పూర్తివడానికి సమయం పడుతుంది కాబట్టి విమానాశ్రయం కంటే అదనంగా రెండు వందే భారత్ రైళ్లు వేయమని అధికారులను కోరినట్లు విష్ణుకుమార్ రాజు చెప్పడంతో మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు బిజెపి ఎమ్మెల్యే మద్దతు తెలిపినట్లైంది… విశాఖ నుంచి భోగాపురం వెళ్లడానికి ప్రస్తుతం రెండున్నర గంటల సమయం పడుతుంది కాబట్టి విశాఖ నుండి రెండు వందే భారత్ రైళ్లు నడిపితే భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకునే సమయం కంటే ముందుగానే విజయవాడకు చేరుకోవచ్చని రాజుగారు సెలవిచ్చారు..
అలాగే వైజాగ్ ఎయిర్‌పోర్టును మూసి వేయకుండా యథావిథిగా కొనసాగించడానికి ప్రజాభిప్రాయం తీసుకోవాలని డిమాండ్ చేశారు… విశాఖ ఎయిర్‌పోర్టు మూసివేతకు తాను వ్యతిరేకమని కుండ బద్దలు కొట్టినట్టు బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పడంతో కూటమి పార్టీ పెద్దలకు విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదంట… గతంలో ప్రభుత్వం మీద విపక్షాలు చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వచ్చిన విష్ణుకుమార్ రాజు ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తుండడంతో కూటమి ప్రభుత్వానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదంటున్నారు
ఎప్పుడు వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే విష్ణుకుమార్ రాజు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అయిన బిజెపి ఎమ్మెల్యేగా ఉండి చేస్తున్న వ్యాఖ్యల్లో స్వతంత్ర వైఖరి ఎక్కువగా కనిపిస్తోంది. ఆ క్రమంలో ఆయన కూటమిలో తన ప్రత్యేకత గుర్తింపును చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారా? లేక విశాఖ రాజకీయాల్లో తన మాటకు ఉన్న వెయిట్ ను మరింత పెంచుకునే వ్యూహం పన్నుతున్నారా? అనే చర్చ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మొదలైంది…
ఉత్తరాంధ్ర బీజేపీలో కీలకమైన నాయకుడిగా ఉండడమే కాకుండా, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటూ, విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు విష్ణుకుమార్రాజు. అయినా ప్రభుత్వ నిర్ణయాల్లో తన సూచనలు పట్టించుకోవడం లేదనే ఆలోచనతో, భవిష్యత్తు రాజకీయ సమీకరణాల్లో తన పాత్ర తగ్గిపోతుందనే ఆందోళనతో విష్ణుకుమార్ రాజు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ మొదలైంది. అయితే విష్ణుకుమార్ రాజు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూనే.. వాటితో ప్రభుత్వానికి గాని పార్టీకి గాని ఎలాంటి సంబంధం లేదని చెప్పడం వింతగా కనిపిస్తుంది. ఆయన స్ట్రాటజీ బీజేపీ రాజకీయ వ్యూహాల్లో భాగమేమో? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏ రకంగా అయినా పార్టీని బలోపేతం చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది… అందులో భాగంగానేపార్టీలో కీలకంగా ఉండే వారితో మాట్లాడిస్తూ.. పార్టీ స్టాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, ఇదోరకమైన స్ట్రాటజీ అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
విష్ణుకుమార్ రాజు లేవనెత్తుతున్న కాంట్రవర్సీలపై కూటమి భాగస్వామ్య పార్టీలు ఆలోచన చేసేలోపే మరో వివాదంతో రాజుగారు సిద్ధంగా ఉంటుంన్నారు… ఎవరి మాట వినని, ఎవరికీ సమాధానం చెప్పడానికి ఇష్టపడని విష్ణుకుమార్ రాజును కట్టడి చేయలేని కూటమి ప్రభుత్వం చేసేదేమీ లేక, బీజేపీ కేంద్ర కమిటీకి ఫిర్యాదు చేయలేక, ఉత్తరాంధ్రవ్యాప్తంగా తీసుకునే కొన్ని నిర్ణయాలను వాయిదా వేస్తూ కాలయాపన చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది… ఏదేమైనా తన వ్యాఖ్యలతో, ప్రశ్నలతో విపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేసే విష్ణుకుమార్ రాజు కూటమి ప్రభుత్వంపై ఇప్పుడెందుకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారనే సందేహాలు మొదలవుతున్నాయి…
విశాఖ రాజకీయాల్లో విష్ణుకుమార్ రాజు క్రెడిట్ కోసం పాకులాడుతూ, భోగాపురం ఎయిర్‌పోర్టును భారత్ రైళ్లతో సమానంగా పోలుస్తూ వ్యాఖ్యలు చేయడంతో అధికార ,ప్రతిపక్ష పార్టీలు కొత్త ఆలోచన చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది… అసెంబ్లీలో ప్రశ్నలు అడిగినా, అసెంబ్లీ బయట జరిగే సభలు, సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడినా, విష్ణుకుమార్ రాజు తన ఇమేజ్‌కు ఎక్కడ డామేజ్ కాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు… ప్రభుత్వంపై అసహనం ఉంటే నేరుగా చెప్పే విష్ణుకుమార్ రాజు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తుండడంతో పొలిటికల్ గా ఇది కూటమి ప్రభుత్వానికి మాస్టర్ స్ట్రోక్ లాంటిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Story by: Ajay, Big Tv