Rohith Reddy Drug Case: డ్రగ్స్ కేసులో పట్టుబడిన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి విషయంలో ఏం చేయాలనే దానిపై బీఆర్‌ఎస్ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోందంట. రోహిత్ విషయంలో ఏం చేయాలి…ఎలాంటి నిర్ణయం తీసుకుంటే పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ నుంచి బయట పడతాం.. అన్న దానిపై నాయకత్వం మంతనాల మీద మంతనాలు సాగిస్తోందంట. ఆ క్రమంలో రోహిత్ రెడ్డిని వదిలించుకుంటారా?…లేక షోకాజ్ నోటీసుతో సరిపెడతారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
మొయినాబాద్‌లోని తన ఫాం హౌస్‌లో జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకుని అరెస్ట్ అయిన తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలా అని బీఆర్‌ఎస్ అధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోందట. ఫాంహౌస్‌లో రెడ్ హ్యాండెండ్‌గా పట్టుబడిన రోహిత్‌రెడ్డి విషయంలో బీఆర్‌ఎస్ నాయకత్వం ఆలస్యంగా స్పందించి, పార్టీ నుంచి కనీసం సస్పెండ్ చేయకుండా, షోకాజ్ నోటీసుల ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ సైతం ఈ కేసులో డ్రగ్స్ తీసుకుని దొరికిపోవడంతో.. వెంటనే అలర్టైన టీడీపీ… షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు…పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విషయంలో మాత్రం బీఆర్ఎస్ రెండురోజుల తర్వాత షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయంశంగా మారింది. బీఆర్ఎస్ టార్గెట్‌గా అధికార కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుండటంతో బీఆర్ఎస్ తప్పక.. షోకాజ్ నోటీసులు జారీ చేసిందని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది రెండ్రోజుల తర్వాత స్పందించిన గులాబీ పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ అతనికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రోహిత్‌పై చర్యల విషయంలో బీఆర్‌ఎస్ నాయకత్వం ఎందుకు తాత్సారం చేసిందనేది పలు సందేహాలకు తావిస్తోంది. కవిత విషయంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్…డ్రగ్స్ కేసులో అరెస్టైనా మాజీ ఎమ్మెల్యే విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడంలేదనేది అంతుపట్టకుండా తయారైంది. ప్రత్యర్ది పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో.. డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు విధిలేని పరిస్థితుల్లో పార్టీ నేతలు రంగంలోకి దిగారనే చర్చ నడుస్తోంది. పైలెట్ రోహిత్ రెడ్డి వరుస వివాదాలకు కేరాఫ్‌గా మారడాన్ని గులాబీబాస్ సీరియస్‌గా తీసుకుంటున్నట్టు సమాచారం.
తాండూరు నియోజకవర్గం నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన రోహిత్‌రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి పార్టీ నాయకత్వంతో సన్నిహితంగా ఉంటూ పార్టీలో కీలకం మారారు. 2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రోహిత్ రెడ్డి ఫాంహౌస్ కేంద్రంగానే జరిగింది. ఆ కేసులో పార్టీ మారాలంటూ తనను ప్రలోభపెట్టారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయంశం అయింది. రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో స్ట్రింగ్ ఆపరేషన్ చేసి, బీజేపీ వ్యక్తులుగా చెప్పుకొంటున్న ముగ్గురిని అరెస్ట్ చేయించడంతోపాటు అప్పటి బీజేపీ పెద్దలు కొందరిపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆరోపణలు కూడా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తర్వాత రోహిత్‌కు బీఆర్‌ఎస్ నాయకత్వం పూర్తి అండగా నిలిచింది. ఆయనకు వై కేటగిరీ భద్రత కూడా కల్పించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన కోరిన పనులన్నీ చకచకా జరిగిపోయాయంటారు. ఆ సాన్నిహిత్యంతోనే 2023 ఎన్నికల్లో పార్టీలో ఉన్న మహేందర్ రెడ్డిని కాదని….రోహిత్‌కు తాండూరు టికెట్ ఇచ్చింది బీఆర్‌ఎస్. అయితే తాండూరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రోహిత్ రెడ్డి ఓడిపోయారు. ఇటీవల జరిగిన తాండూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సమయంలోనూ వివాదంలో చిక్కుకున్నారు. కౌంటింగ్ సెంటర్‌లోకి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించారనే ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బెంగళూరు డ్రగ్స్ కేసుతో లింకులు ఉన్నాయనే ఆరోపణలతో అంతకు ముందు రోహిత్ రెడ్డిని ఈడీ విచారించింది. తాజాగా ఆయనకే చెందిన ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలంతో పాటు మాజీ ఎమ్మెల్యేకు కూడా డ్రగ్ టెస్ట్ పాజిటివ్ రావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ క్రమంలో రోహిత్‌రెడ్డిని ఇలాగే వదిలేస్తే… పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తోందట బీఆర్‌ఎస్ అధిష్టానం. డ్యామేజ్ కంట్రోల్‌లో భాగంగా మాజీ ఎమ్మెల్యే మీద చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ముందుగా షోకాజ్ నోటీసు ఇచ్చారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని, అది సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తీసుకుంటామని కూడా నోటీస్‌లో పేర్కొన్నారు. అయితే సరిగ్గా ఇక్కడే పార్టీ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైందట. పైలట్ రోహిత్‌రెడ్డికి నోటీస్ అన్నది ఫార్మాలిటీ మాత్రమేనని, వారం రోజుల తర్వాతైనా ఆయన్ని బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేయడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఆయన పార్టీకి లాయల్‌గానే ఉంటున్నా ప్రతిసారి ఏదో ఒక వివాదంతో రచ్చ అవుతోందని, వాటన్నిటికీ మించి ఈ డ్రగ్స్, కాల్పుల ఎపిసోడ్‌తో పార్టీకి బాగా డ్యామేజ్ అయిందని గులాబీ పెద్దలు భావిస్తున్నారంట. ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో పైలట్ రోహిత్ రెడ్డి దొరికిన తర్వాత పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు . ఆ దెబ్బకు పార్టీ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చుకోవాల్సి వస్తోంది.
దీంతో డ్రగ్స్ పార్టీలో పాల్గొనడమే కాకుండా, దాన్ని నిర్వహించిన పైలెట్ రోహిత్ రెడ్డి విషయంలో కఠినంగానే ఉండాలని అధిష్టానం భావిస్తుందనే చర్చ నడుస్తుందట. అందుకే వెంటనే సస్పెండ్ చేయకుండా ప్రొసీజర్ ప్రకారం షోకాజ్ నోటీస్, వారం రోజుల గడువు కూడా ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారట గులాబీ నేతల. పార్టీ నోటీస్‌కు పైలెట్ వివరణ ఇస్తారో లేదోగానీ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు నేతలు. రోహిత్ రెడ్డి విషయంలో భిన్నవాదనలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయట. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారం కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న దానిపై కూడా పార్టీలో చర్చ నడుస్తోందట. ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంలో రోహిత్‌రెడ్డి ద్వారానే వ్యవహారాన్ని మొత్తం నడిపింది బీఆర్ఎస్. ఇప్పుడు డ్రగ్స్ కేసులో రోహిత్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అతను అడ్డం తిరుగుతాడేమో? అని పార్టీ నేతలు కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారంట.
అదే జరిగితే బీఆర్‌ఎస్ నాయకత్వానికి కొత్త తలనొప్పులు మొదలవుతాయంటున్నారు. ఇప్పటికే ఇదే కేసులో మరో ఫిర్యాదుదారుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరి చేస్తున్న విమర్శలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఇలాంటి తరుణంలో రోహిత్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఇబ్బందికర పరిస్ధితులు ఉంటాయనే చర్చ నడుస్తుందట. డ్రగ్స్ కేసు విషయంలో అధికార పార్టీ అటు బీఆర్ఎస్‌తో పాటు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను గట్టిగా టార్గెట్ చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరిగిందని ఆరోపిస్తోంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న రోహిత్ రెడ్డి విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తీవ్ర చర్యలు తీసుకుంటే రోహిత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతాడన్న అంశాలపై బీఆర్ఎస్ భవిష్యత్తు ఆధారపడి ఉందంటున్నారు.
Story By Apparao, Big Tv
Also Read: Pollution Boards: గాలిలో నాణ్యత పరిమాణం ఎంత? పొల్యూషన్ బోర్డులపై నిర్లక్ష్యం.. తప్పు ఎవరిది?