అనూహ్య, సంచలన నిర్ణయాలకు కేరాఫ్ బీజేపీ. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసాధ్యమనుకున్న ఎన్నో పనులను సుసాధ్యం చేసింది. కానీ ఇదే స్ట్రాటజీని ఇప్పుడు పార్టీ అంతర్గత నిర్ణయాల్లో కూడా చూపిస్తోంది. దీనికి లెటెస్ట్ ఎగ్జాంపుల్.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరన్న దానిపై తీసుకున్న నిర్ణయం. నబీన్ సిన్హా అనే కొత్త మొఖాన్ని ఇప్పుడు దేశంతో పాటు.. ఆ పార్టీ నేతలకు పరిచయం చేసింది. ఇంతకీ ఎవరీ నబీన్ సిన్హా? అతని పేరును సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి?
మాములుగా భారతీయ జనతా పార్టీలో ఏదైనా పదవి దక్కించుకోవాలంటే చాలా అర్హతలు ఉండాలి. ఇతర పార్టీల్లో ఉన్నట్టు.. అప్పుడే వచ్చిన నేతలకో.. పరపతి ఉన్న నేతలకో పదవులు కట్టబెట్టడం బీజేపీ హిస్టరీలోనే లేదు. అలాంటిది పార్టీలో అత్యంత కీలకమైన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బాధ్యతలను ఇకపై నితిన్ నబీన్ సిన్హా చేపట్టబోతున్నారనే ప్రకటన.. ఇతర పార్టీల నేతలనే కాదు.. సొంత పార్టీ నేతలను కూడా కాస్త షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి.
నితిన్ నబీన్ సిన్హా…అసలు ఎప్పుడూ ఈ పేరు పెద్దగా వినలేదు.. ఎక్కువగా అతడిని చూసింది లేదు.. జాతీయ రాజకీయాల్లో కూడా కనిపించలేదు. అసలు అతని వయసు కూడా పెద్దగా లేదు.. కనీసం ఓ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా లేదు.. అలాంటి వ్యక్తిని ఏకంగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కూర్చోబెట్టింది బీజేపీ అధిష్టానం. ఎప్పుడైతే ఈ పేరును అనౌన్స్ చేశారో.. అప్పటి నుంచి ఒకటే ప్రశ్న. అసలెవరీ నితిన్ నబీన్?
నితిన్ నబీన్ సిన్హా.. బీహార్‌కు చెందిన బీజేపీ నేత. అతని వయసు 45 ఏళ్లు మాత్రమే. అతను ఐదోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో.. ప్రస్తుతం నితీష్ కుమార్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. నబీన్‌ది కాయస్థ సామాజికవర్గం. పాట్నాలోనే పుట్టి పెరిగినా.. స్కూలింగ్, కాలేజ్ మాత్రం ఢిల్లీలో పూర్తి చేశారు. బాంకీపుర్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2006 నుంచి ఇప్పటి వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు. రెండు సార్లు బీహార్ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
నిజానికి బీజేపీలో ఇలాంటి పదవులు దక్కాలంటే RSS అనుగ్రహం ఉండాలనే వాదనలు వినిపిస్తాయి. మరి ఇతని పేరును రిఫర్ చేసిందో లేదో తెలియదు కానీ.. నబీన్ మాత్రం RSS నేపథ్యం ఉన్నవాడే. 20 ఏళ్ల వయసులోనే బీజేపీలో చేరారు. అప్పటి నుంచి కాషాయ జెండా కోసమే పనిచేస్తున్నారు.
నితిన్ తండ్రి నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కూడా బీజేపీ నేతనే. ఆయన జన సంఘ్ నుంచి బీజేపీతోనే అడుగులు వేశారు. ఆయన పాట్నా వెస్ట్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇదీ నబీన్ నేపథ్యం. అయితే ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతలు బీజేపీలో అనేకం. కానీ ఎవరికి దక్కని అదృష్టం అతనికే ఎందుకు దక్కిందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే బీహార్ పాలిటిక్స్‌పై కాస్తంత అవగాహన ఉన్నవారికైతే.. నబీన్ అనగానే.. హార్డ్ వర్కింగ్, అందరితో సమన్వయం చేసుకునే సత్తా ఉన్నవాడు, ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని వ్యక్తి, లో ప్రొఫైల్ మెయింటేన్ చేసే వ్యక్తి అని అర్థమవుతుంది. బహుశా అతనిలో ఈ క్వాలిటీస్ అన్నింటిని గమనించే బీజేపీ అధిష్టానం అతనికి పిలిచి పదవి ఇచ్చి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.
ఎన్నికల సమయంలో నితిన్ నబీన్ సిన్హా పనితీరును చాలా మంది ప్రశంసించారు. పార్టీ యూత్ వింగ్ లీడర్ నుంచి ఎదుగుతూ వచ్చిన నబీన్.. అనేక ఎన్నికల్లో బీజేపీ గెలుపులో తనవంతు పాత్ర పోషించాడనే చర్చ ఉంది. అంతేకాదు బీజేపీ అధిష్టానం ఇచ్చిన కొన్ని కష్టతరమైన టాస్క్‌లను నబీన్ చేసి చూపించాడని చెబుతారు. NDA ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయంలో జరిగిన కొన్ని కీలక సమావేశాల్లో నబీన్‌ది కీలకపాత్ర అని చెబుతారు. ఇక బీహార్‌లో జీవిక దీదీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంలో నబీన్‌ది కీరోల్ అని చెబుతారు. చత్తీస్‌గఢ్ ఎన్నికల సమయంలో కూడా అతని పనితీరుకు ప్రశంసలు దక్కాయి. ఎన్నికలకంటే ఏడాదిన్నర ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తూ వచ్చాడని పార్టీ వర్గాలు చెబుతాయి.
నబీన్‌కు అతని సామాజిక వర్గం కూడా బాగానే కలిసివచ్చిందని చెప్పవచ్చు. కాయస్థ సామాజిక వర్గానికి చెందినవాడు నబీన్. బీహార్‌లో అగ్రవర్ణానికి చెందినదైనా.. ఇతర కులాలతో ఎలాంటి కుంపట్లు లేవు. ఇది కూడా అతనికి కాస్త కలిసివచ్చిందనే చెప్పాలి.
నబీన్‌ను ఎంచుకోవడానికి ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది.. పార్టీ నుంచి ఎప్పటి నుంచో ఉన్న బంధం, ఎన్నికల సమయంలో అతని పనితీరు. రెండోది.. పార్టీ అధినాయకత్వం ఎలా పనిచేస్తుంది.. ఎలాంటి నిర్ణయాలు పార్టీకి అవసరం అనేది పూర్తిగా తెలిసి ఉండటం. మూడోది.. ఎలాంటి టాస్క్ ఇచ్చిన పార్టీ లైన్ దాటకుండా అనుకూలమైన ఫలితాలను తీసుకురావడం.
ఇక పార్టీ వైపు నుంచి ఆలోచిస్తే.. ఇక్కడ నబీన్ వయసు చాలా ముఖ్యమైన అంశం. నబీన్‌కు ప్రస్తుతం 45 ఏళ్లు. పార్టీలో ఇలాంటి పదవిని చెపట్టే వయసు అయితే కాదు. కానీ తర్వాతి తరాన్ని సిద్ధం చేసుకునే వ్యుహంలో భాగంగా ఈ నిర్ణయం ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీలోని అతిరథమహారధులకి వయసు పైబడుతుంది. అందుకే కొత్త తరాన్ని సిద్ధం చేయడంపై పార్టీ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం బీజేపీ చీఫ్‌గా ఉన్న జేపీ నడ్డా పదవికాలం ఎప్పుడో ముగిసింది. ప్రస్తుతం ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఇప్పుడు నబీన్‌ను అతి త్వరలోనే బీజేపీ చీఫ్‌గా నియమించే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నబీన్ సిన్హా నియామకంపై ఎలాంటి అభ్యంతరాలు అయితే వినిపించలేదు. కానీ ఈ నిర్ణయం వెనక ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారనే వాదనలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వెనక వారికో వ్యూహం ఉందని.. అందుకే ఆల్ ఆఫ్ సడెన్ నబీన్ పేరు తెరపైకి వచ్చిందంటున్నారు. ఇంతకీ ఆ ఆరోపణలేంటి? మోడీ, షాలకు నబీన్ నియామకంతో ఒరిగేదేంటి?
నిజానికి బీజేపీ పరిస్థితి మోడీ, షా రాకముందు.. వచ్చిన తర్వాత అని చెప్పవచ్చు. కానీ వీరిద్దరి తర్వాత ఎవరు? అనే ప్రశ్న ఇప్పటికే మొదలైంది. అందుకే కొత్త తరంపై పార్టీ ఫోకస్ చేస్తోంది. అయితే పార్టీపై అప్పుడే పట్టు వదులుకునేందుకు ఈ ఇద్దరు ఇష్టపడటం లేదా? RSS పెద్దల ముందు ఇంకా తమ డిమాండ్లు నేరవేరాల్సిందేనని మొండికేస్తున్నారా? అందుకే నబీన్ పేరును తెరపైకి తీసుకొచ్చారా?
భారతీయ జనతా పార్టీ ఒకప్పటి బీజేపీ కాదు. ఇది నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో నడిచే బీజేపీ. పాత సాంప్రదాయాలను కాస్త పక్కన పెట్టి.. అనేక సంస్కరణలు తీసుకొచ్చి పార్టీకి ఓ కొత్త రూపు ఇచ్చి.. మూడు సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. అలాంటి పార్టీపై వారి పట్టు ఇప్పటి వరకు కొనసాగింది. ఇకపై కొనసాగాలంటే కొత్త తరాన్ని తీసుకురావాలి.. ఆ కొత్త తరం కూడా వారి అడుగు జాడల్లోనే నడిచేవారై ఉండాలి. అందుకే మోడీ, షా ద్వయం నితిన్ నబీన్ సిన్హా పేరును సజెస్ట్ చేసినట్టు చెబుతున్నారు.
ఎవరు అవునన్నా.. కాదన్నా.. బీజేపీ, RSS మధ్య గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఆ గ్యాప్ ఇప్పుడిప్పుడే సద్ధుమణుగుతుంది. ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం అనూహ్యమనే చెప్పాలి. ఈ నిర్ణయం వెలువడటానికి కొన్ని గంటల ముందే మరో కీలక నిర్ణయం తీసుకుంది బీజేపీ అధిష్టానం. యూపీ బీజేపీ చీఫ్‌గా పంకజ్ చౌదరిని నియమించింది. ఇతడికి మోడీ విధేయుడిగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌తో కాస్త విబేధించే వ్యక్తిగా పేరు ఉంది. నిజానికి యోగి వర్సెస్ మోడీ, షా అన్నట్టుగా పార్టీలో పరిస్థితులు ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది తప్పని రుజువు చేసేట్టు అనేక పరిస్థితులను మనం చూశాం.
గతంలో కూడా అమిత్ షా పార్టీ చీఫ్‌గా ఉన్న సమయంలో కూడా అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. జేపీ నడ్డాను పార్టీ చీఫ్‌గా నియమించే ముందు కూడా ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. 2020 జనవరిలో జేపీ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు నబీన్ పేరును కూడా ఇదే తరహాలో అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది.
నిజానికి పార్టీ చీఫ్‌గా ఎవరిని నియమించాలనే దానిపై చాలా నెలలుగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ చీఫ్‌గా రబ్బర్ స్టాంప్‌లాంటి వ్యక్తి వద్దని.. ఓ సమర్థవంతమైన నాయకుడు అవసరమని RSS భావించినట్టు తెలుస్తోంది. మోడీ, షా నీడలో కాకుండా.. వారి తర్వాత అంతకంటే సమర్థవంతంగా పనిచేసే నేత కోసం RSS వెతికినట్టు తెలుస్తోంది. అయితే చివరికి మోడీ, షా తమ పంతం నెగ్గించుకున్నట్టు కనిపిస్తుందనే చర్చ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లో కనిపిస్తోంది.
అసలు నబీన్ జాతీయ స్థాయిలో ఎవరికి తెలియని నేత అని.. అలాంటి నేతను తీసుకొచ్చి ఎలా బాధ్యతలు అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు కొందరు కమలనాథులు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఎప్పుడూ పని చేయలేదని.. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెడితే.. సొంతంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే నబీన్ పనితీరును ప్రశంసిస్తూ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. యువ మోర్చా నేతగా.. చత్తీస్‌గఢ్ ఇంచార్జ్‌గా నబీన్ చాలా బాగా పనిచేశాడని.. ఇప్పుడు కొత్త బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నామంటూ పోస్ట్ పెట్టారు అమిత్ షా. అంతేకాదు.. యువ కార్యకర్తలకు పార్టీ ఎంత గౌరవం ఇస్తుందో తెలుసుకోవడానికి ఈ నియామకమే ఓ నిదర్శనం అంటున్నారు.
మోడీ తర్వాత ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్నాయి బీజేపీ, RSS. ప్రస్తుతం అమిత్ షా, యోగి ఆదిత్యానాథ్ పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పాపులారిటీతో పోల్చుకుంటే.. అమిత్ షా కంటే.. యోగి ముందున్నారని.. అందుకే పార్టీపై పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది.
మొన్నటి ఎన్నికల్లో సీట్లు తగ్గడంతో మోడీ, షా పాపులారిటీ కాస్త తగ్గిందని.. ఇదే అవకాశంగా భావించి RSS పార్టీలో మార్పులు చేర్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుందని చెబుతున్నారు. మళ్లీ పార్టీపై పట్టు సాధించేందుకు RSS ప్రయత్నాలు చేస్తుందని చెబుతున్నారు. కానీ హర్యాణా, మహారాష్ట్ర, బీహార్ ఫలితాలతో మళ్లీ మోడీ-షా ద్వయం తమ పట్టును పెంచుకున్నారని.. అందుకే వారి నిర్ణయాలు అమలవుతున్నాయని తెలుస్తోంది.
నిజానికి నబీన్‌తో పాటు.. ధర్మేంద్ర ప్రదాన్, భూపేంద్ర యాదవ్ పేర్లను రిఫర్ చేసినా.. RSS మాత్రం నబీన్‌కు ఓటు వేసిందని తెలుస్తోంది. మొత్తానికైతే.. నబీన్‌ను కీలక పదవి కట్టపెట్టడంతో మోడీ, షా పాత్ర కీలకమని తెలుస్తోంది. మరి ముందు ముందు తన పనితీరుతో ఈ విమర్శలను మరిచిపోయేలా చేస్తాడా? లేక వారి అడుగు జాడల్లోనే నడుస్తూ పావుగా మారుతాడా? అనేది రాబోయే కాలంలో తెలియనుంది.
Story Vamshi, Big Tv